
కేరళకు మరో వైరల్ ఫీవర్ పట్టుకుంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. త్రిశూర్, మలప్పురం, కోజికోడ్ జిల్లాల్లో ఈ కేసులు నమోదైనట్లు తెలిసింది. ఈనేపథ్యంలో అన్ని జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర (Kerala) ఆరోగ్యశాఖ ఆదేశించింది.
వెస్ట్ నైల్ అనేది వైరల్ జ్వరం. ఇన్‌ఫెక్షన్ సోకిన క్యూలెక్స్ దోమ ద్వారా మానవులకు ఇది సంక్రమిస్తుంది. దీనికి ఎటువంటి ఔషధాలు, వ్యాక్సిన్ లేదు. లక్షణాల ఆధారంగా చికిత్స చేయడం, వ్యాధి నిరోధక జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. 1937లో తొలిసారిగా దీన్ని ఉగాండాలో గుర్తించారు. మనదేశంలో మొదటిసారిగా కేరళలో 2011లో ఓ ఆరేళ్ల బాలుడిలో వెలుగు చూసింది. అయితే, ఆ అబ్బాయి 2019లో జ్వరం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు.
లక్షణాలు..
తలనొప్పి, జ్వరం, కండరాల నొప్పులు, తల తిరగడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటాయి. కానీ, ఎక్కువమంది బాధితుల్లో ఇవి కనిపించకపోవచ్చు. మరికొందరిలో మాత్రం జ్వరం, తలనొప్పి, వాంతులు, దురద వంటి లక్షణాలుంటాయి. కేవలం ఒక్క శాతం కేసుల్లో మాత్రం మెదడు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి మరణం కూడా సంభవించవచ్చు. జపనీస్ ఎన్‌కెఫలైటిస్ వ్యాధితో పోలిస్తే లక్షణాలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ మరణాల రేటు తక్కువే.





