
దసరా ఉత్సవాల్లో కీలకమైన మూలానక్షత్రం సందర్భంగా దుర్గమ్మ సరస్వతీదేవి రూపంలో బుధవారం దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. భక్తులను పోలీసులు కంపార్ట్‌మెంట్‌లలో ఉంచి క్యూలో పంపుతున్నారు. దర్శనం చేసుకున్న వారిని త్వరగా దిగువకు పంపుతున్నారు. రద్దీని క్రమబద్ధీకరించేందుకు 110 హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేశారు. ఆలయ సిబ్బంది ప్రతి భక్తుడికీ ఒక లడ్డూను ఉచితంగా అందజేస్తున్నారు. నగరంలోని వినాయకగుడి, కుమ్మరిపాలెం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. నేడు టికెట్ దర్శనాలను రద్దు చేసి వేకువజామున 3 గంటల నుంచే అందరికీ సర్వదర్శనం కల్పించారు. నేడు 2లక్షలకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.
మూలా నక్షత్రం విశిష్టత ఇదీ..
మూలా నక్షత్రం అమ్మవారి జన్మనక్షత్రం. మహాకాళి, మహాలక్ష్మీ, మహాసరస్వతి శక్తి స్వరూపాలతో దుష్టసంహారం చేసిన తర్వాత దుర్గాదేవిని శరన్నవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్రం రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతీ రూపంలో అలంకరిస్తారు. సరస్వతీదేవిని దర్శించుకోవడం ద్వారా విద్యార్థులు వాగ్దేవి అనుగ్రహం పొంది సర్వ విద్యలలో విజయం సాధిస్తారని నమ్మకం. మూలానక్షత్రం నుంచి విజయదశమి వరకు విశేష పుణ్య దినాలుగా భావించి దుర్గమ్మను ఆరాధిస్తారు. భక్తజనుల అజ్ఞానాన్ని పారదోలి జ్ఞానజ్యోతిని వెలిగించే జ్ఞాన ప్రదాయిని సరస్వతీదేవి. సరస్వతీదేవి దర్శనం.. అఖిల విద్యాభ్యుదయ ప్రదాయకం.





