
ఏళ్ల తరబడి జాప్యం తర్వాత బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ వ్యోమనౌక బుధవారం నింగిలోకి పయనమైంది. ఇందులో భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్‌మోర్‌లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)కు బయల్దేరారు. వీరు గురువారం ఈ కేంద్రాన్ని చేరుకుంటారు. అక్కడే వారం బస చేస్తారు. తిరిగి స్టార్‌లైనర్‌లో భూమికి తిరిగొస్తారు. ఈ వ్యోమనౌకకు ఇది తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర. దీన్ని గత నెల మొదటి వారంలో రోదసిలోకి ప్రయోగించేందుకు తొలిసారిగా సన్నాహాలు జరిగాయి. అయితే రాకెట్‌లో సమస్యలు రావడంతో చివరి నిమిషంలో ప్రయోగాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. గతవారం మరోసారి స్టార్‌లైనర్ ప్రయోగానికి ప్రయత్నించగా.. సాంకేతిక ఇబ్బందులతో ఆపేయాల్సి వచ్చింది. మూడో ప్రయత్నంలో బుధవారం ఈ వ్యోమనౌక నింగిలోకి బయల్దేరింది. ఈ యాత్ర విజయవంతమైతే.. ఐఎస్‌ఎస్‌కు వ్యోమగాములను పంపడానికి మరో వ్యోమనౌక అమెరికాకు అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం స్పేస్‌ఎక్స్ సంస్థ సేవలే ఆధారమవుతున్నాయి. సునీతా విలియమ్స్‌కు ఇది మూడో అంతరిక్ష యాత్ర.





