News

బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టులు మృతి

266views

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం ఉదయం బీజాపూర్‌ జిల్లా కొర్చెలి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. పలువురు గాయపడినట్లు తెలుస్తున్నది.

అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడినట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో పారిపోవడానికి ప్రయత్నించిన నక్సల్స్‌.. పోలీసులపై కాల్పులు జరిపారని, ప్రతిగా భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించారని అధికారులు వెల్లడించారు. ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నదని చెప్పారు. ఘటనా స్థలంలో లభించిన మందుపాతరలు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.