
ఎండల తీవ్రత నేపథ్యంలో తిరుమలకి వచ్చే భక్తుల కోసం చలువపందిళ్ళు, చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి కార్యనిర్వాహణాధికారి ఎ.వి.ధర్మారెడ్డి తెలిపారు. ఈరోజు తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో జరిగిన డయల్ యువర్ టీటీడీ ఈఓ కార్యక్రమంలో భక్తుల నుంచి ఈఓ సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఈఓ ధర్మారెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ తిరుపతి నగరంతో పాటు తిరుమలలో భక్తులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో చలువ పందిళ్లులతో పాటు చలివేంద్రాల్లో మంచినీటిని భక్తులకు సరఫరా చేస్తామన్నారు. ఏప్రిల్ నెలలో తిరుమల వెంకటేశ్వర స్వామిని 20.17 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని..భక్తుల కానుకలతో శ్రీవారికి రూ 101.63 కోట్లు హుండీ ఆదాయం సమకూరిందన్నారు.94.22 లక్షల లడ్డూలు భక్తులకు విక్రయించామని..8.8 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని ధర్మారెడ్డి తెలిపారు.





