
కోట్ల మంది భారతీయుల ఆశలను మోసుకుంటూ చంద్రయాన్ – 2 మరికొన్ని గంటల్లో చందమామపై కాలు మోపనుంది. ఈ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ – 2లోని విక్రమ్ ల్యాండర్ శుక్రవారం అర్ధరాత్రి దాటాక 1:30 – 2.30 గంటల మధ్య జాబిల్లి ఉపరితలంపై అడుగుపెట్టనుంది. ఈ వ్యోమనౌక చెప్పబోయే కొత్త సంగతుల కోసం భారత్ తోపాటు యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జూలై 22న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్ 2ను ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ ప్రయోగం విజయవంతమైతే జాబిలిపై వ్యోమనౌకను సురక్షితంగా దించిన నాలుగో దేశంగా భారత్ అవతరించనుంది. చంద్రుడి దక్షిణ ధృవంపై వ్యోమనౌకను దించిన తొలి దేశంగా మనం ఘనత సాధించనున్నాం.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 2లోని ‘విక్రమ్ ల్యాండర్’ కదలికలపై ఇస్రో చైర్మన్ శివన్ స్పందించారు. అంతా తాము అనుకున్నట్టుగానే జరుగుతోందని అన్నారు. చందమామను అందుకునే అపూర్వమైన చారిత్రక ఆవిష్కరణ కోసం తామెంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. భారత అంతరిక్ష రంగ చరిత్రలో ఇదో అత్యంత కీలకమైన రోజుగా ఆయన అభివర్ణించారు.
అయితే ‘విక్రమ్ ల్యాండర్’ చందమామపై అడుగుపెట్టే ఆఖరు 15 నిమిషాలు ఎంతో క్లిష్టమైనవని ఆయన అన్నారు. ఇప్పటివరకు జరిగిన ప్రయాణం ఒక ఎత్తయితే ఆ చివరి పదహైదు నిమిషాలు చాలా చాలా సంక్లిష్ట తో కూడుకున్న దన్నారు. ఈ మనోహరమైన ఘట్టాన్ని దూరదర్శన్, ఇస్రో వెబ్ సైట్, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల ద్వారా లైవ్ లో చూడవచ్చని ఇస్రో అధికారులు వెల్లడించారు.





