ArticlesNews

మన సత్తాపై ‘అణు’మానాలు తీరిన రోజు

131views

(మే18- పోఖ్రాన్‌-1 పరీక్షకు 50 ఏళ్లు)
భారత్‌ అణు బాంబు తయారుచేస్తే గడ్డి తిని.. అవసరమైతే పస్తులుండైనా మేమూ అణు బాంబును తయారుచేస్తాం. అంటూ భారత్‌ పరీక్షలు నిర్వహించడానికి 9 ఏళ్ల ముందే ప్రకటించిన పాక్‌.. ఆ దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టింది.

1974 మే 18 భారత దేశ చరిత్రలో ఇది చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. ప్రపంచ యవనికపై మన దేశం సాంకేతిక సత్తా చాటిన రోజు. యుద్ధోన్మాదంతో రగిలిపోతున్న పొరుగు దేశాలకు గట్టి సందేశం పంపిన రోజు. సరిగ్గా 50 ఏళ్ల కిందట ఇదే రోజు భారత్‌ తన తొలి అణు పరీక్షను నిర్వహించింది. తద్వారా ఆ సత్తా చాటిన అమెరికా, సోవియట్‌ యూనియన్, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాల సరసన సగర్వంగా నిలిచింది. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వంలేని దేశం అణు పరీక్ష నిర్వహించడం అదే మొదటిసారి. దీనిపై అగ్గిమీద గుగ్గిలమైన కొన్ని అగ్రరాజ్యాలు ఆంక్షలతో అక్కసు వెళ్లగక్కాయి. అయినా మన దేశం నిలదొక్కుకుంది. సాంకేతిక పురోగతితో ముందడుగు వేసింది.

ఈ అణు పరీక్షకు ‘ఆపరేషన్‌ స్మైలింగ్‌ బుద్ధా’ అని పేరు పెట్టారు. బుద్ధ జయంతి కూడా అదే రోజు కావడంతో ఈ పేరు ఖరారు చేశారు. విదేశీ వ్యవహారాల శాఖ మాత్రం దీన్ని పోఖ్రాన్‌-1గా నామకరణం చేసింది.