( మే 7 – రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి )
రవీంద్రనాథ్ ఠాగూర్ 7 మే 1861 (బంగ్లా సం.1268 వైశాఖ 25 ) న కలకత్తాలో జన్మించారు. ఆయన తండ్రి దేవేంద్రనాథ్ టాగూర్. రవీంద్రునిది బహుముఖ ప్రతిభ, సమాజ సమర్పిత జీవనం. వీరు గత శతాబ్దపు భారత సామాజిక, ధార్మిక,ఆధ్యాత్మిక పునరుజ్జీవన కాల ఖండంలో దీప స్తంభంగా నిలిచారు. వారి సాహిత్యం, ఆలోచనలు భారతీయ సనాతన, శాశ్వత విలువల ఆధారంగా నిలిచాయి. వారి జీవితమంతా ఈ విలువల అభివ్యక్తీకరణమే.
మన ప్రాచీన చారిత్రక పరంపర పట్ల గౌరవభావం చూపకపోవడం అహంకారపూరితం, సిగ్గుచేటైన విషయమని ఆయన అనేవారు. ధర్మాన్నే అన్నింటికీ ఆధారంగా జాతి పునర్ నిర్మాణం చేయాలని ప్రయత్నించిన ఛత్రపతి శివాజీ త్యాగాలను, విజయాలను, సిక్కు గురువుల, బందాబైరాగి బలిదానగాథలను ఆయన శ్రద్ధాపూర్వకంగా వర్ణించారు.
వారి వ్యాసాలన్నీ జాతీయవాదంలో ముఖ్యమైనవి. ‘ధర్మ’ శబ్దపు అర్థం రిలిజియన్ కాదని, రిలిజియన్ ‘ధర్మం’ శబ్దానికి పర్యాయపదం కాదని చెప్పారు. మన రాష్ట్ర (జాతి) భావన యూరప్ వారి ‘నేషన్’ భావనకు భిన్నమైనది. యూరపులో ప్రచారంలో ఉన్న భావాలు, భావనలు మన దేశంలో అసందర్భంగా, అర్థరహితంగా ఉంటాయి. భారతీయ ముస్లింలు, క్రైస్తవుల గుర్తింపు హిందుత్వమే. మన దేశం వివిధ మత సంప్రదాయాలు తో, భాషలతో మిళితమై ఉంది. భారత చరిత్ర పునర్లేఖన ఆవశ్యకత గురించి రవీంద్రనాథ్ టాగూర్ అనేక సందర్బాలలో దృడంగా చెప్పారు.
వేదం, ఉపనిషత్తుల తత్త్వం ఆధారంగా ఆయన 1912 లో ‘గీతాంజలి’ రచించారు. మతం ఆధారంగా ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటు విధానాన్ని రవీంద్రనాథ్ టాగూర్ తీవ్రంగా వ్యతిరేకించారు మహాత్మా గాంధీతో సహా అప్పటి జాతీయ నాయకులు తమకు ప్రేరణ గురుదేవ రవీంద్రుడేనని చెప్పారు. మహాత్మా గాంధీయే మొదటిసారి వారిని ‘గురుదేవుడి’ గా సంబోదించారు.





