
349views
గత ప్రభుత్వంలో టిటిడిలో జరిగిన అక్రమాలను సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్తామని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం శ్రీవారి ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ‘గత ఐదేళ్లలో తిరుమలను ఆధర్మ క్షేత్రంగా మార్చేశారు. అన్ని విభాగాల్లో అవినీతి చోటుచేసుకుందని ఫిర్యాదులు వస్తున్నాయి, శ్రీవారి ఆభరణాలపై కూడా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి. ఇంజినీరింగ్ పనుల్లో 15 శాతం కమీషన్లు తీసుకున్నారు. భారీస్థాయిలో అవినీతి జరిగితే టిటిడి విజిలెన్స్ ఒక్క కేసు కూడా ఎందుకు నమోదు చేయలేదు. స్టేట్ విజిలెన్స్ అధికారులు విచారణకు వస్తే కూడా టిటిడి అధికారులు సహాయ నిరాకరణ చేస్తున్నారు’ అని ఆయన ఆరోపించారు.





