NewsProgramms

నెల్లూరు జిల్లా గూడూరులో “శ్రీకృష్ణ దర్శనం”

100views

కంస, జరాసంధ, నరకాసురాది రాక్షసుల చెర నుంచి అశేష జనవాహినిని రక్షించడానికి దేవకీ వసుదేవుల అష్టమ సంతానంగా చెరసాలలో జన్మించిన సాక్షాత్తు విష్ణుమూర్తి శ్రీ కృష్ణుడు. యశోదా నందుల ముద్దుల క్రిష్ణయ్యే  పూతనాది రాక్షసులను అంతం చేశాడు. కాలీయుడిని మర్ధించి యమునను విష రహితం చేశాడు. గోవర్ధనమెత్తి ఇంద్రుని అహాన్ని అణచాడు. ఆ గోకుల కృష్ణుడే అవును సాక్షాత్తూ ఆ యశోదా కృష్ణుడే గూడూరులో దర్శనమిచ్చాడు. బుడి బుడి అడుగుల ఆ చిన్ని కృష్ణుల పావన పద స్పర్శతో ఆ మైకా సిటీ మైమరచి పోయింది. తమ ఇంటి చిన్ని కృష్ణుల విన్యాసాలు చూసి మాతృలోకం మురిసిపోయింది. గుడూరులోని ప్రతి లోగిలీ గోకులమైంది. గూడూరు పుర వీధులలో శ్రీ కృష్ణ దర్శనమైంది.

విశ్వహిందూ పరిషత్, శ్రీ కృష్ణ దర్శన కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఏడాది లాగే ఈ ఏడు కూడా నెల్లూరు జిల్లా గూడూరులో శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా “శ్రీ కృష్ణ దర్శనం” కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తం 3000 మంది పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ విభాగ్ కార్యదర్శి శ్రీ డేగా మల్లా రెడ్డి సభికులనుద్దేశించి కొద్దిసేపు ప్రసంగించారు.

22/8/2019 గురువారం మధ్యాహ్నం 2 గంటలకు గోపూజతో ఈ కార్యక్రమం గుడురులోని టవును హాలు నందు ప్రారంభమైంది.  శ్రీకృష్ణ పూజ, గణపతి పూజ, భజన అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు శ్రీ కృష్ణ వేషధారణ పోటీలు జరిగాయి. ఈ పూజలలో ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీ సిద్దారెడ్డి జనార్ధన రెడ్డి గారి సతీమణి శ్రీమతి ఇంద్రసేనమ్మ జనార్ధనరెడ్డి పాల్గొన్నారు. నగరంలోని వివిధ పాఠశాలల నుంచి మొత్తం 700 మంది బాల బాలికలు శ్రీకృష్ణ వేషధారణ పోటీలలో పాల్గొన్నారు. అత్యధికంగా 289 మంది శ్రీకృష్ణ వేషధారులు పాల్గొన్న శ్రీ వివేకానంద ఇంగ్లీషు మీడియం పాఠశాల ప్రధమ స్థానంలో నిలవగా 185 మంది శ్రీకృష్ణ వేషధారులు పాల్గొన్న నారయణ, 40 మంది పాల్గొన్న లిటిల్ ఏంజిల్స్ పబ్లిక్ స్కూల్ లు ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచాయి.

గూడూరు పుర వీధులలో సాయంత్రం 4.30 నుంచి ప్రారంభమైన శోభాయాత్రలో మొత్తం అయిదు రథాలు పాల్గొన్నాయి. దివ్యంగా అలంకరించిన రథాలలో చిన్నారి శ్రీకృష్ణులతో శోభాయాత్ర కన్నులపండువగా జరిగింది. దారి పొడవునా ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా శోభాయాత్రకు నీరాజనాలు పట్టారు. ఈ శోభా యాత్రలో గ్రీన్ వ్యాలీ పబ్లిక్ స్కూల్ ప్రధమ స్థానంలో నిలువగా, నారాయణ, శ్రీ సరస్వతి శిశుమందిర్ లు ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచాయి.

అనంతరం 6 గంటలకు ప్రారంభమైన నృత్య పోటీ (శ్రీ కృష్ణుని భక్తి గీతాలకు) లలో మొత్తం 27 పాఠశాలల నుంచి బాల బాలికలు పాల్గొన్నారు. ఈ నృత్య ప్రదర్శనలు ప్రతి ఏడాది లాగే ఇప్పుడు కూడా ఆద్యంతము ఆహూతులను అలరించాయి. ఈ నృత్యాలు చూసి ప్రేక్షకులు మైమరచి పోయారు. ఈ నృత్య పోటీలలో లిటిల్ ఏంజిల్స్ పబ్లిక్ స్కూల్ ప్రధమ స్థానంలో నిలువగా ద్వితీయ, తృతీయ స్థానాలలో నారయణ, ఆదిశంకర విద్యా సంస్థలు నిలవడం గమనార్హం.

ఈ కార్యక్రమంలో హైదరాబాదుకి చెందిన శ్రీ రాజనేని చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్  శ్రీ రాజనేని శ్రీనివాస నాయుడు, ప్రముఖ ‘నెల్ క్యాస్ట్’ పరిశ్రమ హెచ్. ఆర్ డిపార్ట్ మెంట్ హెడ్ శ్రీ ఎన్. ఎస్ రెడ్డి తదితర పెద్దలు పాల్గొన్నారు.