News

వేద గడియారంపై సైబర్ దాడి.. ప్రారంభోత్సవం వాయిదా

186views

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో నిర్మించిన మహారాజా విక్రమాదిత్య శోధపీఠ్ సాంస్కృతిక శాఖకు చెందిన విక్రమాదిత్య వేద ఘడి యాప్ ఆవిష్కరణ ప్రస్తుతానికి వాయిదా పడింది.
ఇలా ప్రారంభోత్సవం వాయిదా పడడానికి కారణం సైబర్ దాడి అని తెలుస్తోంది. ఈ వేద గడియారం యాప్‌ను మహాశివరాత్రి రోజున ప్రారంభించాల్సి ఉంది.. అయితే ఈ సైబర్ దాడి అనంతరం ప్రారంభం ఒక నెల ఆలస్యం అయింది. అయితే మళ్ళీ ఈ వేద గడియారాన్ని గుడి పడ్వా రోజున ( అంటే మన తెలుగు వారు జరుపుకునే ఉగాది) యాప్‌ను ప్రారంభించవచ్చని అంచనా వేస్తున్నారు.

సమాచారం ప్రకారం ఫిబ్రవరి 29 న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉజ్జయినిలో ఏర్పాటు చేసిన వేద గడియారాన్ని వాస్తవంగా ప్రారంభించారు. ఈ సమయంలో వేద క్యాలెండర్‌ను సమయంతో చూపే ఈ గడియారాన్ని ప్రధాని మోడీ కూడా ప్రశంసించారు. అయితే గురువారం రాత్రి ఈ వేద గడియారం సర్వర్‌పై దాడి జరగడం అందరినీ కలిచివేసింది. వెబ్‌సైట్‌పై సైబర్ దాడి జరిగిన అనంతరం కొత్త వినియోగదారులు వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయలేరు.

విక్రమాదిత్య రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ శ్రీరామ్ తివారీ మాట్లాడుతూ.. వేద గడియారం సర్వర్‌పై సైబర్ దాడి జరిగిందని.. దీంతో వెబ్‌సైట్‌లోని డేటా క్రమంగా అదృశ్యమైందని అన్నారు. ప్రస్తుతం వెబ్‌సైట్ ఓపెన్ అవుతోంది కానీ అందులోని డేటా పూర్తిగా లేదు. స్థానిక సర్వర్‌పై ఈ దాడి జరిగిందని అందువల్ల సర్వర్ డేటాకు పెద్దగా నష్టం లేదని ఆయన చెప్పారు. అదే సమయంలో వేద గడియారం పూర్తిగా సురక్షితం అని ఆయన స్పష్టం చేశారు.

వేద గడియారం డేటాను సేవ్ చేయడంలో తమ బృందం విజయవంతమైందని శ్రీరామ్ తివారీ చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదైంది. ఈ వేద గడియారాన్ని మహా శివరాత్రి నాడు ప్రారంభించాలన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సైబర్ దాడి తర్వాత, లాంచింగ్ ప్రస్తుతానికి నిలిపివేశారు. ఈ మొత్తం విషయంలో వేదిక గడియారం సృష్టికర్త ఆరోహ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, సైబర్ దాడి రెండు కారణాల వల్ల చేయవచ్చు.. మొదట పేరు చెడగొట్టడానికి.. రెండవది పోటీ కోసం అని అన్నారు. అయితే దాడి చేసిన వ్యక్తి అంతకు ముందు మిలియన్ల కొద్దీ బాట్‌లను విడుదల చేశాడు, దీని కారణంగా సర్వర్ స్లో అయింది. కొత్త వినియోగదారులు ప్రస్తుతం డిస్ ప్లేను చూడలేకపోతున్నారని తెలిపారు.