
ప్రపంచ చరిత్రలో మతాల పార్లమెంటు ఒకేసారి జరిగింది. అది కూడడానికి ముఖ్య కారణం క్యాథలిక్ చర్చి. అలాంటిది మళ్ళీ జరుగకపోవడానికి కారణం స్వామి వివేకానంద.
కొలంబస్ అమెరికా ను కనుగొని 400 ఏళ్లు అయిన సందర్భంగా షికాగోలో ఆర్భాటంగా జరిగిన మహోత్సవాలలో ప్రపంచ మతాల పార్లమెంటు ఒక భాగం. ప్రపంచంలోని గొప్ప మతాల ప్రతినిధులను ఒక్క వేదిక మీదకు చేర్చి తమ తమ విశ్వాసాలను, వాటి ప్రాశస్త్యాన్ని లోకానికి వివరించమని అడగాలన్న ఆలోచనే అద్భుతం. మత ద్వేషాలు పెచ్చరిల్లి అనేక దేశాల్లో మతం పేరిట రక్తపాతాలు, మారణకాండ లు చెలరేగుతున్న సమయాన అన్ని మతాలు చెప్పేది విందామన్న విజ్ఞత కలగడమే అపురూపం. అయితే ధ్యేయాలను, సంకల్పాలను నిర్వాహకులు ఎంత ఉదాత్తంగా ఉగ్గడించినా అసలు ఉద్దేశం వేరే ఉంది.
ప్రపంచానికి నాగరికత నేర్పిన ఆసియా ఖండాన్ని, ముఖ్యంగా ఆర్య సంస్కృతి పుట్టినిల్లయిన భారతదేశాన్ని, ఇంకా ప్రపంచంలో అధిక భాగాన్ని రకరకాల రీతుల్లో ఆక్రమించి, క్రైస్తవ రాజ్యాల ఆధిపత్యం కిందికి తెచ్చుకున్నాక క్రైస్తవ మతమే నిజమైన మతం, మిగతా మతాలన్నీ దాని ముందు దిగదుడుపు అని లోకానికి చాటాలన్న మహత్తర ఆలోచన క్రైస్తవ మత పెద్దలు కొందరికి వచ్చింది. తమదే గొప్పది అని నిర్ద్వందంగా నిరూపించాలంటే మిగతా మతాల చేత ఆ సంగతి ఒప్పించాలి కదా? అది జరగాలంటే ప్రధాన మతాలు అన్నిటినీ ఒక దగ్గర చేర్చి, చూపండి మీ సత్తా అని అవకాశం ఇచ్చి, క్రైస్తవం ముందు వెలవెలబోయేటట్టు చేయాలి కదా? అందుకే అసలు ఏమిటో, నకిలీ ఏదో శాశ్వతంగా ఎవరూ మళ్ళీ నోరెత్తకుండా తేల్చి పారేయడం కోసం ప్రపంచ పార్లమెంటు ఎత్తు వేశారు.
ఆ సంగతి స్వయంగా వివేకానందస్వామే చెప్పాడు.
The parliament of Religions was organized with the intention of proving the superiority of the Christian religion. (Complete works of Swami Vivekananda, volume 5, page 64)
( క్రైస్తవ మత ఆధిక్యాన్ని ఋజువు చేసే ఉద్దేశంతోనే మతాల పార్లమెంటును నిర్వహించారు) – అని.
“అంతేకాదు వాళ్ళకి తెలియదు. అది నిజానికి జరుగుతున్నది నాకోసం అని నా మనసు చెబుతోంది. అదే మీకు త్వరలో ధ్రువ పడుతుంది కూడా” అని ఆయన స్వామి తురీయానందకు ముందే చెప్పాడు.
( Spiritual talks by the first Disciples of Sri Ramakrishna page : 254)
ఇక్కడో సందేహం రావచ్చు. వివేకానంద గొప్పవాడే కావచ్చు. కానీ ఆయన షికాగో పార్లమెంటులో అనుకోకుండా ఆఖరి నిమిషంలో వచ్చి చేరిన ప్రతినిధి. అక్కడికి వెళ్ళే దాకా ఆయన ఎవరి ముక్కూ మొగము ఎరుగడు. కనీసం ఆ పార్లమెంటులో పాల్గొనడానికి కొన్ని విధి విధానాలు ఉంటాయన్న సంగతి కూడా ఆయనకు ముందుగా తెలియదు. అలాంటి వాడు పార్లమెంటును పిలవడం వెనక అంతర్యాల గురించి చెప్పింది నిజమని ఎలా నమ్మగలం?
కరెక్టే. నమ్మవద్దు. కానీ ఆ పార్లమెంటు ఏర్పాట్లను, సన్నాహాలను, దానిని నిర్వహించిన తీరును చూసినా, దానికి పూర్వం క్రైస్తవ మత వర్గాలు పడిన మల్లగుల్లాలను గమనించినా క్రైస్తవ మతాధిక్య నిరూపణే అసలు లక్ష్యమన్న సంగతి స్పష్టం. పార్లమెంట్ జనరల్ కమిటీకి చైర్మను, రెవరెండ్ జాన్ హెన్రీ బారోస్. ఆయన First Presbytarian church of Chicago కు పాస్టర్. పార్లమెంటు వేదిక మధ్యన అందరి కంటే ఎత్తుగా ఇనుప సింహాసనం మీద కూర్చుని కార్యక్రమాలకు అగ్రాసనాధిపత్యం వహించింది అమెరికాలో క్యాథలిక్ చర్చికి అత్యున్నత అధికారి అయిన కార్డినల్ గిబ్బన్స్.
అక్కడికీ ఎంత చెప్పినా సాంప్రదాయవాదులయిన క్రైస్తవ మతాధికారులకు ఈ వ్యవహారం నచ్చలేదు. Christian religion is the one religion. I do not understand how that religion can be regarded as a member of parliament of religions without assuming the equality of the Other intended members and purity of their position and claims. (క్రైస్తవ మతం ఒక్కటే మతం. దాన్ని తీసుకుపోయి మతాల పార్లమెంటులో ఒక మెంబర్ గా పరిగణిస్తే మిగతా మెంబర్లు దానితో సమానమైనట్లు అంగీకరించినట్టు కాదా?) అని Archbishop of Canterbury అంతటివాడే నిర్వాహక కమిటీకి ఆక్షేపణ తెలిపాడు. (The world’s parliament of religions, Ed.John Henry borrows, page 22)
అయినా మిగతా క్రైస్తవ అధికారులు ఆ వాదాన్ని అంగీకరించలేదు. క్రైస్తవ మతమే ప్రపంచ మతమని ప్రజలు విస్తృతంగా విశ్వసిస్తున్నారు. ఏసుక్రీస్తును మాత్రమే ఆరాధిస్తున్నారు. అని పార్లమెంటులో తేలి తీరుతుంది. జీసస్ క్రైస్ట్ నిజమైన కేంద్రంగా ప్రపంచ మతాలు అన్నీ తిరిగి ఏకమవుతాయి. క్రీస్తు పేరు ఉచ్ఛరించగానే ఆ బ్రహ్మాండమైన సమూహంలో ప్రతి మోకాలు మోకరిల్లుతుంది. అది మంచిదే కదా? దానికి అభ్యంతరం ఎందుకుండాలి? అంటూ అమెరికాలో పలువురు బిషప్పులు ప్రతివాదం చేశారు. (అదే గ్రంథం 24, 25 పేజీలు)
చివరికి వారి వాదమే నెగ్గింది. ఆగమేఘాల మీద భారీ సన్నాహాలు జరిగాయి. పదివేల ఉత్తరాలు, 40 వేల డాక్యుమెంట్లు రెవరెండ్ బారోస్ గారి కమిటీ నుంచి ప్రపంచం అన్ని మూలలకు వెళ్లాయి. చెప్పుకోదగ్గ ప్రతి మతం వారికి ఆహ్వానాలు అందాయి. 30 నెలల పాటు ప్రపంచంలోని రైలు రోడ్లు, స్టీల్ షిప్ లైన్లు అన్ని మతాల పార్లమెంట్ కోసం నిర్విరామంగా పని చేశాయి. ప్రపంచం అన్ని భాగాల నుంచి ఏకంగా 3000 మంది అడ్వైజరీ కౌన్సిలర్లను నియోగించారు. ఇండియా నుంచి మద్రాసులో ‘హిందూ’ దినపత్రిక సంపాదకుడు జి ఎస్ అయ్యర్, బొంబాయిలో బ్రహ్మ సమాజం నాయకుడు బి బి నాగర్ కార్, కలకత్తాలో అదే సమాజపు పీ సీ మజుందార్ లకు ఆ బాధ్యత అప్పగించారు. దివ్యజ్ఞాన సమాజం తరఫున అనీబిసెంట్ ను, చక్రవర్తిని, కలకత్తాలో మహాబోధి సొసైటీ నిర్వాహకులు ధర్మపాలను, బొంబాయిలో జైన మతాచార్యుడు ముని ఆత్మారాం జీని, పార్లమెంటుకు పిలవనంపారు.
హిందూ పత్రికలో ఎడిటర్ అయ్యర్ వ్రాసిన వ్యాసాల వల్లే షికాగో పార్లమెంటు సంగతి భారతీయులకు తెలిసింది. వివేకానందుని మద్రాసు శిష్యులకు దానివల్లే తెలియవచ్చింది. వివేకానంద పేరే అప్పటికి ఎవరికీ తెలియదు కనుక ఆయన వెనుక ఏ మత సంస్థా లేదు కనుక అతడంటూ ఒకడున్నాడన్న సంగతే షికాగో నిర్వాహకులు ఎరుగరు. బ్రహ్మ సమాజానికి, దివ్య జ్ఞాన సమాజానికి, జైన బౌద్ధ మతాలకు తమకు ఎదురు నిలిచే సత్తా లేదని తెలుసు కనుక ఇండియా నుంచి వారొచ్చినా తమను ఏమీ చేయలేరని క్రైస్తవ వర్గాల ధీమా. “రానిద్దాం. మాట్లాడిద్దాం. మన ముందు చేతులెత్తేస్తే సంతోషిద్దాం.” అనుకున్నారు వారు.
మామూలుగా అయితే అలాగే జరిగేదే. కానీ ఊహించని ఉపద్రవంలా చిచ్చరపిడుగు వివేకానంద హఠాత్తుగా ఊడి పడ్డాడు. మొత్తం గేమంతా పాడు చేశాడు.
వివేకానంద అమెరికాకు ఎంత కంగాళీగా వెళ్ళాడంటే అతడి స్థానంలో వేరేవరున్నా షికాగో పార్లమెంటు సభలోకి ప్రవేశం దొరకటం అసంభవం. కన్యాకుమారిలో మూడు రోజులు నిరాహారంగా ఘోర తపస్సు చేశాక ఆయనకు అధోగతి పాలైన దేశాన్ని దారిద్ర్య కూపం నుంచి ఉద్ధరించటానికి పాశ్చాత్య దేశాలకు పయనమవ్వాలన్న ఆలోచన వచ్చింది. మద్రాసులో అలసింగ పెరుమాళ్ వంటి మిత్రులు షికాగో పార్లమెంటు గురించి చెప్పి అక్కడికి మీరు వెళ్లి తీరాలని బలవంతపెట్టాక… గురుదేవుడు కూడా కలలో సముద్రాన్ని చూపించి సంకేతం ఇచ్చాక స్వామి ‘సరే’ అన్నాడు. ‘మిగతా ఏర్పాట్లు శిష్యులు చూసుకుంటారు కదా?’ అనుకున్నాడు.

ఖేత్రీ మహారాజా
మద్రాసు శిష్యులు ఇల్లిళ్ళూ తిరిగి ఆయన ప్రయాణానికి చందాలైతే వసూలు చేశారు. కానీ ప్రపంచ స్థాయిలో మహామహులెందరో పాల్గొనే చారిత్రాత్మక మహా సభకు కొన్ని నిబంధనలు ఉంటాయని, ప్రతినిధిగా వెళ్ళదలచినవారు కొన్ని ఫార్మాలిటీలను పూర్తి చేయాలని తాము ఏ మత శాఖకు ప్రాతినిధ్యం వహిస్తారో, ప్రాతినిధ్యం వహించేందుకు తమకున్న అధికారం, అర్హత ఏంటో, తాము చెప్పేది నిజమని సాధికారికంగా ధృవీకరించేది ఎవరో ముందుగా తెలపాలని వారు ఎరుగరు. నిబంధనల మేరకు విధి విధానాలను సకాలంలో పూర్తి చెయ్యకపోతే సభలో అడుగుపెట్టనివ్వరని వారికి ఎవరూ చెప్పినట్టు లేదు. “మన స్వామి దివ్య తేజస్సు చూసి ఎవరు డంగైపోరు? ఆయనంతటి వాడిని అడ్డుకునేది ఎవరు?” అని వారికి గొప్ప వెఱ్ఱి నమ్మకం. స్వామికి ఓడలో ఫస్ట్ క్లాస్ టిక్కెట్ కొని ఇచ్చి సాగనంపిన ఖేత్రీ మహారాజా ఏమో “మద్రాసు వాళ్ళు ఈ పాటికి అంతా ఏర్పాట్లు చేసే ఉంటారు కదా?” అనుకున్నాడు. అందుకే తన కార్యదర్శిని వెంట ఇచ్చి పంపి స్వామికి ఖరీదైన సూట్లు, బూట్లు, తలపాగాలు గట్రా కొనిపెట్టాడే తప్ప ఫార్మాలిటీల సంగతి పట్టించుకోలేదు. 400 ఏళ్ళ కొలంబస్ వేడుకలలో భాగంగా పార్లమెంటు జరుగుతుందనుకోవటమే కానీ ఖచ్చితంగా ఏ తేదీలలో అన్నది శిష్యులు ఆరా తియ్యలేదు. 1893 జూలైలో చికాగోలో వరల్డ్ ఫెయిర్ మొదలు కనుక పార్లమెంటూ అప్పుడే కాబోలని ఊహించారు. తప్పులో కాలేశారు. అవేవీ తెలియకుండానే వివేకానంద ఓడ ఎక్కేశాడు.
వింటుంటే బారిష్టర్ పార్వతీశం కథ గుర్తొస్తోంది కదా? నిజమే. అంత పనీ జరిగేదే. కానీ వివేకానంద ప్రయాణం వెనుక దైవ ప్రేరణ ఉంది. దివ్య సంకల్పం ఉంది. మనుషులు తప్పు చేస్తేనేమి దేవుడు సరిదిద్దాడు. కావలసినవన్నీ చకచకా అమర్చి అయోమయపు పుంతలో ఆయనకు పూలదారి పరిచాడు.
1893 మే 31న బొంబాయిలో బయలుదేరిన వివేకానంద రెండు అంచెల మీద వాంకోవర్లో జులై 25న ఓడ దిగి అక్కడినుంచి రైలులో షికాగో చేరాడు. ఆ ట్రైన్లోనే దైవికంగా బోస్టన్ లేడీ మిస్ క్యాథరిన్ శాంబర్న్ ను కలిశాడు. ఆరడుగుల రెండు అంగుళాల ఎత్తు, ప్రఖ్యాత ఇటాలియన్ హీరో శాల్వినికున్నంత అందం, ప్రపంచాన్ని తానే పరిపాలిస్తున్నాడా? అన్నంత రాజసం, మెరిసే కళ్ళు, సంభాషణా చాతుర్యం మొత్తం కలిసి మగటిమికి అద్భుతమైన నమూనాగా ఆమె కంటికి స్వామి కనపడ్డాడు. పరిచయం చేసుకుని కబుర్లలో పడ్డాక ఆయన విద్వత్తు, దివ్య తేజస్సు ఆమెకు ముచ్చటగొలిపాయి. బోస్టన్ వస్తే తప్పక తన ఆతిథ్యం స్వీకరించాలని మరీ మరీ చెప్పి తన విజిటింగ్ కార్డు ఇచ్చి మిస్ కేట్ సెలవు తీసుకుంది.

చికాగోలో దిగాకగాని వివేకానందకు తెలియలేదు – ప్రపంచ పార్లమెంట్ ప్రారంభానికి ఇంకా ఆరు వారాలు పడుతుందని! దానికి ప్రవేశం దొరకాలంటే ప్రతినిధిగా గుర్తింపు పత్రం ఉండాలని! దానికి దరఖాస్తు చేసుకోవడానికి కూడా గడువు ఏనాడో చెల్లి పోయిందని! స్వామికి దిక్కు తోచలేదు. తెచ్చుకున్న డబ్బంతా హోటళ్లకు, తిండికి, తిరుగుళ్ళకు హారతి కర్పూరంలా హరించుకు పోతున్నది. ప్రతినిధిగా గుర్తింపు పొందే ఆశ ఎలాగూ లేదు. మాట్లాడే అవకాశం దొరికే ముచ్చటే లేదు. ఎలాగూ ఇంత దూరం వచ్చాము కనుక జనంలో కూర్చుని పార్లమెంటును చూద్దాం అనుకున్నా దాని పుణ్యకాలానికి ఇంకా నెల పైగా పడుతుంది. ఈ లోపు హోటల్ ఖర్చులు భరించడానికి సొమ్ము సరిపోదు. మరి ఏమి చేద్దాం? అని ఆలోచిస్తే స్వామికి మిస్ శాంబర్న్ గుర్తుకొచ్చింది. ఆమె ఉండేది బోస్టన్లో. అక్కడ ఖర్చు చికాగో కంటే బాగా తక్కువని ఎవరో చెప్పారు. ఇంకేం? స్వామి కేథరిన్ కి టెలిగ్రామ్ ఇచ్చి బోస్టన్ రైలెక్కాడు. ఆమె సాదరంగా ఆహ్వానించి స్థానిక ప్రముఖులకు స్వామిని పరిచయం చేసింది. ఆమె ద్వారా ఆమె కజిన్ అయిన ప్రొఫెసర్ జాన్ హెన్రీ రైట్ కలిశాడు. ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో గ్రీక్ హిస్టరీ ఆచార్యుడు.
కాసేపు మాట్లాడగానే వివేకానంద ఆధ్యాత్మిక శక్తికి, బహుముఖ పాండిత్యానికి ప్రొఫెసర్ రైట్ ముగ్ధుడయ్యాడు. మీరు చికాగో పార్లమెంటులో తప్పక పాల్గొనాలన్నాడు. ప్రతినిధిగా నమోదుకు టైం అయిపోయింది, నా యోగ్యతను చెప్పేందుకు నా దగ్గర ఏ పత్రమూ లేదు అని వివేకానంద అంటే – ‘యోగ్యత ఏమిటో చెప్పమని మిమ్మల్ని అడగడం అంటే ప్రకాశించే హక్కు నీకు ఎక్కడిదని సూర్యుని అడగడం లాంటిదే‘ అన్నాడు రైట్. మీ సంగతి నేను చూసుకుంటాను లెమ్మని భరోసా ఇచ్చాడు. ‘అమెరికాలో మహా జ్ఞానులైన ప్రొఫెసర్లు అందరికంటే ఈయన ఎక్కువగా జ్ఞాని‘ అంటూ పార్లమెంట్ డెలిగేట్ల సెలక్షన్ కమిటీ చైర్మన్ కు సిఫారుసు ఉత్తరం ఇచ్చి, ప్రయాణానికి టిక్కెట్టు, ఖర్చులకు సరిపడా సొమ్ము ఇచ్చి స్వామిని షికాగో పంపించాడు.
ఆ రకంగా మళ్లీ షికాగో చేరి, పార్లమెంటు కార్యాలయం అడ్రసు పోగొట్టుకుని, దైవికంగా తారసిల్లిన ఒక మహిళ సాయంతో ఎట్టకేలకు స్వామి అక్కడకు చేరుకున్నాడు. ప్రొఫెసర్ రైట్ ఉత్తరం చూపగానే మారు మాట్లాడక ఆయనను డెలిగేట్ గా తీసుకున్నారు. 1893 సెప్టెంబర్ 11న ఉదయం 10గంటలకు షికాగోలోని ఆర్ట్ ఇన్స్టిట్యూట్ లో పార్లమెంటులో దేశ దేశాలకు చెందిన వివిధానేక మతాచార్యులు, తత్వవేత్తలు, ప్రపంచ ప్రఖ్యాత మేధావులు కూడిన చారిత్రాత్మక వేదిక మీద మిగతా భారత ప్రతినిధుల సరసన వివేకానందకు గౌరవ స్థానం దక్కింది. పార్లమెంట్ కథ ఎవరూ ఊహించని మలుపు తిరిగింది.

అంత పెద్ద సభలో పాల్గొనడం స్వామికి అదే మొదలు. ఇండియాలో ఉండగా ఆయన ప్రసంగించిన ఏకైక బహిరంగ సభ హైదరాబాద్ మహబూబ్ కాలేజీలో 1893 ఫిబ్రవరి 13న జరిగింది. దానికి హాజరైంది వెయ్యి మంది. అమెరికా వెళ్ళాక అప్పటికే కొన్ని సమావేశాల్లో మాట్లాడినా అవన్నీ చిన్న గ్రూపు మీటింగులు. జీవితంలో మొదటిసారి నాలుగువేల మంది ముందు, అదీ అంతర్జాతీయ ఆధ్యాత్మిక దిగ్గజాలందరూ కొలువుదీరిన అపూర్వ వేదిక మీద ప్రసంగించాలనేసరికి వివేకానంద కంగారు పడ్డాడు. “గొంతు పెగులు తుందా? మజుందార్, చక్రవర్తి లాంటి భారతీయ ప్రముఖులంత బాగా తాను మాట్లాడగలడా?” అని చాలా సేపు సందేహించాడు. అందుకే అధ్యక్షుడు తనకు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా “ఇప్పుడు కాదు తర్వాత” అంటూ దాటవేశాడు. ఆఖరికి మధ్యాహ్న సమావేశంలో అధ్యక్షుడి బలవంతం మీద తప్పనిసరై సరస్వతిని ధ్యానించి, గురుదేవులను గుర్తు చేసుకుని లేచి ప్రసంగం మొదలెట్టాడు. “అమెరికా సోదరీ సోదరులారా” అన్న ఆయన సంబోధనకే సభికులందరూ సమ్మోహితులై లేచి నిలబడి రెండు నిమిషాల పాటు హర్షధ్వానాలు చేస్తూనే ఉన్నారు. ప్రపంచానికి సహనాన్ని, విశ్వ చింతనను, విశ్వ ప్రేమను నేర్పిన మతం, ప్రపంచ మతాలకు మాతృ సమానం అయిన హిందూ మతానికి తాను ప్రతినిధిని అని, నదులన్నీ సముద్రంలో చేరినట్లు అన్ని మతాలూ ఒకే గమ్యానికి దారితీస్తాయని తన మతం బోధిస్తున్నదని చిన్న ఉపన్యాసంలో పలికిన తొలి వాక్యాలే సభాసదులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తరువాత జరిగింది జగమెరిగిన చరిత్ర.
వివేకానంద ఉపన్యాసం విన్నాక ఆయనను ప్రేమించకుండా, గౌరవించకుండా ఏ ఒక్కరూ ఉండలేకపోయారు. అధ్యక్ష స్థానం లోని కార్డినల్ గిబ్బన్స్ కూడా ఆయనను మహా ఇష్టపడ్డాడు. ఇక పార్లమెంటు నడిచిన 17 రోజులూ వివేకానందుడే ప్రధాన ఆకర్షణ. ఆయన వస్తూ పోతూ ఉంటే అందరూ ఆరాధనా భావంతో చూసేవారు. ఏ సమావేశంలోనైనా ఉపన్యాసాలు బోరు కొట్టి జనం లేచి వెళుతూ ఉంటే ఆఖరిలో స్వామి వివేకానంద మాట్లాడతారని అధ్యక్షుడు ఎనౌన్స్ చేసేవాడు. దాంతో ఎక్కడి వారక్కడ కూర్చునే వారు.
హిందూ మత ప్రాశస్త్యాన్నీ, దాని విశాల దృక్పథాన్ని, సంక్షుభిత జగతికి దాని అవసరాన్ని ప్రపంచానికి చాటి చెప్పి, ప్రపంచంలోకెల్లా గొప్ప మతం హిందూమతమేనని అందరూ ఒప్పుకోక తప్పని పరిస్థితి తెచ్చి పెట్టాక పార్లమెంటు పెట్టడం వెనుక అసలు పన్నాగం పటాపంచలైంది. విశ్వ వేదికపై హైందవ జయపతాక సగర్వంగా రెపరెపలాడింది.
కొసమెరుపు:
పరాజయాన్ని అంగీకరించలేని క్రైస్తవ పెద్దలు కొందరు తదుపరి పార్లమెంటును పారిస్ లో జరపాలనుకున్నారు. ఎలాగైనా వివేకానందను ఆ వేదిక మీదకు రాకుండా చేయాలనుకున్నారు. వివేకానందకు ఫ్రెంచి రాదు కనుక ఫ్రెంచ్ లో మాట్లాడగలిగే వారే డెలిగేట్లుగా అర్హులని కట్టడి చేయాలనుకున్నారు. ఆ లోపు వివేకానంద ఫ్రాన్స్ వెళ్ళాడు. ఫ్రెంచ్ భాషలు ధారాళంగా మాట్లాడగల ప్రావీణ్యం ఆరు నెలల్లో సంపాదించాడు. దాంతో ప్రత్యర్థులు కంగుతిన్నారు. తరువాయి పార్లమెంటు ఆలోచనే మానుకున్నారు. వివేకానంద తడాఖాకు ఒకసారి దిమ్మతిరిగాక పార్లమెంటు కొరివితో తల గోక్కునే సాహసం మళ్ళీ ఎవరూ చెయ్యలేదు.
సేకరణ: శ్రీ ఎం వీ ఆర్ శాస్త్రి గారి “లే! మేలుకో!!” నుంచి.





