ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాన్య, అసామాన్యులు – 43 ; ‘జెండావీరుడు’ తోట నరసయ్య

369views

శ్రీ తోట నరసయ్య కృష్ణాజిల్లా, చల్లపల్లి మండలం, పాగోలు గ్రామంలో 1899వ సం॥లో జన్మించారు. చిన్నతనం నుండే విశాల భావాలు కలిగి స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని కలిగి అత్యంత సాహసోపేతమైన వ్యక్తిగా తనకంటూ ఒక ప్రత్యేకతను ఆపాదించుకున్నారు. తన తండ్రి వృత్తి రీత్యా డ్రైవరు మరియు కుస్తీ వస్తాదు. తండ్రి ప్రభావంతో ఆ వీరోచితమైన భావాలు, చిన్ననాటినుండి – ఆయనలో ప్రస్ఫుటంగా మనకు గోచరిస్తూ వస్తున్నాయి. శ్రీ తోటనరసయ్య చూపిన అనుపమాన ధైర్య సాహసాలు స్వాతంత్ర్యోద్యమస్ఫూర్తికి ఊపిరిపోసిందని చెప్పవచ్చు.బ్రిటిష్ వారిని ఎదిరించడంలో వారు చూపిన ధైర్య సాహసాలు భరతజాతికి వన్నె తెచ్చినాయి.

అది 1930వ సంవత్సరం. స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా ఉప్పు సత్యాగ్రహం ముమ్మరంగా జరుగుతున్న రోజులవి. ఉప్పుసత్యాగ్రహ శిబిరం ఎంతో స్ఫూర్తితో బ్రిటీష్ వారిని ఎదిరించే ధైర్యంతో స్వచ్చందంగా కార్యకర్తలు పాల్గొంటున్నారు. ఆరోజు మే నెల 6వ తేది. తెలతెలవారకముందే గాంధీజీ అరెస్టు వార్త యావత్ భారతదేశము నలువైపులా వ్యాపించింది. చర్కా సంఘ ఆవరణలో ఉత్సాహంగా శాంతియుతంగా నిర్వహించబడుతున్న శిబిరం ఈ వార్తతో వేడెక్కింది. గోరుచుట్టు పై రోకటి పోటు అన్నట్లుగా మరొక వార్త వీరందరినీ ఆందోళణకు గురిచేసింది. శ్రీ తత్యానంద స్వామి గారిచే (పూర్వాశ్రమంలో కొండిపర్తి వీరభద్రాచార్యులు గారు) బందరు కోనేటి స్తంభం పై ప్రతిష్టించిన కాంగ్రెస్ జెండాను పోలీసులు విరిచివేశారన్న వార్త చేరడంతో అక్కడి వాతావరణం ఉద్విగ్నభరితంగా రూపొందింది.

స్వాతంత్ర్యోద్యమ నినాదాలతో ఊరేగింపు కోనేరు సెంటరుకు చేరింది. అప్పుడు తత్త్యానందస్వామి గారిచే తిరిగి జండాను ప్రతిష్టింపచేయడానికి సత్యాగ్రహులు ప్రయత్నించారు. కానీ పోలీసులు స్వామివారి చేతిలోని జండాను లాగి క్రిందపారవేసి స్వామీజీను క్రిందకు పడద్రోసారు. వెంటనే సత్యాగ్రహులకు పోలీసువారికి పోరాహోరీగా పెనుగులాట ప్రారంభమైంది. ఏమైనా సరే జండా కట్టి తీరాలని సత్యాగ్రహులు, కట్టకూడదని పోలీసులు ఎవరి శక్త్యానుసారము వారు పోరాటాన్ని సాగిస్తూ వచ్చారు. ఈ సందర్భంలో పోలీసులు అత్యంత పాశవికంగా లాఠీ ఛార్జీని గావించి కార్యకర్తలను, సత్యాగ్రహులను రోడ్ల మీద విచక్షణా రహితంగా కొట్టనారంభించారు.

పోలీసువారికి సత్యాగ్రహులకు జరుగుతున్న పోరాటాన్ని ఎంతో గమనిస్తున్న శ్రీ తోట నరసయ్య నాయుడు గారు అమాంతము ముందుకు దూకి అత్యంత ధైర్యసాహసాలతో జెండాను పట్టుకుని ఆ జెండాను ఎగురవేసే ప్రయత్నాన్ని ప్రారంభించారు. అప్పుడు ఆ ఒక్క నరసయ్య నాయుడుపై 15 మంది పోలీసులు లాఠీలతో దాడిచేసి చావమోదుతున్నప్పటికినీ పరుగులతో జెండా స్థంబం పైకి ఎక్కే ప్రయత్నాన్ని గావిస్తూ వచ్చారు. స్థంభాన్ని ఎక్కుతుండగా పోలీసులు అత్యంత కర్కశంగా లాఠీ ప్రయోగం చేస్తుండగా రక్తం చిందిస్తూ కూడా తనపట్టును వదలక నలభై ఐదు నిమిషాలపాటు స్థంభాన్ని కౌగలించుకొని జండాను ప్రతిష్ఠించే ” ప్రయత్నంలో పోలీసుల లాఠీల దెబ్బలకు స్పృహ తప్పి క్రిందకు పడిపోయారు.

పోలీసువారి పాశవికతకు అంతులేక స్పృహతప్పిన నరసయ్య నాయుడిని ఇంకా చావబాదుతుండగా అక్కడ ఉన్న నరసయ్య నాయుడు శిష్యులు, సత్యాగ్రహులు, వస్తాదులు, వాలంటీర్లు నరసయ్య నాయుడును రక్షించుటకు ముందుకు దుమికారు. వారిని సైతం పోలీసులు విడువలేదు. శరీరం రక్తం కారుతుండగా ఆ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొంటున్న డా॥ కోకా చలపతిరావు గారు నరసయ్య నాయుడు గారికి ప్రథమ చికిత్సకు పూనుకోగా ఆ డాక్టరును సైతం పోలీసులు వదలలేదు. అక్కడ ఆ ఉద్విగ్న వాతావరణము స్వాతంత్య్ర నినాదాలతో హోరెత్తగా పోలీసు ఇన్స్పెక్టరు “ఆ గొడ్డును ఈడ్చివేయండి” అని ఆదేశించగా పోలీసులు నరసయ్యగారిని అత్యంత పాశవికంగా ఈడ్చివేస్తున్నారు. అప్పుడు వాలెంటీర్లు ఒక మంచాన్ని పట్టుకుని వచ్చి నరసయ్య నాయుడు గారిని తీసుకువెళ్ళే ప్రయత్నం ప్రారంభించారు. ఆ సందర్భంలో స్పృహనుండి మేలుకొని వచ్చిన నరసయ్య నాయుడు మంచం మీదనుండి దుమికి మళ్ళీ జెండా ఎగురవేసే ప్రయత్నాన్ని ప్రారంభించారు. ఆయన జెండా స్థంభమువైపు పరుగులు పెడుతుంటే పోలీసు ముష్కరులు మరల ఆయన పై లారీ ప్రయోగాన్ని ప్రారంభించారు. గొప్ప ధైర్యంతో స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో పట్టువదలని విక్రమార్కుడిలా స్వాతంత్య్ర నినాదాలను చేస్తూ “మహాత్మా నీవేగతి”అంటూ ముందుకు ఉరుకుతున్న శ్రీ నరసయ్యను పోలీసులు అడగించినప్పటికినీ తన ప్రయత్నాన్ని మానలేదు.

త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయటంలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన తోట నరసయ్య నాయుడు గారు జెండా వీరుడుగా గణుతికెక్కారు. ఆ తరువాత ఆయన మున్సిపల్ కార్యాలయంపై జెండా ఎగురవేయగా ఆయనను పోలీసు వారు అరెస్టు చేసి రాత్రికి రాత్రే విచారణను జరిపి 18 నెలల కఠిన కారాగార శిక్షను విధించి వీరిని రాజమండ్రి, కోరాపుట్ జైళ్ళలో బ్రిటిష్ ప్రభుత్వం ఉంచడం జరిగింది. మద్యపాన నిషేధం కొరకు, హరిజనోద్ధరణ కొరకు అనేకవిధాల కృషి చేశారు. మోటారు కార్మిక సంఘాన్ని స్థాపించి యుద్ధకాలంలో పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహించారు. దీనిలో భాగంగా ప్రజలకు తక్కువధరకు బియ్యాన్ని అందించడంలో ప్రభుత్వంతో పోరాడి చివరకు కృతకృత్యులయ్యారు.

శ్రీ తోట నరసయ్య నాయుడుగారు 1964 సెప్టెంబరు 12వ తేదీన కీర్తిశేషులైనారు.