వాగ్గేయకారుడు త్యాగరాజస్వామిని, భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మినీ పలుమార్లు అవమానించిన టిఎం కృష్ణకు మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ సంగీత కళానిధి పురస్కారం ప్రకటించడం కర్ణాటక సంగీత ప్రపంచంలో దుమారమే రేపింది. దాంతో, ఈ యేడాది చివర్లో నిర్వహించబోయే వార్షిక సదస్సులో పాల్గొనబోమంటూ పలువురు కళాకారులు తమ నిరసన వ్యక్తం చేసారు. ఒకరిద్దరైతే తమకు అకాడెమీ గతంలో ప్రకటించిన సంగీత కళానిధి పురస్కారాన్ని వెనక్కు ఇచ్చేస్తున్నట్లు వెల్లడించారు. ఆ నేపథ్యంలో, టిఎం కృష్ణ పదేపదే అవమానించిన ఎంఎస్ సుబ్బులక్ష్మికి అకాడెమీ ఇచ్చిన ఆ అవార్డు విషయంలో ఆమె కుటుంబ సభ్యులు ఏం చేస్తారన్న ప్రశ్న కళాభిమానులందరికీ ఉదయించింది. అయితే, అమ్మమ్మకు వచ్చిన అవార్డును వెనక్కి ఇవ్వడం లేదంటూ ఆమె మనుమడు వి శ్రీనివాసన్ ప్రకటించారు. దానికి కారణాలను ఒక లేఖగా రాసారు.
=====================================
కర్ణాటక సంగీత ప్రపంచంలో చెలరేగిన వివాదం నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన విషయాల మీద నా అభిప్రాయాలు తెలియజేయాలనుకుంటున్నాను. భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మికి మనవణ్ణీ, రాధా విశ్వనాథన్ కొడుకునూ అయినందుకు మాత్రం ఈ లేఖ రాయడం లేదు.
చెన్నైలోని మ్యూజిక్ అకాడెమీ ప్రస్తుత భవనాన్ని నిర్మించింది ప్రధానంగా ప్రజలిచ్చిన విరాళాలు, నిధులతోనే. ఆ విరాళాలు సేకరించడానికి, ఆ నిధులు సమకూర్చడానికి మా అమ్మమ్మ 1950లలో ఎన్నో కచేరీలు పాడింది.
1955 అక్టోబర్ 9న పండిట్ జవాహర్‌లాల్ నెహ్రూ ఈ భవనానికి పునాదిరాయి వేసారు. అక్కడ నిర్వహించిన మొట్టమొదటి కచేరీ మా మామ్మ ఎంఎస్, అమ్మ రాధలదే. ఆ కచేరీకి నెహ్రూ కూడా హాజరయ్యారు.
ఆ సందర్భంగా పండిట్‌జీ చేసిన ప్రసంగం లోకప్రసిద్ధమైనది. ‘‘ఒక మామూలు ప్రధానమంత్రిని అయిన నేను ఆ సంగీత సామ్రాజ్ఞి ముందు ఎవరిని?’’ అన్న ఆయన వ్యాఖ్యలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. కొద్దికాలంలోనే, సంగీత కళానిధి పురస్కారం సాధించిన మొదటి మహిళగా ఎంఎస్ నిలిచింది.
ఆ పురస్కారానికి ఈ యేడాదికి టిఎం కృష్ణ నామినేట్ అవడాన్ని వ్యతిరేకిస్తూ, అకాడెమీ ఈ డిసెంబర్‌లో నిర్వహించే వార్షిక సంగీత సదస్సు నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు రంజని-గాయత్రి ప్రకటించారు. దానికి కారణాల్లో ఒకటి, త్యాగరాజు, ఎంఎస్ సుబ్బులక్ష్మి వంటి మహానుభావులను కృష్ణ అవమానించడం అని కూడా వారు వెల్లడించారు.
ఆ సోదరీమణులే కాదు, దుష్యంత్ శ్రీధర్, విశాఖ హరి, త్రిచూర్ బ్రదర్స్, అర్జున్ కుమార్ వంటి కళాకారులందరూ ఈ యేడాది అకాడెమీలో ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా లేమని ప్రకటించారు. వారి నిర్ణయాన్ని నేను పూర్తిగా ఆమోదించి బలపరుస్తున్నాను.
‘కర్ణాటక సంగీతాన్ని సమాజం మొత్తానికీ చేరువ చేయాలి, దాన్ని సమాజం స్వాగతించాలి అని మేం భావిస్తున్నాం. కానీ ఆ కళే సామాజికంగా ఊపిరాడనీయకుండా చేస్తోంది’ అంటూ కృష్ణ, చెన్నైలోని మ్యూజిక్ అకాడెమీ, ఇతర సభలను 2015 నుంచే బహిష్కరించాడు.
మాకు మతి పోగొట్టిన విషయం ఏంటంటే… నియమ నిబంధనలను కచ్చితంగా పాటించే మ్యూజిక్ అకాడెమీ లాంటి సంస్థ, తమకు దశాబ్ద కాలానికి పైగా పాడడానికి నిరాకరించిన వ్యక్తికోసం ఆ నియమ నిబంధనలను వదిలిపెట్టేయడం.
దివంగతురాలైన మా అమ్మమ్మ గురించి టిఎం కృష్ణ ఎన్నోసార్లు అవమానకరంగా మాట్లాడారు. ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలైతే చాలా పరుషమైనవి. తనను తాను సమర్ధించుకునే అవకాశం లేని, దివంగతురాలైన సంగీతవేత్తపై ఆమె మరణానంతరం దాడి చేయడం, ఆయన దురహంకారానికి ప్రతీక. ఆయన తన పాఠకులను రెచ్చగొట్టేలా ఎన్నో వ్యాసాలు రాసారు. ఎంఎస్ సుబ్బులక్ష్మి కోట్లాది అభిమానులు, ఆమెతో సుమారు ఐదు దశాబ్దాలు వేదిక పంచుకున్న తన కుమార్తె, మా అమ్మ అయిన రాధా విశ్వనాధన్ లక్షలాది అభిమానుల మనోభావాలను దెబ్బతీసేలా కృష్ణ పలు వ్యాసాలు రాసారు.
2015లో కారవాన్ పత్రికలో రాసిన వ్యాసంలో పాఠకులను దిగ్భ్రాంతి పరిచేందుకు ప్రయత్నిస్తూ. ఆ వ్యాసం ప్రారంభంలో ఒక పేరు లేని యువ సంగీతవేత్త ఉటంకించినట్లు చెబుతూ ఒక వాక్యం రాసారు. ‘‘20వ శతాబ్దపు అతిగొప్ప ధూర్తురాలు ఎంఎస్ సుబ్బులక్ష్మి.’’
అదే వ్యాసంలో కృష్ణ ‘‘ఇద్దరు అయ్యర్ల దగ్గర శిక్షణ తీసుకోడానికి ముందు వరకూ ఎంఎస్ చాలా అందంగా పాడేదని మదురై నగరానికి చెందిన ఇసై వెల్లలార్ కులస్తుడైన ఒక ప్రముఖ సంగీత విద్వాంసుడు వ్యాఖ్యానించాడు’’ అని రాసుకొచ్చారు. (మా అమ్మ, అమ్మమ్మ ఇద్దరికీ లెక్కలేనన్ని కీర్తనలు నేర్పించిన ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్‌లను కృష్ణ కుటిలబుద్ధితో అవమానించారు)
కృష్ణకు, ఇంకొకరి భుజాల మీద తుపాకి పెట్టి కాల్చాల్సిన అవసరం ఏమిటి, మా అమ్మమ్మను దూషించాల్సిన అవసరం ఏమిటి? ప్రత్యేకించి, మొత్తం సంగీత ప్రపంచానికి విరుద్ధంగా ఏ ఒక్కరో దురుద్దేశాలతో చేసిన వ్యాఖ్యలను అబద్ధాలని తెలిసి కూడా ప్రచారం చేయాల్సిన అవసరమేమిటి?
అదే వ్యాసంలో కృష్ణ ఇంకో మాట కూడా రాసారు. ‘1963లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గానం చేసిన వేంకటేశ్వర సుప్రభాతాన్ని విడుదల చేయడం ప్రజాదరణ కూడగట్టే కుట్ర తప్ప నిజానికి సిసలైన శ్రోత దృష్టిలో చూస్తే సంగీతపరమైన పతనమే’ అని రాసారు. శతాబ్దాల పాటు ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా సుప్రభాతం పాడడం సంగీత పతనం ఎలా అవుతుందో మా ఊహకు అందలేదు.
2017 నవంబర్‌లో టిఎం కృష్ణ హైదరాబాద్‌లో ఒక సభలో మాట్లాడుతూ ‘ఎంఎస్ ఒకవేళ నల్లటి రంగు కలిగిన, అగ్రవర్ణస్తురాలు కాని మహిళ అయితే మనం ఆవిడ సంగీతాన్ని ఇలాగే ఆస్వాదిస్తామా?’ అని అడిగారు. సంగీత రంగంలో అత్యున్నత విదుషీమణిగా పరిగణించే వ్యక్తి గురించి ఆయన అలా ఎలా మాట్లాడగలరు?
కృష్ణ గారు రాసిన వ్యాసాలను నేను మా అమ్మ రాధకు చదివి వినిపించాను. అప్పటికే ఆవిడ వీల్‌చెయిర్‌కీ, మంచానికీ పరిమితమైపోయింది. ఆ వ్యాసాల్లో కృష్ణ కనబరచిన అగౌరవం ఆమెను చాలా బాధించింది. కానీ ఆయన భావప్రకటనలకు స్పందించవద్దని నాకు సూచించింది. అయితే వేలాది మంది ప్రజలు – కళాకారులు, రసిక శ్రోతలూ కూడా – ఎంఎస్ సుబ్బులక్ష్మి పక్షాన ప్రధానస్రవంతి మాధ్యమాల్లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ స్పందించిన తీరు మమ్మల్ని కదిలించివేసింది. వారికి నేను ఎప్పటికీ కృతజ్ఞుణ్ణి.
కొందరు శ్రేయోభిలాషులు చట్టపరమైన చర్యలు తీసుకోమని సలహా ఇచ్చారు కూడా. కానీ మేం అలాంటిదేమీ వద్దని అనుకున్నాం. ఎందుకంటే న్యాయప్రక్రియ చాలా సమయం తీసుకుంటుంది. అంతేకాదు, కృష్ణకు అనవసరమైన ప్రచారం తెచ్చిపెడుతుంది. నెగెటివ్ పబ్లిసిటీని ఆక్సిజన్‌లా వాడుకొంటారాయన. మా అమ్మ ఒకటే మాట చెప్పింది. ‘సూర్యచంద్రులున్నంతవరకూ అమ్మ పేరు నిలిచి ఉంటుందని కంచి పరమాచార్యులే చెప్పారు. ఆమె పేరును తుడిచిపెట్టేయడానికి కృష్ణ ఎంతైనా ప్రయత్నించనీ, ఆ విషయంలో అతను గెలవలేడు’’ అని చెప్పింది.
అమ్మమ్మ ఎంతో ప్రేమగా చూసుకున్న అవార్డుల్లో సంగీత కళానిధి ఒకటి. ఆ పురస్కారాన్ని మేము (అకాడెమీకి) వెనక్కి ఇచ్చేస్తామా అని చాలామంది అడుగుతున్నారు. అదెప్పుడో ఆరు దశాబ్దాల క్రితం ఇచ్చిన పురస్కారం. మా కుటుంబంలో ఎవరూ ఇప్పుడు అంత వెనక్కి వెళ్ళదలచుకోలేదు. ఆ అవార్డును వెనక్కి ఇచ్చేసేందుకు మాకు హక్కు కూడా లేదు.
అయితే, సంగీత కళానిధి పురస్కారాన్ని వెనక్కి తిరిగి ఇచ్చేయాలని – చిత్రవీణ ఎన్ రవికిరణ్, మృదంగ విద్వాంసులలో మణి పాల్‌ఘాట్ మణి అయ్యర్ గారి కుటుంబం – తీసుకున్న నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం.
=====================================
ఎంఎస్ సుబ్బులక్ష్మి మనవడు, ఆమె కుమార్తె రాధా విశ్వనాథన్ కుమారుడు అయిన వి శ్రీనివాసన్, తమ నిర్ణయాన్ని ఒక లేఖ రూపంలో వెల్లడించారు. ఆయన ఇప్పుడు బెంగళూరులో సుస్వరలక్ష్మి ఫౌండేషన్ ఫర్ క్లాసికల్ మ్యూజిక్ అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సంస్థకు మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు.