
యావద్భారత ప్రజలు కాశ్మీరీలను అక్కున చేర్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ రాం మాధవ్ పేర్కొన్నారు. బుధవారం విజయవాడలోని ‘ద వెన్యూ కన్వెన్షన్ హాల్’ లో ఆర్టికల్ 370 రద్దుపై జరిగిన సదస్సులో శ్రీ రాంమాధవ్ పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 72 సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వాలు చేసిన ఒక చారిత్రిక తప్పిదం నేటికి సరిదిద్దబడిందని, ఆ కళంకం నేటికి తుడిచిపెట్టుకు పోయిందని అన్నారు. నిజానికది ఇన్నేళ్ళుగా నలగవలసిన సమస్య కాదని, అయితే దాని పరిష్కారానికి సాహసించగల మోడీ లాంటి సమర్ధుడైన నేత దేశానికి లభించడానికి 72 ఏళ్ళు పట్టిందని ఆయన తెలిపారు.
ఇలాంటి చారిత్రిక నిర్ణయంపై ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పొరుగు దేశం పాకిస్థాన్ కి మినహా దేశంలో ఎవరికీ రుచించడం లేదని పేర్కొన్నారు. 370 ఆర్టికల్ ద్వారా కాశ్మీర్ కి లభించిన ప్రత్యేక ప్రతిపత్తి తాత్కాలికమని చెప్పిన కాంగ్రెస్ నాయకత్వం 72 సంవత్సరాలపాటు దాన్నెందుకు కొనసాగించాల్సి వచ్చిందని శ్రీ రాంమాధవ్ ప్రశ్నించారు. “ఒకే దేశంలో రెండు జెండాలు, రెండు రాజ్యాంగాలు, రెండు పౌరసత్వాలు, ఇద్దరు ప్రధానులు ఏమిటి?” అని ఆయన ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అప్రజాస్వామికమని, రాజ్యాంగ విరుద్ధమని గగ్గోలు పెడుతున్న ప్రతిపక్ష కాంగ్రెస్ కేవలం రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగా 370వ అధికరణంలో 42సార్లు మార్పులు, చేర్పులు ఎలా చేసిందని ఆయన ప్రశ్నించారు. దేశవిభజన సమయంలో ప్రస్తుత పాకిస్థాన్ భూభాగం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు శరణార్ధులుగా వచ్చిన వారిలో మన దేశానికి ప్రధాని (డా. మన్మోహన్ సింగ్), ఉప ప్రధాని (శ్రీ ఎల్. కే అద్వానీ) వంటి ఉన్నత పదవులను అలంకరించిన వారున్నారని, ఒక్క కాశ్మీర్ కు వెళ్ళిన వారు మాత్రం కాశ్మీర్ పౌరులు కూడా కాలేకపోయారని, అందుకు కారణం 370 ఆర్టికల్ అని శ్రీ రాంమాధవ్ పేర్కొన్నారు.
“50లలో, 60లలో సఫాయి పని చెయ్యడం కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వెళ్ళిన పారిశుధ్య కార్మికులు కూడా కాశ్మీర్లో కనీస హక్కులను సైతం పొందలేకపోవడానికి 35A కారణం కాదా? ఒక కాశ్మీరీ మహిళ పాకిస్థాన్ యువకుడిని పెళ్లి చేసుకుంటే ఆ యువకుడికి కాశ్మీర్ పౌరసత్వం వస్తుంది. కానీ అదే మహిళ భారత దేశంలోని ఏ ఇతర రాష్ట్ర యువకుడిని పెళ్లి చేసుకున్నా ఆమె కాశ్మీరీ పౌరసత్వం కోల్పోతుంది. ఇంతకంటే దారుణమైన చట్టం ఉంటుందా? దానిని తొలగించటం నేరమవుతుందా?” అని ఆయన ప్రశించారు.
370 ఆర్టికల్ రద్దు తర్వాత గడచిన 5 వారాలలో కాశ్మీర్ చాలా ప్రశాంతంగా ఉన్నదని ఆయన అన్నారు. దేశ సమైక్యత, సమగ్రత కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని, జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క పంచాయితీకి 25 లక్షల చొప్పున కేటాయించనున్నదని ఆయన తెలిపారు. దేశ ప్రజలందరి సహకారంతో జమ్మూ కాశ్మీర్లో ఆరు నెలల్లోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆయన ఆకాంక్షించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీ నారాయణ, MLC శ్రీ రఘువర్మ కూడా పాల్గొన్న ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యులు శ్రీ సుజనా చౌదరి, మాజీ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ రావెల కిశోర్ బాబు, శ్రీ కామినేని శ్రీనివాస్, మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ గోకరాజు గంగరాజు వంటి పలువురు నేతలు, ఆరెస్సెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.





