
విశాఖపట్నానికి, తెలుగుజాతికి పేరు తెచ్చిన వారిలో మారేపల్లి రామచంద్ర శాస్త్రి గారు ముఖ్యులు. సేవకు మారు పేరు శాస్త్రి గారు, మారేపల్లి వారిని విశాఖ ప్రజలు “కవి” గారు అని పిలిచేవారు.
శాస్త్రిగారు పుట్టింది. కృష్ణాజిల్లాలో అయినా విశాఖపట్నాన్నే తన స్వంత ఊరు చేసుకున్నారు. ప్రాధమిక విద్య కనకవల్లి గ్రామంలోను, కళాశాల విద్య కాకినాడ, విశాఖలలోను సాగింది. 1893లో విశాఖలో హిందూ కళాశాలలో ఎఫ్.ఎ క్లాసులో చేరడానికి శాస్త్రి గారు తొలుత విశాఖలో అడుగు పెట్టారు. ఇప్పుడు ఏవిఎన్ కళాశాలగా వ్యవహరిస్తున్న కళాశాలకు అప్పటి పేరు హిందూ కళాశాల. విద్యార్ధిగా విశాఖవచ్చిన రామచంద్ర శాస్త్రి గారు బహుముఖ సేవల ద్వారా ప్రజల హృదయాలకు సన్నిహితులై, తన మనుగడను విశాఖకు అంకితం చేశారు.
19వ శతాబ్ది ఆఖరు దశకంలో “జాతీయ ఉద్యమం” విద్యావంతులలో నెమ్మదిగా దేశభక్తిని ప్రబోధించ సాగింది. 1893లో కాంగ్రెసు నివేదిక చదవడంతో శాస్త్రి గారిలో “నా దేశం- నా భాష” అనే అభిమానం ఏర్పడింది. వీరు చదువు చాలించిన తరువాత కొద్ది మాసాలు మునసబు కోర్టులో పని చేశారు. విశాఖ మిషన్ పాఠశాలలో కొన్ని ఏళ్ళు తెలుగు పండితులుగా పని చేశారు.
“దేశ సేవకు భాషా సేవకు తగినవారిని తయారుచేస్తేనే ఉద్యమాలు ఫలవంతం కాగలవని” కవిగారు తొలినుండి భావించారు. విశాఖపట్నం కేంద్రంగా రామచంద్రశాస్త్రిగారు (కవిగారు) వివిధ రంగాలలో సమాజానికి ఉపయుక్తమైన పెక్కు కార్యక్రమాలు చేపట్టారు. సాహిత్యరంగం, సంఘ సంస్కరణరంగం, విద్యారంగం, నాటకరంగం, దేశసేవారంగం ఇట్లా శాస్త్రి గారు లేని జనహిత కార్యక్రమాలే లేవంటే ఆశ్చర్యం ఉండదు. ఎన్నో గ్రంథాలు స్వయంగా రచించి ప్రచురించారు. యువకవులను ప్రోత్సహించి వారిచే గ్రంథములను వ్రాయించేవారు. సంగీత మానినీ సమాజము, జగన్మిత్ర సమాజము, కళాభిలాషక నాటక సమాజము, మున్నగునవి స్థాపించడమో లేదా ప్రారంభానికి మూల కారణమవడమో అయ్యారు. నటులుగా, నాటక దర్శకులుగా, నాటక రచయితగా శాస్త్రి గారు తమ నైపుణ్యం చూపేవారు.
1913లో “ఐందవ హిత సభ” (ఇండియన్ మిషన్) భారతీయ ధర్మమును భోధించే సంఘమును స్థాపించేరు. పగటి పాఠశాల, సీతా బాలికా పాఠశాల, నిమ్నజాతి రాత్రి పాఠశాల స్థాపించారు.1918లో ధర్మాశ్రమంలో ‘ఆంధ్ర కళాశాల’ పెద్ద చదువుల వారికి చెప్పేది ప్రారంభించారు. 1912లో వేదపాఠశాల, ఆయుర్వేద కళాశాల, నెలకొల్పారు. క్రీడల ప్రోత్సాహానికి 1917 లో విశాఖపట్నం వ్యాయామ క్రీడా సంఘం అను పేరున కొందరి పెద్దల సహాయముతో ఏర్పాటు చేయించేరు. గ్రంథాలయ ఉద్యమానికి కూడా రామచంద్రశాస్త్రి గారు విశేషమైన సేవ చేశారు. విశాఖ మండల గ్రంథాలయ ప్రత్యేక సభలు జరిపించేరు. 1908లో హిందూ పఠనమందిరంలో విశాఖపట్టణ గ్రంథాలయం ఏర్పాటు చేశారు. దంత కళాశాల, నేత్ర కళాశాల కూడా స్థాపించారు.
1914 నుండి 1933 వరకు దేశ స్వాతంత్రోద్యమంలో పలుతెరగుల సేవలందించారు. 1916లో కాకినాడ ఆంధ్ర మహాసభలో పాల్గొన్నారు. 1918లో విశాఖపట్నం జిల్లా ప్రజాసంఘం స్థాపించేరు. వసంతరావు బుచ్చి సుందర రావుగారు వీరికి చేదోడు వాదోడై నిలిచారు. 1920లో కవిగారు, బుచ్చి సుందరరావు పంతులు గారు కలిసి నాగపూర్లో జరిగిన జాతీయ సభలో పాల్గొన్నారు. 1922లో జిల్లా కాంగ్రెసు అధ్యక్షులుగా గయ కాంగ్రెసు సభకు ప్రతినిధులుగా వెళ్ళారు. వీరితో మల్లిమడుగుల బంగారయ్య గారును వెళ్ళారు. 1923లో కాకినాడ కాంగ్రెసుకు ప్రతినిధులుగా వెళ్ళారు. 1928లో అఖిల భారత ఖద్దరు ప్రచారంలో ఆంధ్ర శాఖ తరపున కవిగారు చాల ప్రధానపాత్ర వహించారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని, ఆరునెలలు కారాగార శిక్ష అనుభవించారు. 1932లో శాసనోల్లంఘన కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఒక సంవత్సరం వీటికి కఠిన కారాగార శిక్ష విధించ బడింది. మహోద్యమంవంటి రామచంద్ర కవిగారు 1951లో పరమ పదించారు.





