News

భక్తులతో కిక్కిరిసిన పూరి క్షేత్రం.. రెండో రోజు ప్రారంభమైన రథయాత్ర

308views

జగన్నాథుడి రథయాత్రను పురస్కరించుకొని ఒడిశాలోని పూరి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. సోమవారం రెండో రోజు రథయాత్ర ప్రారంభమైంది. దాదాపు 53 సంవత్సరాల తర్వాత జగన్నాథుడి రథయాత్ర రెండురోజుల పాటు కొనసాగుతున్న విషయం తెలిసిందే. 1971లో రెండు రోజులపాటు రథయాత్ర జరిగింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఈ యాత్రను రెండు రోజుల పాటు నిర్వహించారు. ఈ నేపథ్యంలో చివరి రోజైన నేడు జగన్నాథుడిని దర్శించుకునేందుకు దేశ నలమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ యాత్రలో పాల్గొనేందుకు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది.


వేలాది మంది భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఒడిశాలోని పూరీలో జగన్నాథ రథ యాత్ర ఆదివారం శోభాయమానంగా సాగిన విషయం తెలిసిందే. భక్తులు ‘జై జగన్నాథ్‌’, ‘హరిబోల్‌’ నినాదాలతో మూడు రథాలను 2.5 కిలోమీటర్ల దూరంలోని గుండిచ దేవాలయం వైపు లాగుతూ తీసుకెళ్లారు. రథయాత్రకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. లాంఛనంగా శ్రీ జగన్నాథుని రథాన్ని లాగి రథయాత్రను ప్రారంభించారు. రాష్ట్రపతి రథయాత్రకు హాజరవ్వడం ఇదే తొలిసారి. గతంలో ఎవరూ హాజరుకాలేదు.