
వైద్య విద్యార్థులను గిరిజనుల దగ్గరకు తీసుకు వెళ్లడానికి ఉద్దేశించిన అపురూప కార్యక్రమమే శ్రీ మోద కొండమ్మ స్వాస్త్య సేవాయాత్ర, అల్లోపతీ వైద్యులలో జాతీయభావాన్ని, క్రమశిక్షణను, సామాజికబంధాన్ని, నిస్వార్ధ సేవను నిర్మాణం చేయడానికి ఉద్దేశించిన కార్యక్రమం. వైద్య రంగంలో ప్రాచీన భారతీయ విలువల పట్ల గౌరవం, సానుభూతితో కూడిన వైఖరిని పెంపొందిస్తుంది. వైద్య విద్యార్థులకు పరిశోధన పట్ల ఆసక్తి పెంచుతుంది. ఆరోగ్యం, వ్యాధి నివారణ రంగంలో పనిచేస్తున్న సంస్థలతో వారిని అనుసంధానం చేస్తుంది. స్వాస్త్య సేవా, రాష్ట్రసేవా నినాదంతో ప్రజలందరిలో ఆరోగ్యం మెరుగు పరిచినప్పుడే జాతి ఆరోగ్య స్థితి మెరుగు పడుతుంది. వీటన్నిటి సమ్మేళనమే శ్రీమోద కొండమ్మ స్వాస్త్య సేవా యాత్ర. నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్, ఆంధ్రప్రదేశ్ శాఖ దీనిని నిర్వహించింది.
ఇందుకోసం గత డిసెంబర్ నుంచి విజయ నగరం విభాగ్ నుంచి గుంటూరు విభాగ్ వరకు వైద్య విద్యార్థులను సంప్రదించారు. వనవాసి కల్యాణ ఆశ్రమం, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విశాఖ విభాగ్ సహకారంతో పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంగా మార్చి 29 నుంచి 31 వరకు శ్రీ మోద కొండమ్మ స్వాస్త్య సేవా యాత్ర ఆరంభించారు.
20 కళాశాల నుంచి దాదాపు 580 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. వారిలో 150 మందిని ఎంపిక చేశారు. కాగా, 14 కళాశాల నుంచి 113 మంది హాజరయ్యారు. 61 మంది అబ్బాయిలు, 52 మంది అమ్మాయిలు ఉన్నారు. విశాఖ నుంచి పాడేరు చేరుకున్న వారికి భారతీయ విద్యా కేంద్రం వారి అల్లూరి సీతారామరాజు గిరిజన బాలుర వసతి గృహంలో వసతి ఏర్పాటు చేశారు. వారిని గిరిజన సంప్రదాయం ప్రకారం కాళ్లు కడిగి, బొట్టుపెట్టి స్వాగతించారు.
29 వ తేదీన సాయంత్రం 4 గంటలకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సహ ప్రాంత ప్రచారక్ జనార్దన్, డా. వనజ (నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్), మచ్చమ్మ, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతీయ సంప్రదాయాన్ని, రుషి పరంపరను గురించి, “సర్వే భవంతు సుఖినః” శ్లోకం గురించి, డాక్టర్ గిరిజన సంస్కృతి గురించి జనార్దన్ వివరించారు. అరణ్యం అంటే రణం లేని ప్రదేశమని, సాంస్కృతిక విజ్ఞానికి నిలయమని తెలిపారు. సేవచేయడం మన కర్తవ్యం అని, నేషనల్ ఇంటెగ్రిటీ వలనే మన దేశ ఔన్నత్యాన్ని కాపాడొచ్చని తెలిపారు. అనంతరం విద్యార్థులు 6 రకాల ఆటలు ఆడారు. గిరిజన సాంస్కృతిక థింసా నృత్యం ప్రదర్శించారు. వైద్య విద్యార్థులను, స్వాతంత్రయోధుల పేర్లతో వివిధ కళాశాల వారిని 5 మంది చొప్పున 26 బృందాలుగా విభజించారు.
సేవా కార్యక్రమాల కోసం ఎంపిక చేసిన 26 గ్రామాలకు 30వ తేదీన విద్యార్థులను పంపారు. వారిని గ్రామాలలో గిరిజన సంప్రదాయంతో స్వాగతించారు. వైద్య విద్యార్థులు, వైద్యులతో అక్కడున్న వారిని పరీక్షించి అవసరమైన మందులతో పాటు వాటి నివారణ అంశాలు గిరిజనులకు విద్యార్థులు తెలియచేశారు. రక్తహీనత, చర్మవ్యాధులు, అధిక రక్తపోటు, మధుమేహం, నరాల బలహీనత సంబందించిన వ్యాధుల అధికంగా కనిపించాయి. sickle cell aneamia అనే అరుదైన రక్త వ్యాధి కూడా ఎక్కువగానే ఉంది.
వైద్య శిబిరం అనంతరం విద్యార్థులు గ్రామ సందర్శన చేసి ప్రజలతో మాట్లాడారు. తరువాత రోజు ఉదయం కొన్ని గ్రామాలలో అవసరం ఉన్న చోట వైద్య శిబిరాలు నిర్వహించారు. ఆర్.ఎస్.ఎస్. ప్రాంతప్రచారక్ విజయాదిత్య, డా. కుమార్ అంగడి (అఖిల భారత సహా సంఘటన మంత్రి NMO), విద్యాధర్ (ప్రాంత సంఘటన మంత్రి, వనవాసి కల్యాణ్ ఆశ్రమం), డా సాగర్ కుళ్లాయి రెడ్డి (ప్రాంత సంయోజక్, NMO ఆంధ్ర) పాల్గొన్నారు.
విద్యార్థులు వారి అనుభవాలు పంచుకున్నారు. గిరిజన సాంస్కృతిక సంప్రదాయం ద్వారా మేము చాలా నేర్చుకున్నామని, గిరిజనుల అతిథి మర్యాద అపురూపమని, తమకు మంచి సౌకర్యాలు ఇచ్చి వారు ఇంటి బయటపడుకున్నారని విద్యార్థులు తెలిపారు. స్పందన మేము అనుకున్న దానికంటే గిరిజనుల స్పందన 100% ఎక్కువ ఉందని తెలిపారు.
ఈ దేశ అభివృద్ధి కోసం మీరు అందరూ ఇలా రావడం చాలా సంతోషమని విజయాదిత్య ముగింపు సమావేశంలో తెలిపారు. గణాంకాల ప్రకారం దేశంలో అంధులు, అధిక టి.బి., అధిక క్యాన్సర్,
అధిక షుగరు రోగులు ఎక్కువ ఉన్నారు. నన్ను కని పెంచిన నా దేశం ఇలా వైద్య గణాంకాలలో వెనుకపడి ఉంటే నేను ఏ విధంగా గర్వపడాలి అని ప్రతి వైద్య విద్యార్థి అలోచించాలని విజయాదిత్య
కోరారు.
శక్తిమంతమైన భారతదేశం అంటే ఆరోగ్య భారతదేశం అని అది మీ ద్వారానే సాధ్యం అని విద్యార్థులను ఉద్దేశించి వారు అన్నారు. అందుకోసం సంకల్పించాలని పిలుపునిచ్చారు. దేశాన్ని, అధ్యయనం చేయడం ఈ యాత్రలో ఒక భాగం, కేవలం వైద్య సేవా అనే కాదు. దేశాన్ని, సమాజాన్ని అధ్యయనం చేయాలని అన్నారు. We for healthy Bharath, వైద్య విద్యార్థులలో ఆత్మ స్థయిర్యం నింపాలని సంస్థ ప్రయత్నిస్తోందని తెలిపారు. Family adoption programme ద్వారా NMO పనిచేస్తుంది. ఈ దేశం మిమల్ని శాశ్వతంగా గుండెల్లో పెట్టుకునే విధంగా మీరు పనిచేస్తారని భావిస్తున్నానని విజయాదిత్య వారిని అభినందించారు.





