
అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఆధ్వర్యంలో ఈనెల 7న జగన్నాథుని రథయాత్ర ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఇస్కాన్ విశాఖపట్నం అధ్యక్షులు సాంబాదాస్ తెలిపారు. శుక్రవారం నగరంలోని ఓ హోటల్ లో జరిగిన విలేకరుల సమావేశంలో రథయాత్రకు సంబంధించిన గోడపత్రికను ఆయన విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ. విశాఖలో వరుసగా 17వ సారి ఉత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు సాగరతీరంలోని వుడాపార్కు నుంచి రథయాత్ర ప్రారంభమవుతుందన్నారు. కాళీమాత మందిరం, రామకృష్ణమిషన్ మీదుగా సిరిపురం వద్దగల గురజాడ కళాక్షేత్రం వద్దకు రాత్రి 7 గంటలకు చేరుకుంటుంది. స్వామివారికి 1008 రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తామని వెల్లడించారు. ముఖ్య అతిథులుగా కేంద్రం మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి వంగలపూడి అనిత పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో మాతాజీ నితాయి సేవిని, ఎం.వి.రాజశేఖర్, వంశీకృష్ణప్రభు పాల్గొన్నారు.





