News

ఓ ‘జ్ఞాపకం’ శిథిలమవుతోంది..

252views

పురాతన కట్టడాలు గొప్ప సంపదలు.. వాటిని మనం కాపాడుకోవాలి.. బాగుచేసి భవిష్యత్తు తరాలకు బహుమతిగా అందించాలి. పాత తరానికి నేటి తరానికి వారధిలా ఉండే ఆ కట్టడాల పట్ల నిర్లక్ష్యం తగదు. విశాఖ తాజ్‌మహల్‌గా చెప్పుకునే బీచ్‌రోడ్డులోని కురుపాం టూంబ్‌ అలాంటి నిర్లక్ష్యానికే గురవుతోంది.

బీచ్‌రోడ్డులో పెదజాలారిపేట కూడలి సమీపంలో ఉండే కురుపాం టూంబ్‌ను విశాఖ తాజ్‌మహల్‌గా పిలుచుకుంటారు. రాజా వీరభద్ర బహుదూర్‌ తన భార్య మరణానంతరం ఆమె జ్ఞాపకార్థం లక్ష్మీనరసాయమ్మ పేరున గోపురాన్ని నిర్మించారు. 115 సంవత్సరాల కిందట ఈ నిర్మాణం జరిగింది. దీనికి జ్ఞానవిలాస్‌ అని పేరుపెట్టారు. 30 అడుగు ఎత్తున గోపురం నిర్మించి అందులో నరసాయమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇండోఇస్లామిక్‌ శైలిలో దీనిని నిర్మించారు. బెంగాల్‌, ఒడిశా ప్రాంతాలకు చెందిన కళాకారులు దీనిని నిర్మించారని చెపుతారు.

గతమెంతో ఘనం..: గతమెంతో ఘనమన్నట్లు బీచ్‌రోడ్డును సందర్శించిన వారు ఇక్కడకు రాకుండా వెళ్లేవారు కాదు. పలు సినిమాల చిత్రీకరణలు కూడా అక్కడ జరిగాయి. 2004లో అప్పటి జిల్లా పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌, కలెక్టర్‌ సునీల్‌శర్మ కురుపాం టూంబ్‌ను రూ.20 లక్షల నిధులతో ఇండియన్‌ నేషనల్‌ ట్రస్ట్‌ ఫర్‌ ఆర్ట్ట్‌, కల్చర్‌ అండ్‌ హెరిటేజ్‌ (ఇంటాక్‌) సహకారంతో అభివృద్ధి చేశారు. పర్యాటకుల కోసం చుట్టుపక్కల కుర్చీలు, బల్లలు ఏర్పాటు చేశారు. ఆ ముచ్చట కొద్దిరోజులకే మాయమైంది.

నేడంతా శిథిలం..: నేడు ఆ టూంబ్‌ శిథిలావస్థకు చేరుకుని ఉంది. పర్యాటకులకు దూరమైంది. చెట్లు, పుట్టలు పెరిగి ఓ నిర్మానుష్య ప్రాంతంగా మారింది. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డా అయ్యింది. ప్రహరీ కూడా శిథిలావస్థకు చేరుకుంది. కొందరు ఇక్కడ మత్తుపదార్థాలు వాడుతూ పట్టుబడిన సందర్భాలూ లేకపోలేదు. పర్యాటక ప్రాంతంగా ఈ కట్టడానికి పూర్వవైభవం తీసుకురావడానికి అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.