జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతలు జరిగాయి. మరికొద్ది రోజుల్లో మూడో విడత పోలింగ్ జరగనుంది. అలాంటి వేళ జమ్మూ కశ్మీర్ అంశాన్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత్ కాస్తా ఘాటుగా స్పందించింది. సీమాంతర ఉగ్రవాదానికి పాక్ మద్దతు కొనసాగిందని భారత్ స్పష్టం చేసింది.
దీంతో అనివార్యంగా పరిణామాలను ఆహ్వానిస్తుందంటూ పాక్‌పై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితిలో భారత్ ఫస్ట్ సెక్రటరీ భవిక మంగళానందన్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఉగ్రవాదానికి పాకిస్థాన్ దోహదకారి అని పేర్కొన్నారు. ఈ ఉగ్రవాదంలో ఈ దేశానికి చాలా చరిత్రే ఉందన్నారు. సీమాంతర ఉగ్రవాదం ఆ దేశ యొక్క విధానమని తెలిపారు.
ఐక్యరాజ్య సమితిలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్‌కు సంబంధించిన ప్రత్యేక ఆర్టికల్ 370ని మోదీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. తద్వారా ఆ రాష్ట్ర ప్రత్యేక ప్రతిపత్తిని కోల్పోయిందని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. అనంతరం పాక్, భారత్‌ల మధ్య చర్చలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితిలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో భావిక మంగళానందన్ పైవిధంగా స్పందించారు.
ఆమె ఇంకా ఏమన్నారంటే.. మిలటరీ ఆధీనంలో పాకిస్థాన్ నడుస్తుందని గుర్తు చేశారు. ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల వ్యాపారంతోపాటు అంతర్జాతీయ నేరాలకు సైతం పాకిస్థాన్ ప్రపంచ ఖ్యాతి పొందిందన్నారు. అలాంటి పాకిస్థాన్.. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం దాడి చేసే సాహసానికి దిగుతుందని మండిపడ్డారు. అయినా పాకిస్తాన్ నిజ స్వరూపం ఏమిటన్నది ప్రపంచానికి తెలుసునన్నారు. అందుకు 2001లో భారత పార్లమెంట్‌పై దాడి, 2008లో ముంబయిలో దాడి ఘటనలను ఈ సందర్భంగా భావిక మంగళానందన్ ప్రస్తావించారు.
ప్రపంచంలో జరిగిన అనేక ఉగ్రవాద దాడులపై పాకిస్థాన్ వేలిముద్రలు ఉన్నాయన్నారు. అలాంటిది ఐక్యరాజ్యసమితిలో పాక్ ప్రధాని షరీఫ్ చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం ఆశ్చర్యం కలిగించలేదన్నారు. ప్రముఖ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌కు పాక్ అతిథ్యం ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసింది.