
కాకతీయుల కాలం, విజయనగర సామ్రాజ్యం నాటి ప్రాచీన శాసనాలు ప్రకాశం జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో బయటపడుతున్నాయి. అడవిలో సంచరించే చెంచులు వీటిని గుర్తించి ఎప్పుటికప్పుడు పురావస్తుశాఖ అధికారులకు సమాచారం ఇస్తున్నారు. అలా ఇప్పటి వరకు 40 శాసనాలను గుర్తించారు. దక్షిణ భారత చరిత్ర, సంస్కృతిని తెలుసుకునేందుకు ఇవి దోహదం చేస్తాయన్న ఉద్దేశంతో వీటిని అధ్యయనం చేసేందుకు భారత పురావస్తు శాఖ నిర్ణయించింది.
చెంచు గిరిజనుల సహకారంతో…
ఇప్పటికే రాయలసీమలోని లంకామల అభయారణ్యం, తెలంగాణలోని గుండారం అటవీ ప్రాంతాల్లో అధ్యయనం చేపట్టారు. నల్లమల పులుల అభయారణ్యం పరిధిలో ఉన్నందున ఈ ప్రాంతంలో సర్వే చేపట్టేందుకు ప్రత్యేక అనుమతులు అవసరం. ఆ మేరకు అటవీ అధికారులకు లేఖ రాయడంతో అనుమతిస్తూ రాష్ట్ర అటవీ దళాధిపతి పి.వి.చలపతిరావు ఈ నెల 27న ఉత్తర్వులు జారీ చేశారు. ఎలాంటి తవ్వకాలు చేపట్టకుండా, వస్తువులు తీసుకెళ్లకుండా కేవలం శాసనాల లిపిని కాపీ చేసుకొనే అవకాశం మాత్రమే కల్పించారు. అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ చేపట్టాలని పేర్కొన్నారు. చెంచు గిరిజనుల సాయంతో శాసనాలు బయటపడిన ప్రాంతాలకు వెళ్లి అచ్చు సాయంతో కాపీ చేయనున్నారు.
త్వరలోనే సర్వే ప్రారంభం…
శ్రీశైల భ్రమరాంబిక, మల్లికార్జునుల క్షేత్రం కొలువుదీరిన ప్రాంతం కావడంతో అప్పట్లో రాజులు తరచూ వచ్చే వారని… అందుకు గుర్తుగా 12 – 16వ శతాబ్దాల మధ్య కాలం నాటి తెలుగు శాసనాలు ఉన్నాయని భారత పురావస్తు శాఖ శాసనాల విభాగం (మైసూరు) డైరెక్టర్ డాక్టర్ కె.మునిరత్నంరెడ్డి తెలిపారు. శాసనాలతో పాటు ఆలయాలు, పలు రకాల శిలలు బయటపడ్డాయన్నారు. జూన్‌లో శాసనాలకు సంబంధించిన సర్వే చేపడతామన్నారు. అధ్యయనం చేసి వాటి చరిత్రను ప్రచురిస్తామన్నారు.




