News

తన్మయ భరితం కూచిపూడి నాట్యం

225views

నాట్యాచార్యుల ఇలవేలుపు శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత రామలింగేశ్వరస్వామివార్ల 261 వార్షిక కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని నాట్యక్షేత్రం కూచిపూడిలో గురువారం నిర్వహించిన కూచిపూడి నాట్యాంశాలు ఆలరించాయి. శ్రీ సిద్ధేంద్రయోగి కళావేదికపై కూచిపూడి, మచిలీపట్నం, విశాఖపట్నంకు చెందిన కళాకారులు హావ, భావ, పద విన్యాసాలతో ప్రదర్శించిన నృత్యాలతో సభికులు భక్తి భావంలో తన్మయం పొందారు.

కూచిపూడి గ్రామానికిచెందిన నాట్యాచార్యులు డాక్టర్‌ చింతా రవి బాలకృష్ణ శిష్య బృందం డి.వర్షిత వర్మ, ఎంహెచ్‌వీ సాయి భవ్య, పి.రుశాలి, ఎల్‌.సుస్మిత, ఈశ్వరి గోవర్ధన గిరిధార.. దశావతార శబ్ధం.. జణుత శబ్ధం, నమో నమో రఘుకుల నాయక… శివ తాండవాలకు నర్తించి ప్రదర్శనకు వన్నె తీసుకొచ్చారు. అలాగే విశాఖపట్నంకు చెందిన కూచిపూడి కళాక్షేత్రం నుంచి ఇరుగు మంజూష వినాయక కీర్తన, అన్నమాచార్య కీర్తనలకు నర్తించి భక్తిభావాన్ని పెంపొందించింది.