
లక్ష్మీ నరసింహరాజు గారు 1888 జాగారం గ్రామం (విశాఖ జిల్లా)లో జన్మించారు. వారి స్వగ్రామం తూర్పు గోదావరిజిల్లా తుని దగ్గర కోటనందూరు.
80 ఏళ్ల క్రిందటి విశాఖపట్నం అభివృద్ధి చెండడానికి కారకులైన ప్రముఖవ్యక్తులలో దంతులూరి నరసింహరాజు గారొకరు, పారిశ్రామిక వేత్తలైన రాజు గారు తన జాతి స్వాతంత్ర్యము, దేశాభివృద్ధులకై తపన చెందేవారు. తమ కార్యక్రమాలన్నిటా పారిశ్రామికంగా దేశం స్వయం సమృద్ధం కావడానికి పునాదులు వేయసాగారు. భావితరాల మహానగరం కాగల విశాఖపట్నాన్నే తన ఆధారక్షేత్రంగా చేసుకున్నారు. 1920-21 సం॥లలో జాతీయ నాయకులు తలపెట్టిన ఉద్యమానికి తన వంతు సహకారమందించేవారు.విశాఖపట్నంలో తొలినాళ్ల సహాయ నిరాకరణోద్యమానికి పలురకాల ఆర్థిక వనరులందించేవారు రాజుగారు. వీరి బాల్య విద్య కోటనందూరు, తుని, పెద్దాపురంలలో, ఉన్నతవిద్య విజయనగరం మహారాజా శాశాలలో, 1909లో గణితం ప్రధాన పాఠ్యభాగంగా పట్టభద్రులైనారు.
మద్రాసు పచ్చయ్యప్ప కళాశాలలో పదార్థ విజ్ఞానశాస్త్రాలతో మరొక డిగ్రీ తీసుకున్నారు. 1912 నుండి 1915 వరకు లక్ష్మీ నరహింహరాజుగారు లండన్లో సివిల్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ BSC డిగ్రీ సంపాదించారు. విదేశాలకు సాంకేతిక విద్య అభ్యసించిన మొదటి క్షత్రియులు వీరు. ఇంగ్లాండు నుండి రాగానే విశాఖపట్నం జిల్లా బోర్డు అసిస్టెంట్ ఇంజనీరుగా నియమింప బడ్డారు.అయితే రెండేళ్లకు మించి ఆ ఉద్యోగం చేయలేదు.
స్వతంత్ర జీవనం పై వారి దృష్టి మరలడం వలన ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. గృహస్థ జీవితపు తొలినాళ్లలోనే కళత్రవియోగంవల్ల నాలుగేళ్లు రామచంద్రపురంలో తన మామగారింట నిర్వ్యాపకంగా ఉండిపోయారు. కాకినాడలో భాగస్వామిని కూర్చుకుని “ఆంధ్రా యింజనీరింగ్” పేరున ఒక వ్యాపార సంస్థను ప్రారంభించారు. దూరదృష్టితో యోచించి 1922లో తమ కార్యస్థాన్నాన్ని విశాఖలో మరొక భాగస్వామితో ఆంధ్రా యింజనీరింగ్ కంపెనీ స్థాపించారు.
సుమారు 10 సంవత్సరాలలో రాజుగారి బహుముఖ ప్రజ్ఞ ఫలితాలను ఇవ్వడం ప్రారంభమైంది. విశాఖపట్నం హార్బరులో, మునిసిపాలిటీలో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంటులో పన్నెండు లక్షల రూ॥ విలువైన నిర్మాణపు పనులు జరిపించారు. రాయగడలో 5 లక్షల విలువగల కట్టడాలు నిర్మించారు. 1929 సెప్టెంబరు 23 తేదీని తమ కంపెనీని 3 లక్షల మూలధనంతో “ప్రైవేటు లిమిటెడ్ సంస్థగా మార్చారు. అనంతరం వంతెనల నిర్మాణం చేపట్టారు. విశాఖ, నెల్లూరు జిల్లాలలో నదులపై 5.5 లక్షలతో వంతెనలు పూర్తిచేశారు.
1923లో మోటారు కార్ల మరమ్మత్తు కార్ఖానా నెలకొల్పారు. కొన్ని కంపెనీ కార్ల అమ్మకానికి ఏజన్సీ తీసుకున్నారు. 1923 – 1937 సం॥ల మధ్య ఆంధ్రా ఇంజనీరింగ్ కంపెనీ యాజమాన్యాన 40 లక్షల మూలధనం కూర్చుకొనుటకు ‘ది విశాఖపట్నం ఎలక్ట్రిక్ సప్లయి కార్పొరేషన్”, “ది అనకాపల్లి ఎలక్ట్రికల్ సప్లయి కార్పొరేషన్”, “ది విశాఖపట్నం సుగర్సు అండ్ సిరమిక్ ఇండస్ట్రీస్”, “ఆంధ్ర సిమెంట్ కంపెనీ”లు స్థాపించి 4 సం॥లలో మూలధనమంతా సేకరించి క్రమంగా వానిని కొనసాగించారు.
విజయవాడ సిమెంట్ ఫ్యాక్టరీ- రాజు గారు స్థాపించిన కంపెనీలలో జిల్లాలో అభివృద్ధి చెందిన పెద్ద ఫాక్టరీ. అపారమైన వీరి పారిశ్రామిక విజ్ఞానం తమ మాతృ దేశానికి, తమకు ప్రేమపాత్రులైన సమస్త ప్రజలకు అందించాలనేదే వారి తహ తహ! ఆ విధంగానే ఎన్నో నిర్మాణాత్మకమైన భారీ పనులు తల పెట్టారు. చాలావరకూ అవన్నీ ఫలోన్ముఖానికి వచ్చాయి. 1920 నుండి రాజుగారు ఇండియన్ నేషనల్ కాంగ్రెసు సభ్యునిగా ఉన్నారు. తమ కార్యక్రమాలలో తలమునకలవుతున్నా కొంత తీరిక చేసుకొని మన రాజకీయాలలోనూ సంబంధం కల్గి ఉండేవారు. ఖద్దరు దుస్తులనే ధరించేవారు. 1936-37 ఎన్నికలలో కాంగ్రెస్ కు బ్రహ్మాండమైన విజయం లభించింది. ఆ సందర్భంగా విశాఖ జిల్లా గ్రామీణ నియోజక వర్గం ఎలమంచిలి ప్రాంతం నుంచి లక్ష్మీనరసింహరాజుగారు జస్టిస్ పార్టీ తరపున నిల్చున్న జి.వి. జగన్నాధ రాజు గారి మీద అత్యధిక మెజార్టీతో నెగ్గారు.
ఆంధ్ర పారిశ్రామిక పితామహులు రాజుగారు 1939 డిశంబరులో తీవ్ర అస్వస్థతకు గురియై దివంగతులయ్యారు.





