
శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో పక్షం రోజుల పాటు సాగిన ఖాద్రీ లక్ష్మీ నారసింహుని బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో జరిగిన పుష్పయాగోత్సవంతో ముగిశాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా సాగేందుకు సహకరించిన అష్ట దిక్పాలకులు, పంచ భూతాలు, దేవతా మూర్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని.. సాగనంపేందుకు నిర్వహించేదే ఈ పుష్పయాగోత్సవమని ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు వివరించారు. తీర్థవాది ఉత్సవం ముగియగానే సోమవారం మధ్యాహ్నం నుంచి ఆలయం తలుపులు మూసివేసి తిరిగి మంగళవారం ఉదయం తెరిచి మహా సంప్రోక్షణ చేశారు. అనంతరం స్వామివారికి నిత్య పూజాది కైంకర్యాలను నిర్వహించిన అనంతరం భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కలిగించారు. రాత్రి సమయంలో రంగమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారిని పలు రకాల పుష్పాలతో అలంకరించారు. ఈ ఉత్సవానికి ఉభయదారులుగా రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పూల అశ్వర్థనారాయణ కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ ఈఓ పట్టెం వి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల కాలక్షేపం కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతికి కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆలరించాయి.





