News

ఆగస్టులో భారత్‌ గౌరవ్‌ యాత్రకు రెండు రైళ్లు

285views

ఉత్తరాఖండ్‌ యాత్ర, జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్రలకు భారత్‌ గౌరవ్‌ యాత్ర స్పెషల్‌ రైళ్లను ఆగస్టు నెల 4,8 తేదీలలో నడపనున్నట్టు ఐఆర్‌సీటీసీ ఏరియా మేనేజర్‌ ఎం.రాజా తెలిపారు. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌ వీఐపీ లాంజ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రత్యేక యాత్ర రైళ్ల వివరాల బ్రోచర్లను స్టేషన్‌ మేనేజర్‌ రంగనాథ్‌, సీటీఐ చంద్రమౌళితో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ ఉత్తరాఖండ్‌ యాత్ర ఆగస్టు 8న ప్రారంభం కానుందన్నారు. ఈ రైలు మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్నంలో బయలు దేరి సాయంత్రం 6 గంటలకు రాజమహేంద్రవరం చేరుకుంటుందన్నారు. ముందుగా రిజర్వేషన్‌ పొందిన యాత్రికులను ఎక్కించుకుని బయలుదేరుతుందన్నారు. సుమారు 300 మంది యాత్రికులతో భీమాల్‌, అల్మోరా, కౌసని, రాణిఖేత్‌ ప్రదేశాలను సందర్శించే ఈ రైలు యాత్ర 11 రోజులపాటు సాగుతుందన్నారు. ప్యాకేజీలో భాగంగా యాత్రికులకు అల్పాహారం, భోజన ఏర్పాట్లు, హోటళ్లు, అతిథిగృహాల్లో రాత్రి బస ఏర్పాట్లు, రైలు దిగి ఆయా ప్రాంతాల నుంచి పర్యాటక ప్రదేశాలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం, రైలులో ఎస్కాట్‌, ప్రయాణ బీమా వంటివి కల్పిస్తామన్నారు.

ఆగస్టు 4న జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర పేరుతో నడిచే ప్రత్యేక రైలు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరుతుందన్నారు. ఈ రైలు అరుణాచలం, కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, తంజావూరు, తిరుచ్చి, త్రివేండ్రం ప్రదేశాలకు వెళుతుందన్నారు. ఈ రైలులో స్లీపర్‌ క్లాస్‌, త్రీ ఏసీ, సెకండ్‌ ఏసీ కోచ్‌లు ఉంటాయన్నారు. ఈ రైలు యాత్ర 9 రోజులు సాగుతుందన్నారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు చెందిన యాత్రికులు విజయవాడ రైల్వేస్టేషన్‌ నుంచి యాత్ర రైలు ఎక్కాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎల్టీసీ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చునన్నారు. భారత్‌ గౌరవ్‌ యాత్ర రైళ్ల సమాచారం, ప్యాకేజీ, ఇతర పూర్తి వివరాలకు 92814 95848, 92810 30714 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలన్నారు.