News

యూసీసీ కావాలని ప్రజలే ఒత్తిడి తెస్తారు

31views

ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ని అమలు చేసేలా ప్రజలే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తారని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ పేర్కొన్నారు. ఉమ్మడి పౌర స్మృతికి రాజ్యాంగం కూడా చిరకాలంగా మద్దతు తెలుపుతోందని ఆయన అన్నారు. బిజెపి పాలిత అస్సాం, గుజరాత్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో యూసీసీ అమలులోకి రావడం, ఆ పార్టీ పాలనలో ఉన్న ఇతర రాష్ట్రాలో ఆ విషయాన్ని పరిశీలించేందుకు కమిటీలు వేయడం మంచి పరిణామమని న్యాయశాఖ మంత్రి అన్నారు. ‘‘రాజ్యాంగ నిర్మాణం జరిగే సమయంలో కూడా యూసీసీ అమలు పరచాలన్న డిమాండ్‌ వ్యక్తమైంది. ఉమ్మడి పౌర స్మృతి అమలు దిశగా భారత్‌ ముందుకు సాగాలని రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ కూడా కోరుకున్నారు. వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం వంటి వ్యక్తిగత విషయాల్లో మతంతో సంబంధం లేకుండా దేశ పౌరులందరికీ ఒకే చట్టం వర్తింపజేయాలని యూసీసీ చెబుతోంది. ఆదేశిక సూత్రాల్లో భాగమైన 44వ రాజ్యాంగ అధికరణం భారత భూభాగం అంతటా పౌరులకు ఒకే పౌరస్మృతిని అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేయాలంటోంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం యూసీసీ పట్ల అపోహలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా గిరిజనుల్లో ఈ అపోహలు ఎక్కువగా వ్యాప్తి చేస్తున్నారు’’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.