అప్పుడు వెనకడుగు వేసుంటే ఇప్పుడిలా మీముందు నిలిచేదాన్ని కాదు – ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన పిన్న వయస్కురాలు మలావత్ పూర్ణ

ఆ క్షణంలో నేను వేసిన ఒక్క అడుగు నా జీవితాన్ని మార్చేసింది. మీ అందరి ముందు ఇలా మాట్లాడే అవకాశం కల్పించింది. లేకుంటే కేవలం ఒక కుగ్రామానికి పరిమితమై ఉండేదాన్ని. జీవితం నా చేతిలో ఉండేది కాదేమో అంటూ తన జీవితానుభవాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. పిన్న వయసులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మలావత్ పూర్ణ. శనివారం తనపై రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి నగరానికి వచ్చిన ఆమె తన ప్రసంగంతో ఆహూతులను మంత్రముగ్దులను చేశారు.
ఎవరెస్టు ఎక్కక ముందు నాకు మా ఊరే ప్రపంచం. మా గ్రామాన్ని దాటి బయటకి వెళ్లలేదు. అటువంటి వాతావరణంలో పెరిగిన నేను ఎవరెస్టు శిఖరం అధిరోహణ తరువాత పూర్తిగా మారిపోయా. ఎవరెస్టు పర్వతారోహణపై భువనగిరిలో మాకు శిక్షణ ఇచ్చారు. నేను ఈ ఘనతను సాధించగలనా అనే ఆందోళన ఆ సమయంలో వెంటాడింది. అప్పుడు ధైర్యం చేసి తీసుకున్న నిర్ణయం నన్ను ఈ ప్రపంచానికే పరిచయం చేసింది. ఎత్తయిన శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కురాలిగా నిలిపింది. తర్వాత ఏదైనా సాధించగలననే ఆత్మవిశ్వాసం నాలో బాగా పెరిగింది. ప్రతీ ఖండంలో ఎత్తయిన పర్వతాలను అధిరోహించాలని నిర్ణయించుకున్నా. ఇప్పటి వరకు అయిదు శిఖరాలను అధిరోహించా.నా విజయమే నిదర్శనం:
తల్లిదండ్రుల సహకారం వల్లే:
ఇంతటి విజయం సాధించానంటే అది నా తల్లిదండ్రులు దేవిదాస్, లక్ష్మిల చొరవే. గిరిజన తండాల్లో ఒక అమ్మాయిని గడప దాటి పంపడం అంటే జరగని పని. అటువంటిది నన్ను ఊరు దాటించడమే కాకుండా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు వారు అందించిన ప్రోత్సాహం మరువలేనిది. మాది అతి సాధారణ కుటుంబం. రైలులో ప్రయాణించేందుకు టికెట్లు కొనుక్కునే స్థాయి లేదు. అటువంటిది ఈ విజయంతో విమాన ప్రయాణం నాకు బస్సు ప్రయాణంలా మారిపోయింది. ప్రతి పనిలోనూ కష్టం ఉంటుంది. లక్ష్యాల సాధనకు పేదరికం అనేది అడ్డుకాదు. నేను పర్వతారోహణకు వెళ్లే ముందు తిరిగొస్తానో రానోనని ఎంతో కుమిలిపోయారు నా తల్లిదండ్రులు. చివరకు నా విజయాన్ని చూసి వారు ఎంతో సంతోషించారు.
డార్జిలింగ్‌లో తిరస్కరించారు :
భువనగిరిలో ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్న మేము డార్జిలింగ్‌లోని హిమాలయ మౌంటనీరింగ్ శిక్షణ కేంద్రానికి వెళ్లాం. అక్కడ మమ్మల్ని చూసిన శిక్షకులు చిన్నపిల్లలుగా ఉన్నామని, శిక్షణ ఇవ్వడానికి ముందుకురాలేదు. శిక్షణ ఇవ్వాలంటే అక్కడే ఉన్న టైగర్ కొండలను మూడు గంటల్లో చేరుకోవాలని పరీక్ష పెట్టారు. మేము రెండు గంటల్లోనే చేరుకొని శభాష్ అనిపించుకున్నాం.
కఠోర శిక్షణ:
ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధించా. నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా. ఎవరెస్టు ఎక్కిన తరువాత ఏదైనా సాధించగలననే విశ్వాసం వచ్చింది. అంతకుముందు పర్వతారోహణకు ఎంత కఠోర శిక్షణ అవసరమో డార్జిలింగ్‌లోనే తెలిసింది. మైనస్ డిగ్రీల చలిని తట్టుకోవడంపై తీసుకునే శిక్షణే ఎంతో ముఖ్యమైంది. రోజూ మేము 25 కిలోమీటర్ల పరుగు చేయాల్సి వచ్చింది. సుమారు 8 నెలల పాటు వివిధ శిక్షణ ప్రక్రియలను పూర్తి చేసుకున్న తరువాత 52 రోజులకు ఎత్తయిన శిఖరాన్ని చేరుకున్నా.
గుండె ధైర్యంతో అధిగమించా :
నేను పర్వతారోహణపై శిక్షణ పొందిన మొదటి రోజు భయపడ్డా. తరువాత మరో 15 నిమిషాల్లో ఎవరెస్టు శిఖరాగ్రాన్ని చేరుకుంటాననగా భయమేసింది. ఆ సమయంలో నా ఆక్సిజన్ సిలిండర్ నిండుకుంది. దగ్గర్లోనే ఒక మృతదేహం పడి ఉంది. గుండె ధైర్యంతో వీటన్నింటిని అధిగమించా. సరిగ్గా 2014 మే 25న ఉదయం 5.45 గంటలకు ఎవరెస్టును అధిరోహించా. ఆ సమయంలో ఆనందంతో కూడిన కన్నీళ్లు మాత్రమే వచ్చాయి. ఆక్సిజన్ అయిపోయిన సందర్భంలో నా వెనుక మరికొందరు వరుసగా వస్తున్నారు. మరో సిలిండర్ పెట్టుకోడానికి స్థలం లేకపోవడంతో కొంత వరకు ఆక్సిజన్ లేకుండానే ప్రయాణించాల్సి వచ్చింది. అపుడు నాలోని తెగువను చూసిన షెర్పాలు ఆశ్చర్యపోయారు.
విద్యార్థులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి:
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే వారు లక్ష్యాలను సులభంగా సాధిస్తారని తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ అన్నారు. ‘పూర్ణ’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఉపాధ్యాయులు నిత్యం బోధించడమే కాకుండా వారంలో ఒక రోజు క్రీడలు, క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. విద్యార్థులకు సమస్యలు ఎదురైతేనే వాటిని ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకుంటారన్నారు. నిత్యం అటువంటి సమస్యల సాధనకు సిద్ధంగా ఉంటే గెలుపు సులభమవుతుందన్నారు. అంతకుముందు శ్రీ ప్రకాష్ విద్యార్థులు పూర్ణ నిలువెత్తు చిత్రపటాన్ని చిత్రీకరించి మంత్రముగ్ధుల్ని చేశారు. పూర్ణ రాసిన గీతాన్ని ఆలపించి ప్రశంసలు అందుకున్నారు. అనంతరం పూర్ణను వాసుప్రకాష్, విశాఖపట్నం రామకృష్ణ మిషన్ ప్రతినిధి గణేష్ మిలాన్ ఆనంద, నవోదయ విద్యాలయ సమితి సంయుక్త కమిషనర్ ఏఎన్ రామచంద్ర ఘనంగా సన్మానించారు.
Source : Enadu





