News

ఆధ్యాత్మిక సంస్కృతి, సంప్రదాయాలు దేశప్రజలందరికీ గర్వకారణం

371views

దేశ ఆధ్యాత్మిక సంస్కృతి, సంప్రదాయాలు ప్రజలందరికీ గర్వకారణమని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్కొన్నారు.గుంటూరు జిల్లాలోని రాజధాని గ్రామం నెక్కల్లు వద్ద నిర్మించిన ‘బ్రహ్మకుమారీస్‌ యూనివర్సల్‌ పీస్‌ రిట్రీట్‌ సెంటర్‌’లో ఆదివారం ఉదయం 88వ శివ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆమె ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ తల్లిదండ్రులే తనకు ప్రథమ ఆధ్యాత్మిక గురువులని పేర్కొన్నారు. తన తండ్రి ఎన్‌టీఆర్‌ను ‘మీరు రాముడు, కృష్ణుడిగా తెరపై కనిపిస్తున్నారు. వేంకటేశ్వరుడు, శివుడిని పూజిస్తున్నారు. అసలు 33 కోట్ల మంది దేవతల్లో ఎవరిని ఆరాధించాలి’ అని అడిగితే.. గోడ మీద ఒక చిన్న బింధువు గీచి ఏకాగ్రచిత్తంతో దాన్నే ఆరాధించినా దైవానుగ్రహం పొందవచ్చనని సమాధానమిచ్చారని గుర్తు చేసుకున్నారు. ఆధ్యాత్మిక వ్యక్తుల మధ్య ఉన్నప్పటికీ పుణ్యఫలం దక్కుతుందని తన తల్లి చెబుతుండేవారన్నారు. కులం, మతం నుంచి బయటపడినప్పుడే మానవులు దైవం వైపు పయనిస్తారన్నారు. బ్రహ్మకుమారీస్‌ సంస్థల సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. అనంతరం శివ పరమాత్మ మహాత్యం, శివరాత్రి విశిష్టతను బ్రహ్మకుమారీలు వివరించారు. చిన్నారుల భరత నాట్య ప్రదర్శన అలరించింది. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి రాజయోగిని సవిత దీదీ, శాంత దీదీ, పరిపూర్ణానంద చైతన్య స్వామి, భాజపా రాష్ట్ర మీడియా ఇన్‌ఛార్జి పాతూరి నాగభూషణం, మహిళలు తదితరులు పాల్గొన్నారు.