News

‘జాగృతి’ ఇంటింటికీ చేరాలి

1.4kviews

నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రామన్నపాళెం సమీపంలో గల ఆదిశంకర ఇంజినీరింగ్ కాలేజి ఆవరణలో 25/8/2019 ఆదివారం ఆర్. ఎస్. ఎస్ ప్రచార విభాగం ఆధ్వర్యంలో ‘జాగృతి’ వార పత్రిక ప్రముఖుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి 42 మంది ప్రముఖులు పాల్గొనగా ఆర్. ఎస్. ఎస్ ఆంధ్ర ప్రాంత సహ కార్యవాహ శ్రీ యుగంధర్, ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్ శ్రీ పుట్టా శేషు, ప్రాంత ప్రచార ప్రముఖ్ శ్రీ బయ్యా వాసు, జాగృతి అసోసియేట్ ఎడిటర్ శ్రీ దుర్గారెడ్డిలు పాల్గొని మార్గదర్శనం చేశారు.

శ్రీ యుగంధర్ మాట్లాడుతూ ‘జాగృతి’ వార పత్రిక నాణ్యత విషయంలో గతంలోనూ, ఇప్పుడు వచ్చిన మార్పుల గురించి వివరించి పత్రిక నాణ్యత విషయంలో ఇంకా తీసుకోవలసిన చర్యల విషయమై ప్రముఖుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. వచ్చిన ప్రముఖులు కూడా పలు విషయాలను సూచించారు.

అనంతరం శ్రీ బయ్యా వాసు మాట్లాడుతూ ‘జాగృతి’ పత్రిక కేవలం ఒక వార్తా పత్రిక కాదని పాఠకులకు వివిధ అంశాలపై ఒక దృష్టి కోణాన్ని ఏర్పరచే, ఎలాంటి దృష్టికోణం ఉండాలో తెలిపే పత్రిక [న్యూస్ పేపర్ కాదు వ్యూస్ పేపర్] అని తెలిపారు. తెలుగులో వచ్చిన అనేక వార పత్రికలు కాలగమనంలో మరుగున పడిపోయాయని, ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని, సిద్ధాంతం కోసం పని చేస్తున్న ‘జాగృతి’ వార పత్రిక 72 సంవత్సరాలుగా తన ప్రస్థానాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తూనే ఉన్నదని తెలిపారు. అలాంటి ‘జాగృతి’ ఇంటింటికీ చేరాలని, అందుకు చందాదారుల సంఖ్య పెరగాలని, అందుకోసం కార్యకర్తలందరూ కృషి చెయ్యాలని శ్రీ వాసు తెలిపారు.

చివరిగా శ్రీ పుట్టా శేషు ప్రముఖులందరినీ అడిగి ఆయా జిల్లాలలో మండలాల వారీగా ప్రస్తుతమున్న ‘జాగృతి’ చందాదారుల వివరాలు, సంఖ్య తీసుకున్నారు. అనంతరం ఈ ఏడాది ఏ మండలంలో ఎంత మంది క్రొత్త చందాదారులను చేరుస్తున్నారో ఆ సంఖ్య వివరాలు అడిగి లక్ష్యాలు నిర్దేశించారు.

‘జాగృతి’ వార పత్రిక అసోసియేట్ ఎడిటర్ శ్రీ దుర్గారెడ్డి సమావేశ వివరాలను ఆసక్తిగా నోట్ చేసుకుంటూ కనిపించారు. మొత్తం మీద ఈ కార్యక్రమం ద్వారా ‘జాగృతి’ వార పత్రిక నాణ్యత, గమనం, చందాల విస్తరణ విషయమై తమకు కావలసిన మార్గదర్శనం లభించిందని మూడు జిల్లాల ప్రముఖులు తెలిపారు.