
నెల్లూరు జిల్లా గూడూరులో సద్భావనా సదస్సు పేరుతో వివిధ కుల సంఘాల నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 21 కులాలకు చెందిన 95 మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రారంభోపన్యాసం చేసిన ఆర్.ఎస్.ఎస్ ఆంధ్ర ప్రాంత సహ కార్యవాహ శ్రీ దువ్వూరు యుగంధర్ మాట్లాడుతూ “వ్యక్తిగా నేనొక్కడినే, మా ఇంటి పేరిట వారు పదుల సంఖ్యలో ఉండొచ్చు. అదే మా గోత్రం కలిగిన వారు వందల సంఖ్యలో ఉండొచ్చు. మా కులం వారు లక్షల్లో ఉండొచ్చు. నేను నా పరిధిని మరింత విస్తృతం చేసుకుంటే నేను కోట్లాది హిందువులలో ఒకడిని. నేనిప్పుడు ఒక్కడిని, ఒంటరిని కాదు కోట్లాది మంది బంధువులు కలవాడిని.” అని చెబుతూ అందరూ తమ పరిధిని విస్తరించుకోవాలని తెలిపారు. మనం మన కుటుంబానికో, కులానికో పరిమితమై పోకుండా యావత్ హిందూ సమాజం యొక్క అంగ స్వరూపులుగా మనల్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరమున్నదని తెలిపారు. “సర్వే జనా సుఖినో భవంతుః” , “లోకాస్సమస్తా సుఖినోభవంతుః” అని కోరేది హిందుత్వమేనన్నారు. ప్రపంచ చరిత్రలో ఎన్నడూ ఏ ఇతర మతంపైన గానీ, జాతి పైన గానీ, దేశం పైన గానీ హిందువులు దాడికి పాల్పడ్డ చరిత్ర లేదని, అందుకే హిందుత్వం విశ్వ కళ్యాణ కారకమని, మనమందరమూ హిందుత్వాన్ని కాపాడుకోవాలని, హిందువులుగా గర్వించాలని తెలిపారు.

ముగింపు కార్యక్రమంలో ఆర్.ఎస్.ఎస్ ఆంధ్ర ప్రాంత ప్రచార ప్రముఖ్ శ్రీ బయ్యా వాసు మాట్లాడుతూ భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రపంచ దేశాలలోని ప్రజలందరికీ మార్గదర్శిగా నిలచిందని తెలిపారు. భారతీయ వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ కారణంగా ప్రపంచంలో భారత్ ప్రత్యేకతను, గౌరవాన్ని పొందగలుగుతోందన్నారు. మన కుటుంబాలలో గోవుని తల్లిగా భావించి ప్రతి ఇంట్లో గో సంరక్షణకు ప్రాధాన్యమిచ్చామని, అలాంటి గోమాత నేడు కనుమరుగయ్యే పరిస్థితి ఉత్పన్నమైందని ఆవేదన వెలిబుచ్చారు.
ఆర్.ఎస్.ఎస్ కార్యకర్త యావద్దేశాన్ని తన కుటుంబంగా భావిస్తాడని, అందుకే దేశంలో ఏమూల ఏం జరిగినా ఆర్.ఎస్.ఎస్ కార్యకర్త, స్వయంసేవక్ స్పందిస్తాడని శ్రీ వాసు తెలిపారు. స్వాతంత్ర్యానంతరం దేశ విభజన జరిగిన సమయంలో ఖండిత భూభాగం నుంచి చిట్టచివరి హిందువు సైతం క్షేమంగా సరిహద్దులు దాటేలా జాగ్రత్త వహించాలని అప్పటి ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘచాలక్ పరమ పూజ్యనీయ శ్రీ గురూజీ స్వయంసేవకులను ఆదేశించారని, ఆ ఆదేశాన్ని శిరసా వహించిన స్వయంసేవకులెందరో తమ ప్రాణాలను పణంగా పెట్టి ఖండిత భూభాగం నుంచి హిందువులు క్షేమంగా భారత్లో అడుగు పెట్టడానికి కృషి చేశారని తెలిపారు.

స్వయంసేవక్ దేశానికి హితం చేకూర్చే పరిణామం సంభవిస్తే ఆనందంతో కేరింతలు కొడతాడని, దేశానికి ప్రమాదం సంభవిస్తే వీర సైనికుడై ఉద్యమిస్తాడని అన్నారు. అందుకే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు నిర్మించిన రామ సేతువును తొలగించాలని గత ప్రభుత్వాలు ప్రయత్నించినప్పుడు దేశవ్యాప్త ఉద్యమంతో ఆర్.ఎస్.ఎస్ వారి ప్రయత్నాన్ని నిలువరించి ‘రామసేతు’ను కాపాడిందని తెలిపారు. అలాగే వివేకానంద రాక్ మెమోరియల్, అమరనాథ్ లలో కూడా సంక్షోభాలు ఎదురైనపుడు ఆర్.ఎస్.ఎస్ హిందూ సమాజాన్ని జాగృతమొనర్చి విజయాలు సాధించిందని తెలిపారు.
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సామాజిక పరివర్తన కోసం చేస్తున్న కృషిలో భాగంగా సమాజంలోని వివిధ రంగాలలో పనిచేస్తున్నదని, అందరూ ఆ సామాజిక పరివర్తనా కార్యంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
వీరిరువురి ప్రసంగాలతో శ్రోతలు మంత్ర ముగ్ధులయ్యారు. శ్రోతలు ఆద్యంతం కరతాళ ధ్వనులతో తమ ఆమోదాన్ని, హర్షాన్ని వెలిబుచ్చారు.





