News

ద్వారకాతిరుమలలో శోభాయమానంగా రథయాత్ర

225views

ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ, వేంకటేశ్వర స్వామి ఆలయంలో జగన్నాథుడి దివ్య రథోత్సవం ఆదివారం వైభవంగా ప్రారంభమమైంది. ఏటా రథయాత్రను అట్టహాసంగా నిర్వహిస్తారు. లక్ష్మీపురం ఆలయం నుంచి ద్వారకాతిరుమల క్షేత్రానికి ఈ రథయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. ముందుగా ఆలయ సిబ్బంది రథన్ని సుగంధ భరిత పుష్పమాలికలు, మామిడి తోరణాలు, అరటిబోదెలు, విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. అనంతరం సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుడి దారు విగ్రహాలను అర్చకులు, పండితులు వేద మంత్రోచ్ఛరణలతో ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి, రథంలో వేంచేపుచేసి, విశేషంగా అలంకరించారు. ఆలయ డీఈఓ బాబురావు, ఏఈఓ వాసు, ఎలక్ట్రికల్‌ డీఈ టి.సూర్యనారాయణ, సూపరింటెండెంట్‌ జి.సుబ్రహ్మణ్యం రథం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ రథం ముందుగా ఆలయం చుట్టూ తిరిగింది. ఆ తరువాత అశేష భక్తజనం, కోలాట భజనల నడుమ ద్వారకాతిరుమల క్షేత్రానికి చేరుకుంది.