News

కడప ఆలయంలో ముస్లింలు ఉగాది వేడుకలు

304views

అచ్చ తెలుగు పండుగ ఉగాదిని మంగళవారం కడప నగరంలోని దేవునికడప లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజాధికాలను ఘనంగా నిర్వహించారు. అర్చకులు కృష్ణమోహన్‌, తివిక్రమ్‌, కృష్ణమూర్తి, సాయి తదితరులు స్వామి, అమ్మవార్లకు విశేష అభిషేకాలు చేసి కనుల పండువగా అలంకరలించారు. ఉదయం 5 గంటల నుంచి స్థానిక భక్తులతోపాటు కడప నగరం చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో స్వామిని దర్శించుకునేందుకు వచ్చారు. ఆలయ ఇన్‌స్పెక్టర్‌ ఈశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో హాజరైన వారందరికీ తీర్థ ప్రసాదాలను అందజేశారు.

హాజరైన ముస్లింలు
కడప రాయుని ఆలయ విశిష్ఠమైన సంప్రదాయంలో భాగంగా దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ముస్లిం భక్తులు హాజరయ్యారు. అమ్మవారిని బీబీ నాంచారిగా భావించి స్వామి, అమ్మవార్లకు భత్యం, దక్షిణ సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శఠగోప ఆశీర్వాదం తీసుకున్నారు. వాటిలో ఉగాది సంప్రదాయాలు, పూజా విశేషాల గురించి అడిగి తెలుసుకున్నారు. అమ్మవారి ఆలయంలోని కంచి బంగారు బల్లులను తాకారు. కొబ్బరికాయలను సమర్పించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ముస్లింలు వరుసలో నిలిచి మరీ భగవత్‌ దర్శనం చేసుకున్నారు. ఉగాది సందర్బంగా అమ్మవారి ఆలయ సన్నిధిలో సంప్రదాయబద్ధగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి అస్థాన పూజలు నిర్వహించారు. సాయంత్రం వరకు వారి రాక కొనసాగింది. గతంతో పోలిస్తే ఈసారి భక్తుల సంఖ్య పెరిగింది.

ఒంటిమిట్ట రామాలయంలో…
ఒంటిమిట్ట : రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో మంగళవారం ఉగాది ఘనంగా ఉగాది వేడుకలు నిర్వహించారు. టీటీడీ అధికారుల ఆధ్వర్యంలో తెల్లవారుజామున మూల మూర్తులకు పంచామృతాభిషేకం జరిపి పట్టు వస్త్రాలు, సుగంధ పరిమళమైన తులసీ గజమాలతో అలంకరించారు. వేకువ జాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి సీతారామలక్ష్మణులను దర్శించుకున్నారు. అనంతరం క్రోధి నామ సంవత్సరం పంచాంగ శ్రవణం కొనసాగింది. రాశి ఫలితాలు, నూతన ఏడాదిలో లాభ, నష్టాలను పండితులు ఏలేశ్వరం గురుస్వామి, మధు స్వామి భక్తులకు వివరించారు. అనంతరం ఉగాది పచ్చడి ప్రసాదం వితరణ చేశారు. పురోహితులు వివరించారు. అంతే కాకుండా సీతారామలక్ష్మణుల గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు.