
విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దర్శనానికి విచ్చేసిన భక్తులందరికీ కుంకుమ ప్రసాదం అందేలా చూడాలని ఈవో కె.ఎస్.రామరావు ఆలయ అధికారులకు సూచించారు. మహా మండపం ఆరో అంతస్తులో జరుగుతున్న కుంకుమ ప్యాకెట్ల తయారీని ఈవో మంగళవారం పరిశీలించారు. కుంకుమ ప్యాకింగ్ చేస్తున్న విధానం గురించి అడిగి తెలుసుకోవడమే కాకుండా కుంకుమ నాణ్యతను పరిశీలించారు. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తులు తొలుత అమ్మవారి దర్శనం ప్రశాంతంగా జరగాలని చూస్తారని, ఆ తర్వాత అమ్మవారి కుంకుమ ప్రసాదం దొరికితే మహా ప్రసాదంగా భావిస్తారన్నారు. దేవస్థానం చేపట్టిన ఉచిత కుంకుమ ప్రసాద పంపిణీని మరింత విస్తృతంగా జరిగేలా చూడాలన్నారు. ముఖ్యంగా శుక్ర, శని, ఆదివారాలలో భక్తులందరికీ కుంకుమ ప్రసాదం అందేలా అవసరమైన ప్యాకెట్లను సిద్ధం చేసి ఆలయంలో అందుబాటులో ఉంచాలన్నారు. రోజుకు ఎన్ని ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు.. ఎం త మంది సేవలకు తమ సేవలను అందిస్తున్నారనే వివరాలను ఏఈవో ఎన్.రమేష్ బాబు ఈవోకు వివరించారు.





