
అమర్నాథ్ యాత్రపై ఉగ్రవాదులు కుట్ర చేశారన్న ప్రభుత్వ హెచ్చరికల తర్వాత కశ్మీర్ లోయలో క్షణ క్షణం పరిస్థితులు మారిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. సరిహద్దు సమీప ప్రాంతాల్లోని ప్రజలు బంకర్లకు తరలి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే యాత్రికులు, పర్యాటకులు స్వస్థలాలకు తిరుగు ముఖం పట్టారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు రద్దీగా మారాయి. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలు అదనపు సర్వీసులను నడుపుతున్నాయి. ప్రభుత్వ హెచ్చరికలు చేసిన నాటికి 11వేల మందికి పైగా పర్యాటకులు ఉండగా.. ప్రస్తుతం 1650 మంది మాత్రమే ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు 6,216 మంది శ్రీనగర్ విమానాశ్రయం నుంచి వెళ్లినట్లు విమాశ్రయ వర్గాలు తెలిపాయి. భారీగా పెంచిన విమాన ఛార్జీలను తగ్గించాలన్న ప్రభుత్వ సూచనతో ఎయిరిండియా టికెట్ ధరలను తగ్గించింది. రూ.9500గా ఉన్న ఛార్జీని రూ.6715కు తగ్గించారు. కొత్తగా వచ్చే పర్యాటకులకు గదులు ఇవ్వొద్దంటూ శ్రీనగర్ పోలీసులు హోటల్ యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు కేంద్రం 35వేల బలగాలను కశ్మీర్‌లో మొహరించింది. మరింత మందిని తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కార్గిల్ సెక్టార్‌లోని ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. సరిహద్దులో బోఫోర్స్ శతఘ్నుల్ని మొహరించినట్లు తెలుస్తోంది.
కశ్మీర్‌లో ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులతో మళ్లీ కల్లోల పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిత్యావసర వస్తువులు సమకూర్చుకుంటున్నారు. పెట్రోల్ బంకులు, బ్యాంకులు, ఏటీఎంల వద్ద ప్రజలు బారులు తీరారు. మరోవైపు వేర్పాటువాద నేతలు, ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. తాజాగా హురియత్ నేత సయ్యద్ అలీ షా గిలానీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజల్లో లేనిపోని భయాందోళనలు సృష్టించొద్దని కేంద్రాన్ని కోరారు. జమ్ముకశ్మీర్ హైకోర్టు మాజీ జడ్జి, ఎన్సీ ఎంపీ మసూదీ మాట్లాడుతూ..అధికరణ 35ఏ, 370 రద్దు విషయంలో కేంద్రం రాజ్యాంగాన్ని అనుసరించి నడుచుకోవాలని సూచించారు.





