News

నిజ్జర్ హత్య కేసులో మరో భారతీయుడి అరెస్ట్

234views

ఖలిస్థాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో సంబంధం ఉందనే ఆరోపణలపై మరో భారతీయున్ని కెనడా అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఇదే కేసులో ముగ్గురు భారతీయుల్ని అదుపులోకి తీసుకోగా తాజాగా 22 ఏళ్ల అమర్‌దీప్ సింగ్‌పై హత్య, హత్యకు కుట్ర అభియోగాలు మోపి పోలీసులు అరెస్ట్ చేశారు. కెనడాలోని బ్రాంప్టన్‌లో నివసిస్తున్న అమర్‌దీప్ సింగ్‌‌ ఇప్పటికే ఆయుధాలకు సంబంధించిన కేసులో అంటారియో పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇప్పుడు కొత్త కేసుతో అతన్ని నిజ్జర్ హత్య కేసును విచారిస్తున్న అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఐహెచ్‌ఐటి) సూపరింటెండెంట్ మన్‌దీప్ మూకర్ మాట్లాడుతూ, ఈ హత్యలో పాత్ర పోషించిన వారిని అరెస్ట్ చేయడానికి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

ఇంతకుముందు ఇదే కేసులో ముగ్గురు భారతీయ పౌరులు, కరణ్ బ్రార్ (22), కమల్‌ప్రీత్ సింగ్ (22), 28 ఏళ్ల కరణ్‌ప్రీత్ సింగ్‌లను అరెస్టు చేశారు. 1997లో కెనడాకు వలస వచ్చి 2015లో పౌరసత్వం పొందిన నిజ్జర్, ఖలిస్తాన్ అని పిలువబడే ప్రత్యేక సిక్కు రాష్ట్రం కోసం అలజడులు సృష్టించాడు. అతన్ని జూన్ 18, 2023న సబర్బన్ వాంకోవర్‌లోని సిక్కు దేవాలయం పార్కింగ్ స్థలంలో ముసుగు ధరించిన దుండగులు కాల్చడంతో చనిపోయాడు. అయితే నిజ్జర్ హత్య వెనుక భారత ఇంటెలిజెన్స్ ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలు చేయడంతో రెండు దేశాల మధ్య దూరం పెరిగింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా భావించిన కెనడా వేగంగా దర్యాప్తు చేస్తుంది.