News

ఏజెన్సీ అడవులకు ‘విత్తన బంతుల’తో కొత్త ఊపిరి

30views

విశాఖ ఏజెన్సీ: ఒకప్పుడు విస్తారమైన అడవులు, ఎత్తైన కొండలు, సమృద్ధిగా వృక్ష, జంతు సంపదకు నిలయంగా ఉన్న ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో క్రమంగా అటవీ విస్తీర్ణం తగ్గుతోంది. పోడు వ్యవసాయం, కొండలను చదును చేయడం, చెట్ల నరికివేత, ఇళ్ల నిర్మాణం, రహదారుల విస్తరణ వంటి కారణాలతో అడవులపై ఒత్తిడి పెరుగుతోంది.

అడవుల నరికివేత కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో వర్షాలు కురవకపోవడం, ఉష్ణోగ్రతలు పెరగడం వంటి పరిణామాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటవీ ప్రాంతాలను పునరుజ్జీవింపజేసేందుకు అటవీశాఖ ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టింది.

విత్తన బంతులతో పచ్చదనం
ఏజెన్సీలో అటవీ విస్తీర్ణాన్ని పెంచే లక్ష్యంతో ఈ ఏడాది ‘విత్తన బంతుల’ కార్యక్రమాన్ని చేపట్టారు. పాడేరు, చింతపల్లి అటవీ డివిజన్ల పరిధిలోని 14 రేంజ్‌లలో విత్తన బంతులను తయారు చేసి వాటిని అడవుల్లో నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

సాంప్రదాయ పద్ధతిలో గోతులు తీసి మొక్కలు నాటడంతో పాటు, మారుమూల కొండ ప్రాంతాల్లోనూ పచ్చదనాన్ని పెంచేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగా డ్రోన్ల ద్వారా విత్తన బంతులను అడవుల్లో వెదజల్లుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో విత్తన బంతులను చల్లారు. ప్రతి హెక్టారులో నిర్ణీత సంఖ్యలో విత్తన బంతులను నాటేలా అటవీశాఖ చర్యలు చేపట్టింది.

గ్రామ సభలతో అవగాహన
విత్తన బంతులను అడవుల్లో వెదజల్లడంతో పాటు అటవీ సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అటవీశాఖ గ్రామసభలు నిర్వహిస్తోంది. చెట్ల నరికివేత, వేసవిలో అడవులకు నిప్పు పెట్టడం వల్ల కలిగే నష్టాలను గిరిజనులకు వివరిస్తున్నారు.

రైతులు, గిరిజనులకు విత్తన బంతులను అందజేసి వారి భూముల్లోనూ వాటిని నాటించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. తద్వారా అడవులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ పచ్చదనాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

పలు రకాల విత్తనాలతో బంతుల తయారీ
చింత, రావి, నేరేడు, తురకవేప, మామిడి, నల్లమద్ది తదితర మొక్కల విత్తనాలను విత్తన బంతుల రూపంలో తయారు చేసి నాటుతున్నారు. మారుమూల ప్రాంతాల్లో మొక్కలు పెంచేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.

ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
ఏజెన్సీలో అడవుల విస్తీర్ణం తగ్గుతున్న నేపథ్యంలో అటవీశాఖ చేపట్టిన విత్తన బంతుల కార్యక్రమాన్ని పాఠశాల విద్యార్థులు, గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని చింతపల్లి డీఎఫ్‌వో వైవీ నర్సింగరావు కోరారు.

ప్రతి గ్రామంలో మరిన్ని మొక్కలు నాటే కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. గిరిజనులు చెట్లను నరకకుండా అడవులను కాపాడాలని సూచించారు. అడవులను సంరక్షిస్తేనే భవిష్యత్తులో మానవాళికి ఎదురయ్యే పర్యావరణ ముప్పులను తగ్గించగలుగుతామని పేర్కొన్నారు.– వైవీ నర్సింగరావు, డీఎఫ్‌వో, చింతపల్లి