రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిత్య శాఖ కార్యక్రమాలతో స్ఫూర్తి పొందిన నాగార్జున రెడ్డి ఆయన మిత్ర బృందం నంద్యాల జిల్లా చాపిరేవుల పరిసర గ్రామాలలో శ్రీమద్ రామాయణంపై అవగాహనా పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరచిన వారికి బహుమతులు అందచేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి పురాణ ఇతిహాసాల పట్ల అవగాహన కల్పించే లక్ష్యంతో గత నాలుగు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
శ్రీరామనవమి సందర్భంగా నంద్యాల మండలం కొత్తపల్లి గ్రామం, పాణ్యం మండలం భూపనపాడు గ్రామాల్లో రామాయణం పైన అవగాహన పరీక్ష 14-4-24వ తేదీన నిర్వహించడం జరిగిందన్నారు. ముఖ్యంగా పౌరాణిక, ఇతిహాసాల యువత ఉత్తమ జీవన యానానికి మార్గదర్శనం చేస్తాయని అన్నారు.సమాజంలో హిందూ శాస్త్రాలపై అవగాహనా లోపించడం ప్రధాన సమస్య అని, దీనిని ఆసరాగా తీసుకుని ఎడారి మతాలు తమ అశాస్త్రీయ విధానాలను గొప్పవిగా ప్రచారం చేస్తూ యువతను తప్పు తోవ పట్టించి మతం మార్పిడి ఊబిలోకి దించుతున్నారన్నారు. ఇలాంటి కార్యక్రమాలు గ్రామ గ్రామాన భారీ ఎత్తున జరిగి విద్యార్థుల్లో, యువతలో సనాతన ధర్మం పట్ల, సంస్కృతీ సంప్రదాయాల పట్ల అవగాహన పెరగాలని ఆకాంక్షించారు.ఈ పోటీల ద్వారా అనేకమంది మాతృమూర్తులు, యువకులు సామాజిక చైతన్య కార్యక్రమాలకు దగ్గరయ్యారని, ఇదే స్పూర్తితో అనేక గ్రామాల్లో పోటీలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు నిర్వాహకులు మంజునాథ్, నాగార్జున రెడ్డి, రమణయ్య గౌడ్, శ్రీనివాసులు రెడ్డి, భాస్కర్ రెడ్డి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.