ArticlesNews

దేశ విభజన: దోషులెవరు? రక్షకులెవరు?

6views

1947 ఫిబ్రవరి. ఢిల్లీ ప్రొవిన్స్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రచారక్ అయిన వసంతరావు ఓక్ హడావుడిగా విమాన ప్రయాణం చేసి నాగపూర్ చేరుకున్నారు. దేశ విభజనకు ఒప్పుకోడానికి కాంగ్రెస్ సుముఖంగా ఉందంటూ ఆయన ఆర్ఎస్ఎస్ సర్‌సంఘచాలక్ ‘గురూజీ’ మాధవ సదాశివ గోళ్వల్కర్‌కు చెప్పారు.

గురూజీ ఆ మాటలను నమ్మలేకపోయారు. ‘దేశ విభజన అంటూ జరిగితే నా మృతదేహం మీదనే జరుగుతుంది’ అని గాంధీజీ చెప్పిన మాటల మీద ఆయనకు అప్పటివరకూ పూర్తి నమ్మకం ఉంది. కానీ, కాంగ్రెస్‌లో ఉన్నత బాధ్యతలో ఉన్నవారి నుంచే తనకు ఆ సమాచారం కచ్చితంగా తెలిసిందని వసంతరావు నిశ్చయంగా చెప్పారు. దాంతో గురూజీకి ఆయన మాట నమ్మక తప్పలేదు.

భారతదేశాన్ని విభజించడం, పాకిస్తాన్ అనే కొత్త దేశాన్ని ఏర్పుట చేయడం అంటే ప్రతిపాదిత పాకిస్తాన్ ప్రాంతాలలోని హిందువులను సామూహికంగా నరమేధం చేయడమే. అప్పటికే 1946 ఆగస్టులో కలకత్తా హత్యలు, 1946 సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో నవఖాలీ హత్యలు, 1946 అక్టోబర్‌లో బిహార్ హత్యలు, 1946 నవంబర్‌లో ఉత్తరప్రదేశ్‌లో హిందూ యాత్రికుల మీద దాడులు, 1946 డిసెంబర్ నుంచి 1947 జనవరి వరకూ నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రొవిన్స్‌లో హరిపూర్ హజారా హత్యలు… ఆ సంఘటనలన్నీ అప్పటికే ముస్లిం సమాజం, ముస్లింలీగ్ పార్టీ కార్యాచరణకు నిదర్శనాలుగా ఉన్నాయి.

*హిందువులకు హెచ్చరికలు:*

గురూజీ గోళ్వల్కర్, బాలాసాహెబ్ దేవరస్‌తో చర్చించారు. ముస్లింలీగ్ ప్రధాన లక్ష్యంగా చేసుకున్న పంజాబ్‌లో పర్యటించడానికి నిర్ణయించుకున్నారు. గోళ్వల్కర్ ప్రధాన ఉద్దేశం రాబోయే ప్రతికూల పరిస్థితుల గురించి హిందువులను హెచ్చరించడం, అలాంటి గడ్డు పరిస్థితుల్లో హిందువులకు నైతికమద్దతు ప్రకటించి అండగా నిలవడం. దానికోసం ఆయన పంజాబ్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి భారీ బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఆయా ప్రాంతాల్లో హిందూ నాయకులతో సమావేశమయ్యారు. బలంగా నిలబడమనీ, అవసరమైతే స్పందించమనీ వారికి ప్రేరణ కలిగించారు. మరోవైపు, దేశ విభజనకు ఒప్పుకోవద్దంటూ కాంగ్రెస్ నాయకుల మీద ఒత్తిడి చేయాలంటూ హిందూ నాయకులకు గురూజీ సలహా ఇచ్చారు. అటు బాలాసాహెబ్ దేవరస్ వేర్వేరు ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యకర్తలను కలుసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో తలెత్తే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోడానికి వారిని మానసికంగా సిద్ధం చేస్తున్నారు. మార్చి 3న ముల్తాన్, 4న లాయల్పూర్, 5న రావల్పిండి నగరాల్లో సంఘ స్వయంసేవకులతో దేవరస్ సమావేశమయ్యారు.

*పంజాబ్‌లో ముస్లిముల దాడులు:*

మార్చి 5న పంజాబ్‌లోని లాహోర్, రావల్పిండి, గుజారన్‌వాలా, అమృత్‌సర్, జలంధర్, ముల్తాన్ తదితర ప్రాంతాల్లో ముస్లిములు హిందువుల మీద దాడులకు పాల్పడ్డారు. ఆ రోజు బాలాసాహెబ్ దేవరస్ రావల్పిండిలో ఉన్నారు. ఆ అల్లర్ల కారణంగా ఆయన తదుపరి కార్యక్రమం రద్దయింది. మార్చి 6న ఆయన లాహోర్ వెళ్ళారు. ముస్లిముల దాడుల్లో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతం రావల్పిండి. పరిస్థితి తీవ్రత ఎంత దారుణంగా ఉందంటే స్వయానా బాలాసాహెబ్ దేవరస్ ముస్లిం వేషం వేసుకుని రావల్పిండి నుంచి బైటపడాల్సి వచ్చింది.

*పంజాబ్‌లో గురూజీ పర్యటన:*

గురూజీ గోళ్వల్కర్ మార్చి 5న జమ్మూలో ఉన్నారు. 6న ఆయన రావల్పిండిలో కార్యక్రమానికి హాజరు కావలసి ఉంది. కానీ రావల్పిండి అప్పటికే రగులుతోంది. దాంతో గురూజీ లాహోర్ వెళ్ళారు. జమ్మూకు చెందిన పదిమంది సాయుధులైన స్వయంసేవకులు వజీరాబాద్ రైల్వేస్టేషన్‌ వరకూ గురూజీకి భద్రతగా వెళ్ళారు. అక్కడినుంచీ లాహోర్ వరకూ మరొక సాయుధ స్వయంసేవకుల బృందం గురూజీ వెంట వెళ్ళారు. మొత్తానికి గురూజీ లాహోర్ క్షేమంగా చేరారు. ఆ విధంగా వారిద్దరూ పంజాబ్‌లోని వాస్తవ పరిస్థితిని స్వయంగా చూసారు.

లాహోర్ నుంచి గోళ్వల్కర్ ఢిల్లీకి తిరుగుపయనం అయ్యారు. బాలాసాహెబ్ జమ్మూ వెళ్ళారు. అక్కడ పంజాబ్ ప్రాంత విభాగ్ ప్రచారక్‌ల రెండు రోజుల బైఠక్ మార్చి 8,9 తేదీల్లో జరగనుంది. ఆ జమ్మూ సమావేశంలో, రాబోయే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఆ సమయంలో స్వయంసేవకులు ఎలాంటి పాత్ర పోషించాలి అనే విషయమై చర్చలు జరిగాయి.

*ఇస్లామిక్ దాడులకు సంఘ్ ప్రతిఘటన:*

దేశ విభజనకు ఒప్పుకోడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది కానీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సిద్ధంగా లేదు. కనీసం దేశపు పశ్చిమ భాగంలో అయినా దేశవిభజన జరగకుండా ఉండేలాంటి పరిస్థితులను కల్పించేందుకు ప్రయత్నించాలని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది. దానికోసం పంజాబ్, సింధ్, ఫ్రాంటియర్ ప్రొవిన్స్‌లలోని హిందువులు తమ ఇళ్ళను వదిలిపెట్టకూడదని, తమ గ్రామాలనుంచి పారిపోకూడదనీ సందేశం ఇవ్వడానికి స్వయంసేవకులు ప్రయత్నించారు. వారు ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొనాలనీ, ముస్లింల దాడులను సమష్ఠిగా పూర్తి బలంతో ఎదుర్కొనాలనీ సంఘ్ ఉద్దేశం.

హిందువులు అలాగే చేసారు. వారు చాలా ప్రయత్నం మీద ముస్లిం దాడులను ధైర్యంగా ఎదుర్కొన్నారు. చాలాచోట్ల అతివాదులు పారిపోక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ఆందోళనల్లో, దాడులకు పాల్పడుతున్న ముస్లిములకు వారి నాయకులు పూర్తిగా అండగా నిలబడ్డారు. దానికి తోడు ముస్లిం పోలీసులు, ముస్లిం సైన్యం, ముస్లిం అధికార వర్గం వారికి అండగా నిలబడి కావలసిన సహాయం అందించాయి. దానికి పూర్తి భిన్నంగా, హిందువుల వెనుక ఎవ్వరూ లేరు. హిందువులైన కాంగ్రెస్ నాయకులు, హిందూ అధికారులు, హిందూ పోలీసులు, హిందూ మిలటరీ ఎవ్వరూ లేరు. నిజానికి అప్పటికే చాలాయేళ్ళ నుంచి హిందువులు కాంగ్రెస్ నాయకుల మీద పూర్తిగా ఆధారపడ్డారు. కానీ హిందువులకు నిజంగా మద్దతు అవసరమైన ఆ సమయంలో వారు తమ వెన్నుచూపించారు, యుద్ధక్షేత్రాన్ని వదిలిపెట్టి శిమ్లా, ఢిల్లీ వంటి నగరాలకు పారిపోయారు. నాయకులు ఎవరూ లేకపోయినా హిందువులు పోరాడారు. తమ అంతర్గత శక్తిని ఆధారం చేసుకునే వారు పోరాడారు. మొహల్లా నుంచి మొహల్లాకు, గ్రామం నుంచి గ్రామానికీ హిందువులు తమను తాము రక్షించుకోడానికి పోరాడారు. ప్రతీ చోటా స్వయంసేవకులే ముందువరుసలో నిలబడ్డారు. అందువల్ల ఆ ప్రదేశాలకు వారే నాయకులు అయిపోయారు. చాలాచోట్ల హిందువులు విజయం దిశగా సాగుతున్నారు. కానీ ముస్లింలీగ్ పోలీసులు, ముస్లిములూ క్షేత్రస్థాయిలోకి వచ్చేటప్పటికి పరిస్థితి మారిపోయింది. ముస్లిములతో తలపడడం అసంభవమైన కార్యంగా మారింది. హిందువుల విధ్వంసానికి ప్రధాన కారణం అది.

నెహ్రూ ప్రభుత్వం 1947 ఆగస్టు 15న ఏర్పడలేదు. నిజానికి 1946 సెప్టెంబర్ 2నే ఏర్పడింది. ఆ రెండు తేదీల మధ్య తేడా ఏంటంటే సెప్టెంబర్ 2న ఏర్పడినది మధ్యంతర ప్రభుత్వం. ఆ మధ్యంతర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ మంత్రులు ముస్లింలీగ్‌తోనూ, బ్రిటిష్ ప్రభుత్వంతోనూ ఒప్పందం కుదుర్చుకున్నారు. దేశ విభజనకు అంగీకరించారు. ఆ విషయం 1947 జూన్ 3న లండన్, న్యూఢిల్లీల నుంచి ఒకేసారి ప్రకటించబడింది. జూన్ 14, 15 తేదీల్లో ఢిల్లీలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో దేశ విభజన కోసం జరిగిన ఒప్పందానికి మద్దతు ప్రకటించారు. ఇక ఆ మొత్తం వ్యవహారానికి పరాకాష్ఠ ఏంటంటే… ‘‘భారతదేశాన్ని ఖండించే ముందు గాంధీని సజీవంగా ఖండించండి’’ అని ఒకప్పుడు చెప్పిన మహాత్మా గాంధీ స్వయంగా దేశ విభజనకు ఒప్పుకోవాలంటూ ఎఐసిసి సమావేశానికి విజ్ఞప్తి చేసారు.

*నెహ్రూ ప్రభుత్వ వైఫల్యం:*

దేశ విభజనకు 1947 ఆగస్టు 15వ తేదీ ఖరారయింది. అంటే ఆనాటికి ప్రతిపాదిత పాకిస్తాన్‌ ప్రాంతాలతో సహా మొత్తం భారతదేశాన్ని నెహ్రూ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం పరిపాలిస్తోంది.

పాకిస్తాన్ ఏర్పాటు నిర్ణయం తర్వాత, ముస్లిములు హింసాకాండకు పాల్పడడం మరింత పెరిగిపోయింది. వారు బహిరంగంగా, నిర్భయంగా హిందువులపై హింసకు పాల్పడసాగారు. ఆ పరిస్థితిలో నెహ్రూ ప్రభుత్వం కచ్చితంగా నిర్వర్తించవలసిన విధి హిందువులను రక్షించడం. పోలీసులను, మిలిటరీని ప్రయోగించడం ద్వారా అల్లర్లను అణచివేయవచ్చు. అల్లర్లకు పాల్పడుతున్న ముస్లిములను అరెస్టు చేసి జైళ్ళలో పెట్టవచ్చు. ప్రభుత్వం సోదాలు జరిపి దేశంలోని పలు ప్రాంతాల్లో ముస్లిములు రహస్యంగా సేకరించిన ఆయుధాలను స్వాధీనం చేసుకొని ఉండి ఉండవచ్చు.

ఒకవేళ ముస్లిం దుండగులకు వ్యతిరేకంగా పోలీసులను, సైన్యాన్నీ ఉపయోగించడం సరైన పని కాదు అని ప్రభుత్వంలోని మంత్రులు భావించి ఉంటే… వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలను తమ ఇళ్ళలోనుంచి బైటకు రావాలని, తమ చేతుల్లోకి ఆయుధాలను తీసుకోవాలని, గ్రామాలూ పట్టణాల్లో దుండగులను నిరోధించాలనీ పిలుపు ఇచ్చి ఉండవచ్చు. అదీ సాధ్యం కాదంటే ఆఖరి ప్రత్యామ్నాయంగా ముస్లిములందరూ పాకిస్తాన్‌కు వెళ్ళిపోడానికీ, హిందువులందరూ హిందుస్తాన్‌కు రావడానికీ ఏర్పాట్లు చేసి ఉండాల్సింది. కానీ ప్రభుత్వమైనా లేక కాంగ్రెస్ పార్టీ అయినా ఆ నాలుగు ప్రత్యామ్నాయాల్లో ఏ ఒక్కదాన్నీ పాటించలేదు. వారి మెదళ్ళన్నీ అహింస, హిందూ ముస్లిం ఐక్యత అనే నినాదాలతో నిండిపోయి ఉన్నాయి. ఆ మానసిక పరిస్థితే వారిని తప్పేదో ఒప్పేదో గుర్తించలేకుండా చేసింది. ఒకవేళ, కాంగ్రెస్ కార్యకర్తలు ముస్లిం దుండగులను ఎదుర్కొనలేరు అని ప్రభుత్వం భావించి ఉన్నట్లయితే దానికి ప్రత్యామ్నాయంగా వారు ఆ బాధ్యతను ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులకు అప్పగించి ఉండవచ్చు. 1946 సెప్టెంబర్ 2న ఢిల్లీలో ముస్లింలీగ్ దాడుల నుంచి జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్ సహా కాంగ్రెస్ మంత్రులను రక్షించాలని ప్రభుత్వం ఆర్ఎస్ఎస్‌ను అర్ధించగలిగినప్పుడు, ఆ తరువాత అదే పనిని ఇతర ప్రదేశాల్లో చేయమని ఎందుకు అర్ధించకూడదు?

దాని ఫలితం… భారీస్థాయిలో రక్తపాతం, ప్రపంచ చరిత్రలోనే కనీవినీ ఎరుగని స్థాయిలో హిందూజాతి స్థానభ్రంశం.