ArticlesNews

కాశ్మీర్ హమారా హై భారత విజయం – స్వయంసేవకుల కృషి

763views

భారత ప్రభుత్వం యొక్క ఆర్టికల్ 370, 35A ల రద్దు నిర్ణయం వీరు వారని కాక దేశంలోని అన్ని వర్గాల ప్రజలలోని అత్యధికుల ప్రశంశలందుకుంది. ఇక మిగిలిన వారిలో మంచి చెడులతో, లాభ నష్టాలతో నిమిత్తం లేకుండా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా గ్రుడ్డిగా వ్యతిరేకించేవారు కొందరైతే, దేశంలో జరిగే ఏ పరిణామంతోనూ తమకు సంబంధం లేనట్లు వ్యవహరించేవారు మరి కొందరు. కానీ ప్రభుత్వ చర్యలపై అత్యధికుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమౌతుండడం శుభ పరిణామం.

కాశ్మీర్ చరిత్ర :

కల్హణుడు వ్రాసిన “రాజ తరంగిణి” గ్రంధం ఆధారంగా పరిశీలిస్తే భారత యుద్ధం ముగిసిన 62 సంవత్సరాలకు అంటే క్రీ.పూ. 3076 నుండి కాశ్మీరాబ్ద గణన ప్రారంభమైంది. అప్పటి నుండి షుమారు క్రీ.పూ. 1182 నుండి క్రీ.శ. 12వ శతాబ్దం వరకు గోనంద, ప్రతాపాదిత్య, కర్కోటక, ఉత్పల, గుప్త బ్రాహ్మణ, ఆంద్ర శాతవాహన, బ్రాహ్మ క్షాత్ర అగ్నివంశాల చక్రవర్తులు, రాజులు 2330 సంవత్సరాలు పరిపాలించారు.

సిరిసంపదలతో తులతూగే సుందర నగరంగా శ్రీనగర్ ను నిర్మించిన అశోకుడు(క్రీ.పూ.15వ శతాబ్దం), ఆది శంకరుని ఆలయాన్ని, మరెన్నో దేవాలయాలను, అగ్రహారాలను నిర్మించిన గోపాదిత్యుడు(క్రీ.పూ.4వ శతాబ్దం), స్వయంగా కవి పండితుడైన వసునందనుడు(క్రీ.పూ.6వ శతాబ్దం), రణాదిత్యుడు(క్రీ.పూ.2వ శతాబ్దం), తూర్పున టిబెట్ నుండి పశ్చిమాన ఇరాన్, టర్కీల వరకూ కాశ్మీర రాజ్యాన్ని విస్తరింపజేసిన లలితాదిత్యుడు(క్రీ.శ.8వ శతాబ్దం), ఎన్నో కాలువలు త్రవ్వించిన అవంతివర్మ(క్రీ.శ.9 వ శతాబ్దం), మహమ్మద్ గజినీ కాశ్మీర్ పైకి దండెత్తిన రెండు సార్లూ చిత్తుగా ఓడించిన రాజా సంగ్రామ రాజ్, కఠిన హృదయుడిగా, క్రూరుడిగా పేరొందిన మిహిరకులుడు(గోనంద వంశం, క్రీ.పూ 7వ శతాబ్దం) వారిలో కొందరు.

అతి మంచితనమే ముంచింది:

అందరి భారతీయ రాజుల్లాగే క్రీ.శ. 14వ శతాబ్దంలో  కాశ్మీర్ ని ఏలిన సహదేవుడనే రాజు మితిమీరిన మంచితనం, ఔదార్యం కాశ్మీర్ పతనానికి మూలమైంది. టిబెట్ కు చెందిన రెంచెన, ఆఫ్ఘనిస్థాన్ కి చెందిన షామీర్ అనే ఇద్దరు విదేశీయులకు ఆశ్రయమిచ్చాడు. కొద్ది కాలానికి క్రీ. శ. 1320లో చెంఘిజ్ ఖాన్ వంశీకుడైన జుల్ఫీఖాదర్ ఖాన్ డెబ్భై వేల సైన్యంతో తుర్కిస్తాన్ నుండి దండయాత్ర చేయగా, అతని ధాటికి సహదేవుడు పారిపోయాడు. అప్పుడు సహదేవుని మంత్రి రామచంద్రుడు గద్దెనెక్కి పరిస్థితులను చక్కబెట్టే ప్రయత్నం చేస్తుండగా అప్పటి వరకూ నమ్మిన బంటులా ఉంటూ వచ్చిన రెంచెన రామచంద్రుణ్ణి హత్య చేసి సింహాసనాన్ని ఆక్రమించడమే కాక రామచంద్రుడి కుమార్తె కోట రాణిని వివాహమాడాడు.

కాశ్మీరీ పండిట్ల స్వయంకృతాపరాధం:

రెంచెన రాజు తన భార్య కోట రాణి ప్రభావంతో సనాతన ధర్మాన్ని స్వీకరించ యత్నించాడు. కానీ కాశ్మీరీ బ్రాహ్మణులందుకు అభ్యంతరం చెప్పారు. ఇది కాశ్మీరీ పండితుల మూర్ఖత్వం, మరో ఘోర తప్పిదం. దానితో కోపోద్రిక్తుడైన రెంచెన బుల్ బుల్ షా అనే మహమ్మదీయ గురువు అధ్వర్యంలో అప్పుడప్పుడే కొద్దికొద్దిగా వ్యాప్తిలోకి వస్తున్న ఇస్లాంను స్వీకరించి తన పేరును సుల్తాన్ సద్రుద్దీన్ గా మార్చుకున్నాడు. మూడేళ్ళ సద్రుద్దిన్ పాలనలో కాశ్మీర్లో హిందువులకు నరకం మొదలైంది. అనేక దేవాలయాలు, బౌద్ధారామాలు ధ్వంసం చెయ్యబడ్డాయి. సద్రుద్దిన్ మరణానంతరం సహదేవుని తమ్ముడైన ఉదయన దేవుడు రాజ్యాన్ని, రాణిని చేజిక్కించుకుని పదిహేనేళ్ళ పాటు కాశ్మీర్ ని పాలించాడు. శరణార్థులలో రెండవ వాడైన షామీర్ ఉదయన దేవుని ప్రాపకం సంపాదించి మంత్రిగిరీ చలాయించాడు. క్రీ. శ. 1338లో ఉదయనదేవుని మరణానంతరం మోసంతో రాజ్యాన్ని చేజిక్కించుకున్న షామీర్, రాణిని కూడా వశం చేసుకోజూశాడు. కానీ ఆమె ఆత్మాహుతి చేసుకుని మరణించింది. వందలాది హిందూ స్త్రీలను ముస్లింలకిచ్చి వివాహం జరిపించిన షామీర్ మూడేళ్లకే గోరీలో చేరాడు. ఆ తర్వాత గద్దెనెక్కిన షామీర్ పెద్ద కొడుకును గెంటి వేసి చిన్న కొడుకు గద్దెనెక్కాడు. అతని కొడుకు షా ఉద్దిన్ అనంతరం గద్దెనెక్కిన అతని తమ్ముడు కుతుబుద్దీన్ కాలంలో సయ్యద్ ఆలీ హుందానీ అనే మతోన్మాది పర్యవేక్షణలో అనేక దేవాలయాలు నేలమట్టమయ్యాయి. అనేక వేల మంది హిందువులు మతం మార్చబడ్డారు. ఆ తర్వాత సికందర్ (1319 – 1413), అతని కుమారుడు ఆలీషా, ఇతని మనవడు హైదర్ షా, ఫతేషా, యూసుఫ్ షా ఇలా అందరూ హైందవ ధర్మ విధ్వంసకులే.

16వ శతాబ్దంలో మొఘలు పాదుషా అక్బర్ కాశ్మీర్ను తన రాజ్యంలో కలుపుకున్నాడు. హిందువులకు ఔరంగజేబు పాలనలో కష్టాలు అధికమయ్యాయి. శివాజీ, ఛత్రసాల్, గురుగోవిందసింగ్, రాణారాజ్ సింగ్ తిరుగుబాటుతో మొఘలు సామ్రాజ్యం విచ్ఛిన్నమైన తర్వాత మొఘలు దర్బారులో ప్రముఖ పాత్ర వహించిన ముహాటాఖాన్ అనే సర్దార్ కాశ్మీర్ ను చేజిక్కించుకుని హిందువులపై అంతులేని ఆకృత్యాలను కొనసాగించాడు. హిందువులకు ఆశ్రయమిస్తున్నారన్న నెపంతో ముస్లిములపైనా వేధింపులు మొదలెట్టడంతో ఒక ముస్లిం సర్దార్ అతనిని చంపేశాడు.

కాశ్మీర్ ముస్లిముల ఆహ్వానంతో 1752లో కాశ్మీర్ పై దండెత్తిన ఆఫ్ఘన్ పాలకుడు అహ్మద్ షా ఆబ్దాలీ కాశ్మీర్లో తన పాలన ఏర్పరిచాడు. అప్పటి నుండి 164 సంవత్సరాల పాటు సాగిన ఆఫ్ఘన్ల పాలనలో హిందువులు ఆర్ధికంగా, శారీరికంగా, మానసికంగా నలిగిపోయారు. ఎందరో హిందువులు దాల్ సరస్సులో దూకి ప్రాణాలు వదిలారు. ఆ తర్వాత ఇష్క్ అబ్బాసీ తర్వాత రాజ్య పాలనకు వచ్చిన అబ్దుల్లా ఖాన్ కాబూలీని చంపి రాజ్యాన్నిచేజిక్కించుకున్నసుఖజీవన మల్ల ఆఫ్ఘన్లతో సంబంధాలు త్రెంచుకుని స్వతంత్రంగా రాజ్య పాలన చేసిన కాలంలో హిందువులు కొంత సుఖపడ్డారు. మళ్ళీ స్థానిక ముస్లిముల పిలుపుతో ఆఫ్ఘన్ పాలకుడు అహ్మద్ షా అబ్దాలీ పంపిన నూరుద్దీన్ చేతిలో భక్తమల్ అనే అధికారి ద్రోహం కారణంగా ఓడిపోయి బందీ అయిన సుఖజీవన మల్లను అత్యంత క్రూరంగా హింసించి, అన్న పానీయాలు ఇవ్వకుండా బంధించి కృశింపజేసి చంపేశారు. మళ్ళీ 500 ఏళ్ళ పాటు క్రూర ఆఫ్ఘన్ పాలన కొనసాగింది.

కాషాయ ధ్వజ ఛాయలో..

దేశాన్ని, ధర్మాన్ని, ధన మాన ప్రాణాలను కాపాడుకోవడానికి సహకరించవలసిందిగా పంజాబ్  పాలకుడు మహారాజా రంజిత్ సింగ్ ను అర్ధించాలని నిర్ణయించి పండిట్ బీర్బల్ ధర్ కి, ఆయన కుమారుడు రాజాకాక్ కి ఆ బాధ్యతలు అప్పగించారు. ఆ పనిపై వారు బయలుదేరారని తెలిసిన సుబేదార్ బీర్బల్ ధర్ స్నేహితుడి ఇంటిలో రక్షణ పొందుతున్న ఆయన భార్యను, కోడలిని బంధించి కాబూల్ తరలించే ప్రయత్నం చేశారు. మార్గ మధ్యంలోనే బీర్బల్ ధర్ భార్య వజ్రాన్ని మింగి మరణించగా, ఆయన కోడలు మాత్రం కాబూల్ కి తరలింపబడింది. ఇక ఆమెకు పట్టిన గతిని ఊహించుకోవాల్సిందే.

జమ్మూ రాజు రాజా గులాబ్ సింగ్ ద్వారా రంజిత్ సింగ్ ను కలసిన బీర్బల్ ధర్, రాజా కాక్ లు చెప్పిన విషయాలు విని రాజా రంజిత్ సింగ్ చలించి పోయాడు. కాశ్మీర్ సమస్యను యావద్దేశం దృష్టితో చూసిన మొదటి వ్యక్తి రాజా రంజిత్ సింగ్.

1819 జూన్ 20న జమ్మూ రాజు గులాబ్ సింగ్, హరి సింగ్ నాల్వా, జ్వాలా సింగ్, హుకుం సింగ్, శ్యాం సింగ్ వంటి యోధాను యోధుల నాయకత్వంలో 30 వేల మంది సైన్యం కాశ్మీర్ లోయలోకి ప్రవేశించింది. సుబేదార్ అజీం ఖాన్, వాడి తమ్ముడు జబ్బార్ ఖాన్ కాబూల్ కు పారిపోయారు. 27 సంవత్సరాలు సాగిన రాజా రంజిత్ సింగ్ పాలనలో హిందువులు, ముస్లిములు అందరూ గౌరవంగా, సంతోషంగా జీవించారు.

ఆ తర్వాత ఆంగ్లేయుల రాకతో భారత దేశంలో అత్యధిక భూభాగాలు ఆంగ్లేయుల హస్తగతమైనాయి. 1846 లో జరిగిన అమృత్ సర్ ఒప్పందం మేరకు సిక్కులకు, బ్రిటిష్ వారికి జరిగిన యుద్ధాలకు గానూ సిక్కులు ఆంగ్లేయులకు 75 లక్షల అపరాధ రుసుం చెల్లించవలసి వచ్చింది. ఆంగ్లేయులు ఆ ధనాన్ని చెల్లించిన రాజా గులాబ్ సింగ్ ను కాశ్మీర్ పాలకుని జేశారు. గులాబ్ సింగ్ హయాంలో జోరావర్ సింగ్ సహకారంతో లఢాక్ కూడా రాజ్యంలో భాగం కావడంతో జమ్మూ కాశ్మీర్ బలమైన రాజ్యంగా రూపొందింది.

వెయ్యేండ్ల నరకమూ మూర్ఖత్వాన్ని చంపలేకపోయింది :

అనంతరం మహారాణా రణవీర్ సింగ్ హయాంలో పూంచ్, రాజౌరీ జిల్లాల్లో ముస్లిములుగా జీవిస్తున్న వారు వచ్చి తమను మరళా హిందూ ధర్మంలోకి అనుమతించవలసిందిగా కోరారు. కానీ పండితులు ససేమిరా అనటంతో మహారాజా నిస్సహాయుడైనాడు. ఆయన అనంతరం రాజా ప్రతాప్ సింగ్, ఆ తర్వాతి వాడే మహా రాజా హరి సింగ్.

 రాజా హరిసింగ్ పై బ్రిటిష్ వారి కంటగింపు :

1931లో బ్రిటిష్ వారు లండన్లో ఏర్పరచిన రౌండ్ టేబుల్ సమావేశానికి సంస్థానాధీశుల మండలి ప్రతినిధిగా వెళ్ళిన రాజా హరిసింగ్ “ భారతీయులుగా మా మాతృభూమి బ్రిటిష్ యూనియన్లో గౌరవము, సమానత పొందాలని కోరుకుంటున్నామ”ని ప్రకటించటంతో మొట్టమొదటి సారిగా ఒక సంస్థానాదీశుడు భారతదేశ స్వాతంత్ర్యాన్ని కోరినట్లుగా భావించిన బ్రిటిష్ ప్రభుత్వం ఇతనికి పోటీగా మరో వ్యక్తిత్వాన్ని ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకుంది.

ముసలం పుట్టింది :

ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీ నుంచి ఎం.ఎస్.సి పట్టా పుచ్చుకుని శ్రీనగర్లోని ప్రభుత్వ పాఠశాలలో విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయునిగా పని చేస్తూ ఉండిన షేక్ అబ్దుల్లా తను చేసిన అవినీతి చర్యలకు గాను ఉద్యోగం నుంచి తొలగించబడ్డాడు. దానితో తనను ఉద్యోగం నుంచి తొలగించిన మహారాజా పట్ల వ్యతిరేక భావన పెంచుకున్న షేక్ అబ్దుల్లా కొంతమంది మహమ్మదీయ యువకులను పోగేసి మహారాజాకు వ్యతిరేకంగా వారిని రెచ్చగొట్టి, మహమ్మదీయులకు ప్రభుత్వోద్యోగాలలో ఖచ్చితమైన కేటాయింపులుండాలని, ప్రశాసనిక వ్యవస్థలో వారికి పెద్దపీట వెయ్యాలని, మహమ్మదీయులకు మతపరంగా పూర్తి స్వాతంత్ర్యం ఇవ్వాలని కోరుతూ ఉద్యమం లేవదీశాడు. అంతటితో ఆగక “కాశ్మీర్ ముస్లిం కాన్ఫరెన్సు పార్టీ” ని ప్రారంభించాడు.

 

పండిట్ నెహ్రూ బుజ్జగింపు ధోరణి :

1939లో షేక్ అబ్దుల్లా తన కాశ్మీర్ ముస్లిం కాన్ఫరెన్సు పార్టీ పేరును “జమ్మూ – కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్సు” గా మార్చాడు. తద్వారా భారత జాతీయ కాంగ్రెస్ సహకారాన్ని, జాతీయ మీడియా ప్రాబల్యాన్ని సంపాదించగలిగాడు. దీంతో పండిట్ జవహర్లాల్ నెహ్రూకు సన్నిహితుడు, ప్రీతిపాత్రుడు అయినాడు. నెహ్రూ అబ్డుల్లాని అఖిల భారత సంస్థానాల  ప్రజానీకపు మహాసభ అధ్యక్షునిగా నియమించాడు.

1946 మే 10న ‘క్విట్ కాశ్మీర్’ పిలుపునిచ్చి మహారాజా హరిసింగ్ కు, జమ్మూకు చెందిన డోగ్రా వంశపు అధికారులకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించిన షేక్ అబ్దుల్లా మరియు ఆయన అనుచరులను కాశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. వారిని వెంటనే విడుదల చేయవలసిందిగా కోరాడు నెహ్రూ. వారి విడుదల కోసం అవసరమైతే తానే స్వయంగా కాశ్మీర్ కు వస్తానన్నాడు. షేక్ అబ్దుల్లా ఉద్యమం వెనుక బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నదని, భారతదేశ ప్రయోజనాలకు భిన్నంగానే ఉద్యమం నడుస్తోందని మహారాజా ఒక లేఖ ద్వారా నెహ్రూకు వివరించే ప్రయత్నం చేశారు. నెహ్రూ వినిపించుకోకుండా షేక్ అబ్దుల్లా, మరియు ఆయన అనుచరుల విడుదల కోసం కాశ్మీర్ కు రావడానికి ప్రయత్నించడంతో మహారాజు కాశ్మీర్లోకి నెహ్రూ రాకను నిషేధించడమే కాక, నిషేధాన్ని ఉల్లంఘించి కాశ్మీర్లోకి ప్రవేశించిన నెహ్రూను కూడా అరెస్టు చేయించారు. దీనితో అహం దెబ్బతిన్న నెహ్రూ అవకాశం వచ్చినప్పుడు మహారాజాకు బుద్ధి చెప్పాలనే ద్వేషభావనతో రగిలిపోతూ వచ్చారు.

 ఆంగ్లేయుల కుట్ర :

ఒక వైపు ఇంగ్లీషువారి ఆలోచన మరోలా ఉంది. “భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలి, కానీ భారత్ మన గుప్పెట్లో నుండి జారిపోకుండా చూడాలి. ఈ పనిని నీవే సమర్ధంగా నిర్వహించాలి.” అని ఇంగ్లాండ్ రాజు ఇచ్చిన ఆదేశాలను అమలు చెయ్యడానికి భారత్ వచ్చిన లార్డ్ మౌంట్ బాటెన్ రకరకాల ప్రలోభాలు, బెదిరింపులు, వాదాలతో నెహ్రూ, గాంధీ, సర్దార్ పటేల్ లను పాకిస్థాన్ ఏర్పాటుకు అంగీకరింపజేశాడు. అంతేకాక దేశంలోని 600 సంస్థానాలకు భారత్, పాకిస్థాన్ రెండింటిలో ఏ దేశంలోనైనా చేరే స్వేచ్ఛ కల్పించాడు. ఇందులో ఉన్న ప్రమాదాన్ని పసిగట్టిన సర్దార్ పటేల్ ముందు చూపుతో వేగంగా వ్యవహరించిన కారణంగా హైదరాబాద్, జునాగడ్, జమ్మూ – కాశ్మీర్ లు మినహా మిగిలిన సంస్థానాలన్నీ 1947 ఆగష్టు 15 నాటికి విలీనం గురించి నిర్ణయం తీసుకున్నాయి. బేషరతుగా భారతదేశంలో విలీనమవుతూ ‘ఇంస్ట్రుమెంట్ ఆఫ్ ఏక్సెషన్’ పత్రంపై ఆయా సంస్థానాధీశులు సంతకాలు చేశారు. హైదరాబాద్, జునాగడ్ సంస్థానాల నవాబులు పాకిస్థాన్లో కలవాలనుకున్నారు. కానీ ఆయా సంస్థానాల ప్రజల ఆకాంక్షలకు సర్దార్ పటేల్ చొరవ తోడవడంతో అవి రెండూ భారత్లోనే విలీనం కాక తప్పలేదు. జమ్మూ – కాశ్మీర్ మహారాజా హరిసింగ్ కు పాకిస్థాన్లో కలవాలన్న ఆలోచన లేదు. కానీ ఆగష్టు 15 లోపు విలీనం విషయమై నిర్ణయం తీసుకోలేకపోయారు. దానికి కారణం నెహ్రూ.

పగబట్టిన పాము నెహ్రూ :

మిగిలిన అన్ని సంస్థానాలను విలీనం చేసికొనే అంశాన్ని సర్దార్ పటేల్ నిర్వహించగా, జమ్మూ – కాశ్మీర్ ను విలీనం చేసికొనే విషయాన్ని ప్రధానమంత్రి నెహ్రూ తన చేతిలోనే ఉంచుకొన్నారు. జమ్మూ – కాశ్మీర్ ను విలీనం చేసుకోవటం సహజమైన విషయంగా కానీ, దేశ భద్రత దృష్ట్యా ప్రాధాన్యంగల అంశంగా గానీ గుర్తించకుండా మహారాజా హరిసింగ్ తో తనకు గల చేదు అనుభవాలకు బదులు తీర్చుకునే ఒక అవకాశంగా నెహ్రూ భావించారు. కాబట్టి షేక్ అబ్దుల్లాకు పాలనా బాధ్యతలు బదిలీ చేసి, మహారాజా తప్పుకోవాలని, అప్పుడే విలీనం విషయం ఆలోచిస్తామనే ధోరణిలో మాట్లాడారు. ఒక వైపు మౌంట్ బాటెన్ భారతా, పాకా ఏదో ఒకటి తేల్చుకోమని మహారాజాని ఒత్తిడి చేయసాగాడు. తన రాజ్యాన్ని పాక్ లో విలీనం చేసిన మరుక్షణం ముస్లిం మతోన్మాదుల బారి నుండి హిందువుల ధన మాన ప్రాణాలను కాపాడటం అసాధ్యమని మహారాజాకు తెలుసు. పోనీ భారత్లో విలీనమవుదామంటే తన బద్ధ శతృవు షేక్ అబ్దుల్లాకు అధికారం అప్పగించమంటూ పండిట్ నెహ్రూ వత్తిడి మరో వైపు. ఇలాంటి పరిస్థితుల మధ్య రామచంద్ర కాక్ అనే తన ప్రధానమంత్రి సలహా మేరకు భారత్, పాక్ లతో ఒప్పందం చేసుకుని తన రాజ్యాన్ని ఏ దేశంలోనూ విలీనం చెయ్యకుండా స్వతంత్రంగా ఉంచుకునే అవకాశమున్నదని భావించి మిన్నకుండిపోయారు మహారాజా.

కానీ జరిగింది వేరు. 1947 అక్టోబరు 24న శ్రీనగర్ కి 50 కిలోమీటర్ల దూరంలోని మహూర పవర్ స్టేషన్ ను కొండ జాతి దండుగా పేర్కొనే పాకిస్తానీ దుండగులు డైనమేట్లతో పేల్చేశారు. కాశ్మీరు లోయను ఆక్రమించుకోవడానికి దూసుకొస్తున్నారు.  నిజానికి వారందరూ సాధారణ దుస్తుల్లో ఉన్న పాకిస్తానీ సైనికులే. వారి చేతిలోని ఆయుధాలు పాక్ బలగాలవే. జమ్మూ కాశ్మీర్ పోలీసు, మిలటరీ, ప్రభుత్వ అధికార యంత్రాంగాలలోని ముస్లిములు చాల మంది పాకిస్థాన్ వైపుకు వెళ్ళిపోయారు. కాశ్మీర్లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి.

ప. పూ శ్రీ గురూజీ ప్రమేయం :

ఈ పరిస్థితులలో సర్దార్ పటేల్ సలహా మేరకు మోహర్ చంద్ మహాజన్ అనే కార్యదక్షుడిని మహారాజా తన ప్రధాన మంత్రిగా నియమించుకున్నారు. కాశ్మీర్ ను భారత్ లో విలీనం చేసే దిశగా మహారాజాను మానసికంగా సిద్దం చెయ్యమని, అవసరమైతే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ అధినేత శ్రీ గురూజీ గోళ్వాల్కర్ తో మహారాజాకు చెప్పించమన్నారు. శ్రీ మహాజన్ అప్పటి పంజాబ్ ప్రాంత ప్రచారక్ శ్రీ మాధవరావు మూలే ద్వారా గురూజీని సంప్రదించి గురూజీని అక్టోబరు 17 న శ్రీనగర్ కు పిలిపించారు. అక్టోబరు 18 న శ్రీ గురూజీ మహారాజుతో మాట్లాడారు. పాకిస్తాన్లో విలీనమైతే కాశ్మీరీ హిందువులకు దాపురించబోయే అనర్ధాలను గురూజీ మహారాజాకు వివరించారు. కాశ్మీర్ భారత్లో విలీనం కానంత వరకు పాక్ ప్రేరిత అల్లరిమూకల దాడులతో హిందూ సమాజం నలిగిపోతూ ఉండవలసిందేనని, ఎంత త్వరగా కాశ్మీర్ ను భారత్లో విలీనం చేస్తే అంత మంచిదని శ్రీ గురూజీ మహారాజాకు నచ్చజెప్పారు. అందుకు సమ్మతించిన మహారాజు శ్రీ గురూజీని తూస్ శాలువా (సన్నని ఉన్నితో చేసినది) తో సత్కరించారు.

విలీనాన్ని కోరుతూ, సైనిక సహాయాన్ని అభ్యర్ధిస్తూ మహారాజా నుండి నెహ్రూ వద్దకు మహాజన్ లేఖ తీసుకెళ్ళారు. “జమ్మూ – కాశ్మీర్ ను షేక్ అబ్దుల్లాకు అప్పగించి, రాజ్యాన్ని విడిచి పోతేనే విలీనం జరుగుతుంది. అప్పుడు మాత్రమే సైన్యాలు కదులుతాయి”. అన్నది నెహ్రూ సమాధానం. సర్దార్ పటేల్, గోపాల స్వామి అయ్యంగార్, ఆచార్య కృపలానీ, మహాత్మా గాంధీ ఎందరు చెప్పినా వినకుండా మరో రెండు రోజులు కాలయాపన చేశారు నెహ్రూ. నెహ్రూ ధోరణితో విసిగిపోయిన మహాజన్ “భారతదేశంలో విలీనానికి భారత ప్రభుత్వం అంగీకరించకపోతే పాకిస్థాన్ కు పోయి జిన్నాను కలవటానికి కూడా మహారాజా నాకు అనుమతినిచ్చారు.” అని అన్నారు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నెహ్రూ “పోండి, పోయి పాకిస్థాన్లోనే కలవండి” అని అరిచారు. ఇంతలో వెనుక గదిలో నుండి నెహ్రూకు ఎవరో ఒక చిన్న కాగితాన్ని పంపించారు. ఆ కాగితం చదివిన నెహ్రూ “ షేక్ సాహెబ్ అంగీకరించమంటున్నారు” అని గొణుగుకుంటూ, ఆ విలీన పత్రాలను గవర్నర్ జనరల్ మౌంట్ బాటెన్ ఆమోదానికి పంపారు. ప్రజాభిప్రాయంతో విలీనాన్ని ధృవీకరించాల్సి ఉంటుందనే షరతుతో విలీనాన్ని ఆమోదిస్తూ మౌంట్ బాటెన్ విలీన పత్రంపై సంతకం చేశారు.

స్వయంసేవకుల సాహసాలు :

 • 1947 ఆగష్టు 15న శ్రీనగర్ లో పాకిస్థాన్ అనుకూల శక్తులు అన్ని ప్రభుత్వ కార్యాలయాల మీదా, చౌరస్తాలలో పాకిస్థాన్ జెండాలు ఎగురవేశారు. దీనిని ఒక సవాలుగా స్వీకరించిన స్వయంసేవకులు వేల సంఖ్యలో హిందువులను సమీకరించి ఆ పాకిస్థాన్ జెండాలను పీకేసి, వాటి స్థానంలో త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు. భారత్ మాతాకీ జై నినాదంతో శ్రీనగర్ వీధులన్నీ మార్మోగాయి. ఈ విషయం తెలిసిన మహారాజా హరిసింగ్ కూడా ఆనందించారు.
 • అప్పటి కాశ్మీర్ సంఘ ప్రచారక్ శ్రీ బలరాజ్ మధోక్ వ్యూహం మేరకు ఐదుగురు యువకులు మహామ్మదీయులుగా వేషం ధరించారు. వారిలో ముగ్గురు యజమాని, వంటవాడు, సేవకుడిలా మారి ఒక మోటారు సైకిల్లో నగరమంతా తిరుగుతూ సమాచారం సేకరించి శ్రీ మధోక్ కు అందించారు. మంగళ సేన్, హరీష్ భానోత్ అనే ఇద్దరు డాక్టరు, కంపౌండరుగా మారి, ఒక క్లినిక్ ప్రారంభించి, ఉచిత వైద్యం పేరుతో పాక్ సైనికులను ఆకర్షించి వారి వ్యూహాలను తెలుసుకుని మహారాజాకు తెలియజేసేవారు.
 • పాక్ సైన్యాలను నిలువరించటం కోసం తనకు 200 మంది యువకులనివ్వమని మహారాజా కోరినపుడు శ్రీ మధోక్ మాటిచ్చిన మేరకు 200 మంది మెరికల్లాంటి యువ స్వయంసేవకుల గణాన్ని వారికి అందించారు. నెహ్రూ విలీన ప్రక్రియను ఎటూ తేల్చకుండా జాప్యం చేస్తున్నప్పుడు ఆ 200 మంది స్వయంసేవకులు మహారాజు సైనికులతో కలిసి శ్రీనగర్ వైపుకు దూసుకొస్తున్న పాక్ సైనికులను ఆ రెండు రోజుల పాటు నిలువరించారు.
 • భారత్ సరిహద్దులలో విధ్వంసం సృష్టిస్తున్న పాక్ అల్లరి మూకలను ఎదుర్కొంటున్న తన సైనికులలో స్థైర్యం నింపడం కోసం సరిహద్దులలో పర్యటిస్తున్న మహారాజా హరిసింగ్ ను భిమ్బర్లోని డాక్ బంగ్లా వద్ద అపహరించి బలప్రయోగంతో ఆయన చేత విలీన పత్రాలపై సంతకం చేయించుకోవాలని పాకిస్థాన్ అధికారులు, సైనికులు పథకం వేశారు. పాక్ అనుకూల అధికార్ల కదలికలపై ఓ కన్నేసి ఉన్న స్వయంసేవకుల హెచ్చరికలతో పర్యటన వ్యూహాన్ని మార్చుకుని ముందు రోజే భిమ్బర్ వెళ్లి పని పూర్తి చేసుకొచ్చారు మహారాజు.
 • నెహ్రూ విలీనం విషయం తేల్చలేదు సరే. ఒకవేళ ఏదోకటి తేలితే… ఆ రోజుల్లో రోడ్డు, రైలు మార్గాలు లేవు కనుక భారత సైన్యం విమానాల్లో రావాల్సిందే. అలా రావాలంటే విమానాశ్రయాలు సిద్ధంగా ఉండాలి. ఎన్నో ఏళ్ళుగా మరమ్మత్తులకు నోచుకోని విమానాశ్రయాలను బాగు చెయ్యడానికి స్వయంసేవకులు నడుం బిగించారు. వేలాది స్వయంసేవకులు ఖాకీ నిక్కర్లు వేసుకుని “దేశం కోసం సర్వమూ సమర్పిస్తాం. దానికి బదులుగా ఏమీ కోరుకోము” అంటూ భోజనాన్ని కూడా తమ ఇళ్ళ వద్ద నుంచే తెచ్చుకుని పగలు, రాత్రి శ్రమించి అనుకున్న సమయానికి శ్రీనగర్, పూంచ్, జమ్మూలలోని మూడు విమానాశ్రయాలను సిద్ధం చేశారు.
 • 1947 అక్టోబరు నెలలో సరిహద్దులోని నౌశహరా గ్రామం మీదికి పాకిస్థాన్ సైనికులు, కాబూలీలు మిడతల దండులా దాడికి వచ్చినప్పుడు అమరనాథ్ శర్మ అనే కార్యకర్త సూచనల మేరకు ఆ గ్రామంలోని 25 మంది స్వయంసేవకులు గ్రామీణులందరినీ కూడగట్టి వారి సాయంతో ఇళ్ళపైకెక్కి శత్రు మూకలపై కంకర రాళ్ళు విసుర సాగారు. మరో సంఘ కార్యకర్త పరుగున వెళ్లి సైనికాధికారులకు సమాచారమందించాడు. వారు వచ్చేంత వరకు స్వయంసేవకులు శత్రువులను రెండు గంటల పాటు నిలువరించారు. భారత సైనికుల ధాటికి పాకిస్థాన్ సైనికులు నేల కరిచారు. స్వయంసేవకుల యొక్క ఇలాంటి సాహసాలెన్నో శ్రీ నరేంద్ర సహగల్ వ్రాసిన “ఘాటీ కే స్వర్” అనే పుస్తకంలో కనిపిస్తాయి.

నెహ్రూ తప్పిదాలు :

 • మౌంట్ బాటెన్ కూడా ఆశ్చర్యపోయే విధంగా భారత సేనాధిపతులు వేలాది సైనికులను విమానాల ద్వారా కాశ్మీర్ కి అతి తక్కువ వ్యవధిలో పంపారు. లెఫ్టినెంట్ కల్నల్ రంజిత్ రాయ్, మేజర్ సోమనాథ్ శర్మల వంటి వారి తోపాటు వేలాది సైనికుల తెగువ, సాహసం, బలిదానాల కారణంగా శ్రీనగర్ ఎయిర్ పోర్టుతో సహా బారాముల్లా, ఉరీ వంటి ప్రాంతాలు మన సేనల వశమయ్యాయి. 11,578 అడుగుల ఎత్తులోని జిజోలా కనుమలపై ఉన్న శత్రువుల బంకర్లను నమ్మశక్యం కాని తెగువతో ధ్వంసం చేసి శత్రు మూకలను తరిమి కొట్టాడు మేజర్ జనరల తిమ్మయ్య.
 • సైనికులను అలాగే వదిలి వుంటే ఆ జైత్ర యాత్ర అలాగే కొనసాగి ఉండేది. కానీ మూడు వంతుల భూభాగం శత్రువుల చేతిలో ఉండగానే, దురాక్రమణ దారుల గెంటివేత పూర్తి కాకుండానే తనను తాను శాంతి దూతగా ప్రపంచానికి చాటుకోవాలనే దిక్కుమాలిన కీర్తి కండూతి కారణంగా పండిట్ నెహ్రూ అర్ధంతరంగా యుద్ధాన్ని ఆపేసి ఎవరి మాటా వినకుండా 1948 జనవరి 1న కాశ్మీర్ సమస్యను ఐక్యరాజ్య సమితికి అప్పజెప్పి అనవసరంగా సమస్యను అంతర్జాతీయం చేశాడు. దాంతో ఐక్య రాజ్య సమితి ఏకపక్షంగా 1949 జనవరి 1న కాల్పుల విరమణ ప్రకటించింది. దాంతో పోరాడాల్సిన అవసరం లేకుండానే కాశ్మీర్లోని మూడొంతుల భూభాగం పాకిస్థాన్ వశమైనట్లైంది.

ఆర్టికల్ 370 :

 • కాశ్మీర్ రాజు హరిసింగ్ సంతకం చేసిన విలీన ఒప్పందం ఇతర సంస్థానాధీశులు సంతకం చేసిన విలీన పత్రం లాంటిదే అయినా కేవలం షేక్ అబ్దుల్లా కోరిక మేరకు భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులు ముఖ్యంగా డాక్టర్ అంబేద్కర్, సర్దార్ పటేల్ వంటి వారి అభ్యంతరాలను పట్టించుకోకుండా 1949 అక్టోబర్ 17న ఆర్టికల్ 370ని పార్లమెంటులో ప్రవేశపెట్టి, ఆమోదింపజేసుకున్నాడు నెహ్రూ.
 • దీని కారణంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒక రాజ్యాంగం రూపొందించబడింది.
 • భారతదేశపు పార్లమెంటులో ఆమోదింపబడిన ఏ చట్టమైనా సరే, జమ్మూ కాశ్మీర్ శాసనసభలో ఆమోదింపబడితే తప్ప అది జమ్మూ కాశ్మీర్లో వర్తించదు.
 • దేశంలో వివిధ రాష్ట్రాల విధాన సభలకు, లోక్ సభకు ప్రతి ఐదేళ్ళకొకసారి ఎన్నికలు జరుగుతుండగా, జమ్మూ కాశ్మీర్లో మాత్రం ఆరేళ్ళకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి.
 • దేశవిభజన సమయంలో పాకిస్థాన్ గా రూపొందిన భూభాగాల నుండి తరలి వచ్చి జమ్మూ కాశ్మీర్లో నివాసం ఏర్పరచుకున్నవారికి లోక్ సభ ఎన్నికలలో ఓటు హక్కు ఉంటుంది. కానీ జామూ కాశ్మీర్ విధాన సభ ఎన్నికలలో ఉండదు. కారణం వారికి జమ్మూ కాశ్మీర్ పౌరసత్వం లేకపోవటం.
 • జమ్మూ కాశ్మీర్ పౌరులందరూ భారత పౌరులుగా పరిగణింపబడతారు. వారు దేశంలో ఎక్కడైనా ఆస్థిపాస్తులు కొని స్థిరపడొచ్చు కానీ ఇతర రాష్ట్రాలలో నివసించే వారెవరూ జమ్మూ కాశ్మీర్లో స్థిరపడేందుకు అవకాశం లేదు.
 • ఈ నిబంధన ఏర్పాటు చేయడానికి చారిత్రక కారణాలు ఉన్నాయి. 1947 సమయంలో బయటవారు కశ్మీర్‌లో ఆస్తులు కొనకూడదనే నిబంధనను భారత్‌తో ఒప్పందం కుదుర్చుకొనే నాటికే ఉంచారు. అప్పట్లో కశ్మీర్‌ వాతావరణం ఆహ్లాదంగా ఉండటంతో బ్రిటీష్‌ వారు వచ్చి స్థిరపడతారనే భయం రాజా హరిసింగ్‌లో స్వతంత్రానికి ముందు నుంచి ఉంది. మరోపక్క పంజాబీలు తరలివస్తే ఉదంపూర్‌ ప్రాంతంలోని స్థానిక డోగ్రాల అవకాశాలు దెబ్బతింటాయన్నాది ఆయన ఉద్దేశం. అయితే కాలక్రమంలో కశ్మీర్‌లోయను హిందువులు ముంచెత్తుతారనే భావన స్థానిక పార్టీల్లో మొదలైంది. దీంతో వారు ఈ నిబంధన తొలగించకుండా అడ్డం పడుతూ వచ్చారు. అయితే దీన్ని అక్కడి జిహాదీ గ్రూపులు ఒక రక్షణ కవచంగా ఉపయోగించుకున్నాయన్నది బహిరంగ రహస్యం. లోయలోని మైనార్టీలైన లక్షలాది కశ్మీరీ పండిట్లను వెళ్లగొట్టి వారి ఆస్తులను ఆక్రమించారు.

ఆర్టికల్‌ 35A :

 • రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్‌ జమ్మూకశ్మీర్‌ ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పిస్తుంది.
  * జమ్మూకశ్మీర్‌ శాశ్వత నివాసి ఎవరు? అన్న దానిని నిర్వచిస్తుంది.
  * వారి స్థిరాస్తి హక్కుల్ని నిర్ధారిస్తుంది.
 • కశ్మీర్‌ శాశ్వత నివాసి ఎవరు అన్న దానిని రాష్ట్ర రాజ్యాంగం నిర్వచించింది. 1954 మే 14వ తేదీకన్నా ముందు లేదా ఆ తేదీ నాటికి రాష్ట్రంలో జన్మించిన వ్యక్తి లేదా, పదేళ్లపాటు రాష్ట్రంలో నివసించిన వ్యక్తి కశ్మీర్‌ శాశ్వత నివాసి అవుతాడు. ఆ వ్యక్తి రాష్ట్రంలో స్థిరాస్తుల్ని కలిగి ఉండవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వం కల్పించే స్కాలర్‌షిప్‌లు, ఇతరత్రా సహాయాల్లాంటి ప్రత్యేక ప్రయోజనాలు పొందొచ్చు. దీర్ఘకాలంగా రాష్ట్రంలో నివసిస్తున్న వారికి సర్టిఫికెట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరుచేయొచ్చు. రాష్ట్ర స్థిర నివాసులు ఎవరో నిర్వచించడం కోసం చట్టాలు చేసే అధికారాన్ని జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీకి ఆర్టికల్‌ 35ఏ కట్టబెట్టింది. అయితే ఈ నిర్వచనాన్ని మూడింట రెండొంతుల మెజారిటీతో రాష్ట్ర అసెంబ్లీ మార్చొచ్చు. కశ్మీరీ మహిళ కశ్మీరేతరుణ్ని పెళ్లిచేసుకుంటే మాత్రం- ఆమె ఈ రాష్ట్రంలో స్థిరాస్తుల్ని కలిగి ఉండటానికి వీల్లేదు. ఆమె పిల్లలకూ ఆ ఆస్తిపై హక్కు ఉండదు. పిల్లలకు శాశ్వత నివాస సర్టిఫికెట్‌ను ఇవ్వరు. ఇది మహిళలపై వివక్ష కాదా..? అసలు ఇది ఏరకంగా సమానత్వాన్ని సూచిస్తుందో కశ్మీరీ పార్టీలకే తెలియాలి. ఈ నిబంధన చట్టవ్యతిరేకమని 2002లో జమ్ముకశ్మీర్‌ హైకోర్టు ప్రకటించింది కూడా. అయితే పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటే అతనికి కశ్మీరీ పౌరసత్వం లభిస్తుంది.ఇది ఎంత విడ్డూరం? కశ్మీరేతరుడు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక కాకూడదని 1956 నవంబరు 17వ తేదీన ఆమోదించిన రాష్ట్ర రాజ్యాంగం చెబుతోంది.

పారిశుద్ధ్య పనివారి పిల్లలు కూడా అలానే బతకాలా..?

 • ఈ ఆర్టికల్‌ రద్దు సందర్భంగా అమిత్‌ షా ఒక వ్యాఖ్య చేశారు. రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల హక్కులను ఆర్టికల్‌ 35(ఏ) కాలరాస్తోందని పేర్కొన్నారు. ఆయన మాటల్లో కొంత వాస్తవం ఉంది. 1957లో కశ్మీర్‌లో పారిశుద్ధ్య పనుల నిమిత్తం దేశంలోని ఇతరప్రాంతాల నుంచి దళితవర్గానికి చెందిన వాల్మీకీలను తీసుకువచ్చారు. వీరి భావితరాలు కూడా ఇక్కడ పారిశుద్ధ్య పనులు చేస్తూ బతకాలి అనే నిబంధనతోనే వారికి శాశ్వత నివాస పత్రాలను ఇచ్చారు. ఇంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా? వారి పిల్లల్లో ప్రతిభావంతులు ఉండరా..? వారికి ఈ ప్రపంచంలో మంచి హోదాతో జీవించే హక్కు ఉండకూడదా.. ఇప్పటీకి వారి తర్వాతి తరాలు అవే పనులు చేస్తూ పొట్టపోసుకుంటున్నాయి. ఇదొక ఆధునిక కట్టు బానిసత్వం కాదని అక్కడి పార్టీలు చెప్పగలవా..?

ఆర్టికల్ 35A పాకిస్థాన్‌కు మనం ఇచ్చిన ఆయుధమే..

 • ఆర్టికల్‌ 35(ఏ) భారతీయులు, కశ్మీరీలు అనే కృత్రిమ విభజన భావన పుట్టుకకు కారణమైంది. అత్యంత ప్రతిభావంతులైన కశ్మీరేతరులకు కూడా ఇక్కడి విద్యాలయాల్లో ఉపకారవేతనాలు లభించవు. వీరికి కోర్టులను ఆశ్రయించే అవకాశం కూడా లేకుండా చేస్తోందీ నిబంధన. కశ్మీర్‌కు భారత్‌కు మధ్య ఉన్న ఈ చిన్న విభజన రేఖను పాక్‌ పెద్దది చేసి పబ్బం గడుపుకుంటూ వస్తోంది. అక్కడి వేర్పాటు వాదానికి ఈ విభజన రేఖే పునాది రాయి. ఫలితంగా కశ్మీర్‌లో కొత్తగా ఎటువంటి పెట్టుబడులు రావడంలేదు. కశ్మీరీలు బయట ప్రపంచంతో కలిసి అభివృద్ధి చెందితే మత ఛాందసాన్ని కోరుకోరు.. ఈ విషయం అభివృద్ధి చెందిన ముస్లిం దేశాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. టర్కీ వంటి దేశాల్లో మహిళలు అనుభవించే స్వేచ్ఛ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం ప్రజలను 35(ఏ)తో చీకటిలో ఉంచి తమ పబ్బం గడుపుకోవాలన్నదే అక్కడి రాజకీయ పార్టీలు, వేర్పాటు వాదులుగా చెప్పుకొనేవారి వ్యూహం. అక్కడి రాజకీయ నాయకులు అక్రమ సంపాదనల్లో మునిగి తేలుతూ కొండచిలువల్లా కశ్మీరీ ఆస్తులను మింగేస్తున్నారు. సగటు కశ్మీరీ మాత్రం కటిక పేదరికంలో జీవిస్తూ కాలం గడుపుతున్నాడు. తాజాగా ఆర్టికల్‌ 35(ఏ)ను రద్దు చేయడంతోనే భారత్‌ అక్కడి అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేసింది. కశ్మీర్‌లో అక్టోబర్‌లో పెట్టుబడిదారుల (ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌) భారీ సమావేశం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.

పాకిస్థాన్ దురాక్రమణను తిప్పికొట్టగలిగీ…

 • 1947 తర్వాత పాకిస్థాన్ 1948, 1965, 1971 లలో భారత్ తో యుద్ధాలు చేసింది. 1947, 48లలో ఏం జరిగిందో మనకు తెలుసు. 1965లో పాకిస్థాన్ చేసిన దుస్సాహసానికి భారత సైన్యం తగు రీతిలో బదులిచ్చింది. పాక్ భూభాగంలోని హజీపీర్ కనుమను కూడా మనవాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. కానీ మన ప్రభుత్వం కాశ్మీర్ సమస్యకు పరిష్కారం కోరకుండానే తాష్కెంట్ ఒప్పందం పేరుతో దానిని పాకిస్థాన్ కు తిరిగి అప్పగించింది.
 • 1972లో కూడా సిమ్లా ఒప్పందంలో భారత్ తాను గెలుచుకున్న భూభాగాల తోపాటు, బందీలుగా దొరికిన 70 వేల మంది పాక్ సైనికులను కూడా పాక్ కు పువ్వుల్లో పెట్టి అప్పగించింది నాటి ఇందిరా గాంధీ ప్రభుత్వం.

వెఱ్రి తలలు వేసిన వేర్పాటువాదం :

 • 1986 – 88 మధ్యలో ముస్లిం ముల్లాలు కాశ్మీర్ వ్యాప్తంగా పర్యటించి కాశ్మీరీ ముస్లిములకు ఇస్లామిక్ తీవ్రవాదాన్ని, పరమత ద్వేషాన్ని నూరిపోశారు.
 • కాశ్మీర్లో “ఇస్లాం ప్రమాదంలో ఉంది.” మాకు కాశ్మీర్ కావాలి. పండిట్లు వద్దు.” కానీ వారి స్త్రీలు కావాలి.”కాశ్మీర్లో ఉండాలంటే అల్లాహో అక్బర్ అనాలి.” ఇండియన్ కుక్కల్లారా వెళ్ళిపోండి.” “పండిట్లారా మాతో కలవండి, పారిపోండి, లేదా చావండి.” లాంటి నినాదాలు నిత్యకృత్యమైపోయాయి.
 • ఫలితంగా 1990 ఫిబ్రవరి నుంచి మార్చి లోపల 1,40,000 నుంచి 1,60,000 వరకు పండిట్లు కాశ్మీర్ నుంచి జమ్ముకు, డిల్లీకి, దేశంలోని ఇతర ప్రాంతాలకు పారిపోయారు. చివరికి నాలుగు లక్షల కాశ్మీరీ హిందువులు శరణార్ధులుగా మారిపోవలసి వచ్చింది. మారణ కాండ నిత్య కృత్యమైంది.
 • సాయుధ తీవ్రవాదం వేళ్ళూనుకుని కాశ్మీరీ పండిట్లను తరిమివేసిన తర్వాతే శాంతి భద్రతలను కాపాడటానికి కాశ్మీర్ లోయలో పారామిలటరీ బలగాలను మోహరించారు. అయినా తాము తలచుకుంటే ఎప్పుడైనా అరాచకం సృష్టించగలమని తీవ్రవాదులు ఎన్నోసార్లు ఋజువు చేశారు.
 • ఈ ప్రయత్నంలో ఎందరో సీ ఆర్ పీ ఎఫ్ సిబ్బంది బలయ్యారు. రాళ్ళు రువ్విన ఘటనలలో ఎందరికో చూపు పోయింది, ముఖాలు పగిలి వికృతమాయ్యాయి. కాశ్మీర్లో సాయుధ దళాలను ఉపసంహరించమని వేర్పాటు వాదులు ఎన్నో ఆందోళనలు చేపట్టారు.

కాశ్మీర్ స్టడీ సెంటర్ కృషి :

 • శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం యొక్క ఈ విజయం వెనుక రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ పోరాటం ఉంది. ఎందరో స్వయంసేవకుల బలిదానాలున్నాయి. కృషి ఉంది. తపస్సు ఉంది. అధ్యయనం ఉంది.
 • రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ అనుబంధ విభాగం “కాశ్మీర్ స్టడీ సెంటర్” గత కొన్ని దశాబ్దాలుగా జమ్మూ కాశ్మీర్ స్థితిగతులు, వేర్పాటు వాదం, ప్రజల ఇబ్బందులు తదితరాలపై అధ్యయనం చేసింది.
 • ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ శ్రీ అరుణ్ కుమార్, శ్రీ ఇంద్రేశ్ కుమార్ తదితరుల నేతృత్వంలో జరిగిన అధ్యయనంలో అనేక విషయాలు ప్రపంచానికి వెల్లడయ్యాయి.
 • ప్రత్యేక ప్రతిపత్తి, వేర్పాటు వాదాల కారణంగా మిగతా దేశం కంటే జమ్మూ కాశ్మీర్ ప్రాంతం 25 ఏండ్లు వెనుకబడి ఉంది.
 • ఈ వెనుకబాటు, పేదరికం కారణంగానే చదువు, పని లేక యువత వేర్పాటువాదుల వలలో చిక్కుతోంది. పొట్ట నింపుకోవడం కోసం రాళ్ళు రువ్వే ముఠాలలో చేరుతోంది.
 • అందరూ అనుకుంటున్నట్లుగా జమ్మూ కాశ్మీర్ మొత్తం సమస్యాత్మక ప్రాంతం కాదు. జమ్మూ, కాశ్మీర్, లడాక్ లలో అతి చిన్న భూభాగమైన కాశ్మీర్ లోయలో మాత్రమే వేర్పాటు వాదం ఉన్నది.
 • అది కూడా అందరి ప్రజల ఆకాంక్ష కాదు. షియా వర్గీయులు వేర్పాటుకు విముఖంగా ఉన్నారు. అయితే ఇప్పటి వరకూ దేశంలోని సెక్యులర్ ప్రభుత్వాలు, పార్టీలన్నీ కాశ్మీర్ లోయకు చెందిన వేర్పాటు వాదుల గొంతుకనే యావత్ జమ్మూ కాశ్మీర్ గొంతుకగా వినిపిస్తూ వస్తున్నాయి. ప్రపంచం కూడా అలాగే చూస్తూ వచ్చింది. ఇది చాలా ప్రమాదకరం.
 • ఇక జమ్మూ, లడాక్ ప్రాంతంలో హిందువులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఆర్టికల్ 370, 35A ల వల్ల తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. వాటి నుంచి విముక్తికై ఎదురు చూస్తున్నారు.
 • కనుక కాశ్మీర్ నుంచి జమ్మూ, లడాక్ లు వేరు పడితేనే ఆ ప్రాంతాల అభివృద్ధి సాధ్యం. సమస్యాత్మక కాశ్మీర్ తో కలిపి ఉంచితే అభివృద్ధికి నోచుకోక పోవడమే కాకుండా ఆ ప్రాంతంలోని హిందువుల మాన ప్రాణాలకు కూడా రక్షణ కల్పించడం కష్టం.
 • అసలిప్పటివరకూ జామ్మూ కాశ్మీర్ రక్షణకై భారత ప్రభుత్వం 70 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది. కానీ అభివృద్ధి మాత్రం శూన్యం. ఇదంతా కేవలం వేర్పాటువాద నాయకుల జేబుల్లోకి వెళ్ళింది.
 • ఇప్పుడు శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం వెనుక జమ్మూ కాశ్మీర్ స్టడీ సెంటర్ యొక్క కృషి, అధ్యయనం ఎంతో ఉంది.

ఆర్టికల్ 370, 35A రద్దు :

ఆగష్టు 5 న రాజ్యసభలో జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు భారత హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రతిపాదించిన క్షణాల్లోనే రాష్ట్రపతి ఆమోదం తెలుపుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్‌పై ఇక సర్వాధికారాలు కేంద్రానికే వచ్చాయి. కశ్మీర్ సరిహద్దుల మార్పు, అత్యవసర పరిస్థితిని విధించే అధికారాలు కేంద్రం పరిధిలోకి వచ్చాయి. ఇకపై పార్లమెంట్ చేసే ప్రతి చట్టం జమ్మూకశ్మీర్‌లోనూ అమలు అవుతుంది. దీంతోపాటు కశ్మీర్‌లో నియోజకవర్గ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లు కూడా రాజ్యసభ ముందుకు వచ్చింది. వెనువెంటనే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ జమ్ముకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తూ ఆదేశాలు జారీ చేశారు.

దీంతో దేశవ్యాప్తంగా హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. జమ్మూ, లడ్డాక్ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. అయితే ఇంతటితో సమస్య సద్దుమణిగినట్లు కాదు. ఇప్పుడిక కాశ్మీర్లో చీమ చిటుక్కుమన్నా కేంద్ర ప్రభుత్వమే జవాబు దారీ. జామ్మూ, కాశ్మీర్, లడ్డాక్ ప్రాంతాలలో విస్తృతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, ప్రజల యొక్క కనీస అవసరాలు తీర్చడం, ఉపాధి కల్పన ద్వారా వారి స్థితి గతులలో మార్పు తీసుకొచ్చి, వేర్పాటువాదుల కబంద హస్తాల నుంచి వారిని విముక్తం చెయ్యాలనేది కేంద్రం వ్యూహంలా కనిపిస్తోంది.

 

ఆర్టికల్ 370, 35A ల రద్దును, జమ్మూ కాశ్మీర్ పునర్విభజనను వ్యతిరేకిస్తున్న పక్షాల వైఖరి ఆక్షేపణీయం :

 • రాజా హరిసింగ్ సంపూర్ణ జమ్మూ కాశ్మీర్ భూభాగాన్ని భారత్లో విలీనం చేశారు. విలీనం పూర్తిగా చట్ట బద్దమైనదన్న విషయాన్ని ఐక్య రాజ్య సమితి కూడా నిర్ధారించింది. కాశ్మీర్ అల్లర్లు పాకిస్థాన్ ప్రేరితమని కూడా ఐరాస పేర్కొనివుంది.
 • స్వాతంత్ర్యానికి పూర్వం జమ్మూ కాశ్మీర్ భూభాగం 2,22,236 చదరపు కిలోమీటర్లు ఉండేది.
 • పాలకుల నిర్లక్ష్యం కారణంగా స్వాతంత్ర్యానంతరం చైనా, పాకిస్థాన్ లు 1,20,849 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించుకున్నాయి. అయినా అప్పటి పాలకులకు చీమైనా కుట్టలేదు.
 • భారత్ అధీనంలో గల మిగిలిన 1,01387 చదరపు కిలోమీటర్ల భూభాగంలో బౌద్ధులు అధికంగాఉండే 59000 చదరపు కిలోమీటర్ల లడాక్ భూభాగమే అతి పెద్దది. 27000 చదరపు కిలోమీటర్ల భూభాగంతో జమ్మూ విస్తీర్ణంలో రెండవ స్థానంలో ఉండగా, సమస్యాత్మక కాశ్మీర్ లోయ అతి చిన్నది. కేవలం 15000 చదరపు కిలోమీటర్లు ఉంటుంది.
 • ఈ అతి చిన్న కాశ్మీర్ లోయలోని వేర్పాటువాద ప్రభావిత ప్రజల మనో భావాలనే జమ్మూ కాశ్మీర్ ప్రజల అభీష్టంగా ఇన్నాళ్ళూ కొన్ని వర్గాలు ప్రచారం చేశాయి. దీనిని ఆసరా చేసుకునే కాశ్మీర్లో ప్లెబిసైట్ నిర్వహించాలని కొందరు వెఱ్ఱి ప్రేలాపనలు చేస్తున్నారు. కాశ్మీర్ భారత్లో అంతర్భాగమైనపుడు ఇక ప్లెబిసైట్ కు అవకాశము, అవసరము ఎక్కడిది?
 • అదే 1990లో 4 లక్షల హిందూ కుటుంబాలు జమ్మూ కాశ్మీర్ నుంచి తరిమివేయబడ్డప్పుడు ఈ నోళ్ళు మూగబొయ్యాయి. నేడు జమ్మూ కాశ్మీర్ పై ఇంత చర్చ జరుగుతూ ఉంటే కూడా వారు కాశ్మీర్ నుంచి తరిమివేయబడ్డ హిందువుల ప్రస్తావన తేవడం లేదు.
 • దశాబ్దాలుగా జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతల రక్షణ కోసం ప్రాణాలర్పించిన సైనికులు, పోలీసులకు నిజమైన నివాళి ఈ నిర్ణయం.
 • ఈ అధికరణల రద్దు, పునర్విభజన రాజ్యాంగ విరుద్ధమని వాదించటం పచ్చి అబద్ధం. ఎక్కడా రాజ్యాంగ ఉల్లంఘన జరుగలేదు. ఈ అధికరణాలు తాత్కాలికమని స్పష్టంగా ఉంది.
 • ప్రజాభిప్రాయానికి విరుద్ధమంటున్నారు. జమ్మూ, లడాక్ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నవారి దృష్టిలో జమ్మూ, లడాక్ ప్రజలు ప్రజలు కాదా? మతం మారిన, పాకిస్థాన్ నుంచి అక్రమంగా చొరబడిన కాశ్మీర్ లోయలోని ముస్లిములే వారి దృష్టిలో ప్రజలా?
 • మనమందరం వాస్తవ పరిస్థితులను అవగాహన చేసుకోవాలి. దశబ్దాలుగా దేశాన్ని తప్పుదోవ పట్టిస్తూ తమ పబ్బం గడుపుకుంటూ వచ్చిన స్వార్ధ శక్తుల ఆట కట్టించాలి.

మొత్తానికి 70 ఏళ్ళ కళంకం తుడిచిపెట్టబడింది. దేశానికి మంచి రోజులొచ్చాయి.