News

డియర్ పాకిస్థాన్ కాశ్మీర్ సంగతి తర్వాత. మా హక్కుల సంగతేంటి?

713views

మ్మూకశ్మీర్‌ ప్రజల హక్కుల గురించి ఐరాస మానవహక్కుల మండలిలో లేవనెత్తి భారత్‌ను ఇరకాటంలో పెట్టేందుకు విఫలయత్నం చేసిన పాక్‌ వైఖరి పట్ల సొంత దేశంలోనే విమర్శలు ఎదుర్కొంటోంది. పాక్‌ సైన్యం బలుచిస్థాన్‌ సహా పలు ప్రాంతాల్లో జరుపుతున్న అకృత్యాల సంగతేంటో చెప్పాలని అక్కడి ఉద్యమకారులు నిలదీస్తున్నారు. బలూచ్‌ మానవ హక్కుల మండలి, పస్థూన్స్‌కు చెందిన ఉద్యమకారులు కొందరు ఐక్యరాజ్యసమితి ఎదుట పాక్‌ వైఖరిని వ్యతిరేకిస్తూ బ్యానర్లను ప్రదర్శించారు. పాకిస్థాన్‌లో అనాగరిక పరిస్థితులు ఉన్నాయనీ.. అలాంటిది ఆ దేశం కశ్మీర్‌లోని మానవ హక్కుల గురించి మాట్లాతుండటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. బలుచిస్థాన్‌, సింధ్‌, పీవోకే తదితర ప్రాంతాల్లో పాక్‌ సైన్యం అనేక అకృత్యాలకు పాల్పడుతోందని బలూచ్‌ ఉద్యమకారుడు రజాక్‌ బలూచ్‌ అన్నారు.

అలాగే, బలూచ్‌కు చెందిన కొందరు ఉద్యమకారులు ఐరాస ఎదుట శిబిరం ఏర్పాటు చేసి పాక్‌ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. పాకిస్థాన్‌ సైన్యం ఆక్రమణలో బలూచిస్థాన్‌ మగ్గుతోందని.. అక్కడి ప్రజల సార్వభౌమాధికారం మంటగలుస్తోందని మండిపడ్డారు. అమెరికాలోని బలూచ్‌ ఉద్యమకారుడు నబీ బక్ష్‌ బలూచ్‌ మాట్లాడుతూ.. తమ ప్రాంతాల్లో పాక్‌ అనుసరిస్తున్న వంచన వైఖరిని ఎండగట్టారు. బలూచ్‌ సహా పలు ప్రాంతాల్లో అణచివేత ధోరణిని అనుసరిస్తున్నంత కాలం అక్కడ శాంతియుత వాతావరణం సాధ్యం కాదన్నారు. బలూచిస్థాన్‌లో ఎలాంటి అకృత్యాలు జరుగుతున్నాయో పాక్‌ విదేశాంగ శాఖ మంత్రి ఖురేషీ ఎక్కడా వెల్లడించడంలేదు. అందుకే మేం ఇక్కడికి రావాల్సి వచ్చింది. మేం బయటకు వచ్చి మాట్లాడకపోతే మా గొంతుకను వినిపించేదెవరు? అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.