News

మనిషి జీవనంలో ప్రతి గమనాన్ని రామాయణం సూచిస్తుంది

255views

విజయనగరంలోని నాగవంశం వీధిలో వేంచేసి ఉన్న సీతారామచంద్ర ఆలయాన్ని అహోబిలం జియర్‌ స్వామి బుధవారం ప్రారంభించారు. ఈ మేరకు ఆయనకు పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. ఆలయ ప్రారంభానికి ముందు డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం అహోబిలం జియర్‌ స్వామి భక్తులను ఉద్దేశించి అభిభాషణ చేశారు. గుడిలో ఉన్న రాముడిని ప్రతి ఒక్కరూ గుండెల్లో పెట్టుకోవాలని హితబోధ చేశారు. మనిషి జీవనంలో ప్రతి గమనాన్ని రామాయణం సూచిస్తుందని చెప్పారు. అందువల్ల ప్రతి వ్యక్తిలో రాముడు ఉంటాడని, రాముడి వలె నడుచుకోవాల్సిన అవసరం అందరికీ ఉందన్నారు. ప్రతి గ్రామంలో రామాలయం ఉండాలని పూర్వీకులు చెబుతూ ఉంటారని గుర్తు చేశారు. రామతత్వం తెలిసినవారు రాముని సుగుణాలు కలిగి ఉంటారన్నారు. నాగవంశం వీధిలో పురాతన ఆలయంగా ఉన్న రామాలయాన్ని జీర్ణోద్ధరించడం సంతోషంగా ఉందన్నారు. రామాలయాన్ని నిర్మించడమే కాకుండా ప్రతిరోజూ రామదర్శనాన్ని చేసుకోవాలని భక్తులకు సూచించారు. డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి మాట్లాడుతూ పురాతన రామాలయం శిథిలావస్థకు చేరడంతో స్థానికుల విజ్ఞప్తి మేరకు దేవాదాయ శాఖ నుంచి రూ.40 లక్షల నిధుల మంజూరుకు కృషి చేశానని, తనతో (రూ.లక్ష విరాళం) పాటు స్థానికులు రూ.10 లక్షలు సమకూర్చడంతో ఆలయ నిర్మాణం పూర్తయిందని కోలగట్ల వీరభద్ర స్వామి చెప్పారు.