News

జూన్‌ 1 నుంచి తిరుమ‌ల‌లో హనుమత్‌ జయంతి ఉత్సవాలు

321views

తిరుమలలోని ఆకాశగంగ వద్ద వేంచేసిన శ్రీ బాలాంజనేయస్వామివారి ఆలయంలో జూన్‌ 1 నుంచి 5వరకు హనుమ స్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని టీటీడీ ఈవో ధర్మారెడ్డి డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో వెల్లడించారు.

జూన్‌ 1న శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి తిరుమంజనం నిర్వహించి 7వ మైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారికి పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హనుమంతుని జన్మ విశేషాలు, ఇతర అంశాలను ఆధ్యాత్మికపరంగానే కాకుండా వైజ్ఞానిక కోణంలో కూడా ప్రముఖ పండితులతో ప్రసంగాలు ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.

అంజనాద్రి, ఆకాశగంగ, నాదనీరాజనం వేదికలపై అన్నమాచార్య, దాససాహిత్య, హిందూ ధర్మప్రచార పరిషత్‌ కళాకారులతో ఆధ్యాత్మిక, భక్తిసంగీత కార్యక్రమాలు ఏర్పాటు చే యనున్నారు. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో జూన్‌ 2న సుందరకాండలోని మొత్తం 2,872 శ్లోకాలను పండితులు పారాయణం చేయనున్నారు.