News

బెజవాడలో రమణీయంగా రథయాత్ర

265views

విజయవాడ నగరంలో శ్రీ జగన్నాథ రథయాత్ర శుక్రవారం శోభాయమానంగా సాగింది. ఇస్కాన్‌ శ్రీ జగన్నాథ మందిర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రథయాత్రను తొలుత ఎంజీరోడ్డులోని డి అడ్రస్‌ మాల్‌ వద్ద రాష్ట్ర గృహ నిర్మాణ, ఐ అండ్‌ పీఆర్‌ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి రథపూజ చేసి లాంఛనంగా ప్రారంభించారు. నగరంలోని వివిధ ప్రాంతాల మీదగా రామలింగేశ్వరనగర్‌లోని ఇస్కాన్‌ టెంపుల్‌ వరకూ సుమారు 8 కి.మీ.లు కొనసాగింది.

యాత్ర సాగిందిలా..
ఎంజీరోడ్డులో డి అడ్రస్‌ మాల్‌ వద్ద ప్రారంభమైన రథయాత్ర భీమా జ్యూయలర్స్‌ వద్ద యూ టర్న్‌ తీసుకుని, పీవీపీ రోడ్డులో సిద్ధార్థ పబ్లిక్‌ స్కూల్‌ మదర్‌ థెరీసా విగ్రహం మీదగా పాలిక్లినిక్‌రోడ్డులో గాయత్రీనగర్‌, ఎగ్జిక్యూటివ్‌ క్లబ్‌ జంక్షన్‌ నుంచి గురునానక్‌కాలనీ రోడ్డులోకి ప్రవేశించింది. అక్కడి నుంచి పటమట ఫన్‌టైమ్‌ క్లబ్‌ రోడ్డులో నుంచి ఆర్టీసీ కాలనీ మీదుగా పంటకాలువ రోడ్డులో ఎన్టీఆర్‌ సర్కిల్‌కు చేరుకుంది. అక్కడి నుంచి కృష్ణవేణి రోడ్డులో నుంచి రామలింగేశ్వరనగర్‌ ఇస్కాన్‌ మందిర్‌ వరకూ కొనసాగింది. సుమారు 8 కి.మీలు నాలుగున్నర గంటల పాటు ఈ రథయాత్రను నిర్వహించారు.

వెల్లివిరిసిన ఆధ్మాత్మిక శోభ..
ఇస్కాన్‌ టెంపుల్‌ ఆధ్వర్యంలో నగరంలో మూడో ఏడాది నిర్వహించిన శ్రీ జగన్నాథ రథయాత్రతో ఆధ్మాత్మిక శోభ వెల్లివిరిసింది. హరే కృష్ణ, హరే రామ, కృష్ట కృష్ట హరే హరే అంటూ భక్తులు రథయాత్రలో ముందుకు సాగారు. నగరం నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేశారు. ఇస్కాన్‌ మందిర గురువులు రథయాత్ర విశిష్టతను వివరించారు.

ఆకట్టుకున్న ప్రదర్శనలు..
రథయాత్ర ప్రారంభానికి ముందుకు నిర్వహించిన సాంస్కృతిక, ఆధ్మాత్మిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కోలాటం, డప్పు విన్యాసాలతో పాటు, విదేశీయులు సైతం హరే కృష్ణ అంటూ గీతాలు ఆలపించి ఆకట్టుకున్నారు. రథయాత్ర ముగిసిన తర్వాత టెంపుల్‌వద్ద కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ గద్దే అనూరాధ, ఎన్‌ఆర్‌ఐ కోమటి జయరామ్‌, ఇస్కాన్‌ టెంపుల్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.