ArticlesNews

పాక్ ఆటలు ఇంకానా? ఇకపై సాగవు

258views

రాజ్యాంగంలోని 370వ అధికరణను రద్దు చేస్తూ తీర్మానం ప్రవేశ పెట్టిన సందర్భంగా ఆంతరంగిక వ్యవహారాల శాఖా మంత్రి అమిత్ షా మాట్లాడుతూ మొత్తం జమ్మూ కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమని ప్రకటించారు. రాజా హరిసింగ్ భారత్ లో విలీనం చేసిన మొత్తం జమ్మూ కాశ్మీర్ మన భూభాగమేనని స్పష్టం చేశారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్థాన్ తో చర్చలు అంటూ జరిగితే అది పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి మాత్రమే జరుగుతాయని ప్రకటించారు. ఇద్దరు మంత్రుల ప్రకటనలతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై అందరి దృష్టీ పడింది.

దూర దృష్టి లోపించిన నెహ్రూ అనాలోచిత చర్యల కారణంగా జమ్మూ కాశ్మీర్లో సగ భాగం పాకిస్థాన్ వశమైంది. తన ఆధీనంలోని జమ్మూ కాశ్మీర్ భూభాగానికి పాకిస్థాన్ ‘ఆజాద్ కాశ్మీర్’ అని పేరు పెట్టింది. విముక్త లేదా స్వతంత్ర కాశ్మీర్ అని దానర్ధం. అయితే పేరులోనే తప్ప అక్కడెవరికీ స్వాతంత్ర్యం లేదు. ఆక్రమించుకున్న భూభాగంలో ఒక కీలుబొమ్మ ప్రభుత్వాన్ని పాక్ ఏర్పరచింది.

1949 ఏప్రిల్ 28న పాక్ ప్రభుత్వం ఆక్రమిత కాశ్మీర్ ప్రభుత్వంతో ఒక రహస్య ఒప్పందం చేసుకుంది. దాని పేరే ‘కరాచి ఒప్పందం’. 59 సంవత్సరాల పాటు ఆ ఒప్పందాన్ని రహస్యంగా ఉంచారు. 1990వ దశకంలోనే అది వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత 2008లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ రాజ్యాంగానికి అనుబంధంగా దానిని చేర్చారు. కాశ్మీర్ వ్యవహారాలు చూసే పాక్ మంత్రి, ఆక్రమిత కాశ్మీర్ అధ్యక్షుడు సర్దార్ ఇబ్రహీం, జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షులు చౌదరి గులాబ్ అబ్బాస్ సంతకాలు ఆ ఒప్పందంలో ఉన్నాయి. అయితే అలాంటి ఒప్పందం ఏదీ తనకు తెలియదని ఆనాటి ఆక్రమిత కాశ్మీర్ అధ్యక్షులు సర్దార్ ఇబ్రహీం పేర్కొన్నారు. ఆయన సంతకాన్ని నాటి పంజాబ్ గవర్నర్ తండ్రి మహమ్మద్ దాస్ తౌశీర్ పెట్టారు. అంటే ఆక్రమిత కాశ్మీర్ అధ్యక్షుడి అంగీకారంతో, సంతకంతో ప్రమేయం లేకుండానే దొంగ సంతకం పెట్టి కరాచీ ఒప్పందాన్ని తయారు చేశారన్నమాట. పాకిస్థాన్ ప్రభుత్వం ఎంతకైనా దిగజారుతుందని చెప్పడానికి ఇంతకంటే వేరే దృష్టాంతం అవసరం లేదు.

దశాబ్దాల పాటు ఆ ఒప్పందంలో ఏముందో ఎవరికీ తెలియదు. ఆ ఒప్పందం ప్రకారం ఆక్రమిత కాశ్మీరు ప్రభుత్వానికి ఎటువంటి నిర్ణయాధికారాలు లేవు. ముఖ్యమైన అధికారాలన్నీ పాక్ ప్రభుత్వానికి కట్టబెట్టారు. అక్రమంగా భారత భూభాగాన్ని ఆక్రమించడమే కాక ఆక్రమిత కాశ్మీర్ భూభాగాన్ని సైతం పాకిస్థాన్ కబ్జా చేసింది. ఈ దొంగ సంతకాల మోస పూరిత ఒప్పందం ప్రకారమే గిల్జిత్, బాల్టిస్థాన్ భూభాగాన్ని ఆక్రమిత కాశ్మీర్ నుండి పాకిస్థాన్ కి బదిలీ చేశారు. గిల్జిత్, బాల్టిస్థాన్ ప్రాంతపు పేరును ఏక పక్షంగా “ఉత్తర భూభాగం”గా మార్చారు. 1963లో గిల్జిత్, బాల్టిస్థాన్ లోని “ షక్సగన్ లోయ” ను చైనాకు ధారాదత్తం చేసింది. 2016లో చైనా సలహాతో గిల్జిత్, బాల్టిస్థాన్ ను 5వ రాష్ట్రంగా పాకిస్థాన్ పూర్తిగా కలుపుకోవడానికి ప్రయత్నం చేసింది. (బలూచిస్తాన్, ఖైబర్ ఫక్తూన్, పంజాబ్, సింధ్ మిగిలిన నాలుగు రాష్ట్రాలు) గిల్జిత్, బాల్టిస్థాన్ అవిభక్త జమ్మూ కాశ్మీర్లో ఒక ముఖ్యమైన భాగం. రాజా హరిసింగ్ భారత దేశంలో విలీనం చేసిన జమ్మూ కాశ్మీర్ రాజ్యంలో భౌగోళికంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న ప్రాంతం.

పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనూ, గిల్జిత్, బాల్టిస్థాన్ లోనూ మానవ హక్కులు లేవు. నిరసనకారులను నిర్దయగా అణచివేస్తారు. నిరసనకారుల నాయకులందరూ అణచివేతను తట్టుకోలేక దేశం బయటే నివాసం ఉంటున్నారు. కుట్రలు కుతంత్రాలు చేసి గిల్జిత్, బాల్టిస్థాన్ ను ఆక్రమిత కాశ్మీర్ నుండి విడగొట్టి అందులో కొంత భాగాన్ని చైనాకు అమ్మివేసిన పాకిస్థాన్ ఇప్పుడు 370వ అధికరణం రద్దు గురించి ఎందుకు గగ్గోలు పెడుతోంది? తన ఆధీనంలో ఉన్న ప్రాంతంలో అనేక అత్యాచారాలకు, అణచివేతకు పాల్పడుతూ ఎందుకు అంతర్జాతీయ వేదికల మీద కాశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ పదే పదే మాట్లాడుతున్నది? బెలూచిస్థాన్, ఖైబర్ ఫక్తూన్ లలో స్థానికులు పాకిస్థాన్ ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. వారిని అణచివేయటానికి పాకిస్థాన్ దేనికీ వెనుకాడటం లేదు. ఆ ప్రాంతాలలో మానవ హక్కుల ఉల్లంఘన తారా స్థాయికి చేరింది. అనేక వేల మంది నిరసనకారులను మాయం చేశారు. అక్కడి వేర్పాటు ఉద్యమాలు బలపడితే పాక్ కు మిగిలేది సింధు, పంజాబ్ లు మాత్రమే. పాకిస్థాన్ లో వివిధ ప్రాంతాలలో జరుగుతున్న అణచివేతలపై వెలుగులోనికి వచ్చిన వివరాలను ప్రపంచానికి తెలియజెప్పడం అవసరం. పాకిస్థాన్ జాత్యహంకార ప్రభుత్వానికి కాశ్మీర్ ను కబ్జా చెయ్యాలనే దురాశ తప్ప కాశ్మీర్ ప్రజల జీవితాలను మెరుగు పరచాలనే ఆశయమే లేదన్న విషయం ఆక్రమిత కాశ్మీర్, గిల్జిత్, బాల్టిస్థాన్ ప్రజల జీవన స్థితిగతులను పరిశీలిస్తే ఇట్టే తేటతెల్లమౌతుంది. ఆ వివరాలను సేకరించి ప్రజల ముందు ఉంచితే పాకిస్థాన్ కుతంత్రాలను తిప్పికొట్టడం తేలికవుతుంది.  370వ అధికరణ రద్దుతో వేర్పాటు శక్తులకు కాశ్మీరులో ఊతం లేకుండా పోయింది. తన ఆటలు ఇకపై సాగవని తెలుసుకున్న పాకిస్థాన్ అందుకే గగ్గోలు పెడుతోంది.

  • డా. సారంగపాణి.