ArticlesNews

పరమాత్మ స్వరూపులు అవధూత శ్రీ వెంకయ్య స్వామి

320views

(మార్చి 11 – శ్రీ వెంకయ్య స్వామి జయంతి)
భారతీయ ఆధ్యాత్మికత చాలా గొప్పది. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎందరో గొప్పవారున్నారు. వారిలో సిద్ధులు, గురువులు, అవధూతలు ఉన్నారు. దత్తాత్రేయ స్వామిని అవధూతల పరంపరలో మొదటివానిగా చెప్పవచ్చు. ఈ కోవకి చెందిన అవధూతలే షిర్డీ సాయిబాబా, భగవాన్ రమణ మహర్షి, అక్కల కోట మహారాజ్, చీరాల స్వామి మొదలైనవారు. వారి కోవకు చెందిన మరొకరే మన తెలుగు ప్రాంతానికి చెందిన అవధూత వెంకయ్య స్వామి. చీటీల స్వామిగా పిలవబడే ఈయన పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో గొలగమూడిలో ప్రసిద్ధ క్షేత్రంలో కొలువై ఉన్నారు.

అవధూత వెంకయ్యస్వామి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకా నాగుల వెల్లటూరు అనే గ్రామంలో సోంపల్లి పెంచలయ్య, పిచ్చమ్మ అనే పుణ్యదంపతులకు 1887 మార్చ్ 11న జన్మించారు. వారిది నిరుపేద కుటుంబం కావడంతో వెంకయ్యస్వామి చిన్నతనంలో కుటుంబపోషణ కోసం కూలిపనులకు వెళ్లేవారు. దయ, కరుణలతో ఉంటూ పశుపక్ష్యాదుల పట్ల ప్రేమ చూపుతుండేవారు. యుక్తవయస్సులో ఉన్నప్పుడు ఒకసారి తీవ్రజ్వరం రావడంతో స్వామి సమీపంలోని అడవికి వెళ్లిపోయారు. ఎప్పుడైనా ఊళ్లోకి రావడం, మిగిలిన సమయం అడవుల్లో ఉంటుండడంతో వెంకయ్యస్వామికి మతిభ్రమించిందని భావించేవారు. అలా కాలక్రమంలో పెంచలకోన, తిరుపతి, శ్రీశైలం అడవుల్లో యోగసాధన చేశారు. పెంచలకోన అడవుల్లో స్వామివారికి కణ్వమహర్షి అనుగ్రహం లభించిందని చెబుతారు.

వెంకయ్యస్వామి తన జీవితాన్ని ఎంతో నిరాడంబరంగా గడిపారు. సాధారణ మనుషుల్లాగే ఉండేవారు. ఎప్పుడూ ఆడంబరాలకు పోలేదు. ఆయన కోసం ఎవరైనా ఏదైనా తీసుకొనివెళితే దాన్ని అందరికీ పంచి, చీమలకు కొద్దిగా వేసి తాను మిగిలింది తినేవారు. గడ్డిమీద చాప వేసుకొని దాని మీద గోనె సంచిపట్ట వేసుకొని పడుకునేవారు. వెంకయ్యస్వామి 1984 ఆగస్ట్ 24న మహాసమాధి చెందారు. సమాధి చెందేముందు ఆయన మూడు మాటలు చెప్పారు. అవి సంపన్నత్వం, సాధారణతత్వం, సద్గురు సేవ. సంపన్నత్వం అంటే డబ్బు సంపాదించి ఐశ్వర్యవంతులు కావాలని కాదు. సంపన్నత్వం అంటే దైవీ సంపద అని అర్థం. ప్రతి మనిషి మొదట దైవీ సంపద సాధించాలి. నిర్భయం, సాత్విక చిత్త శుద్ధి, జ్ఞాన యోగంలో స్థిరత్వం, దానం, ఇంద్రియ నిగ్రహం, ఆత్మ విచారం, తపస్సు, అహింస, క్రోధం లేక పోవుట, ఇంద్రియ విషయాలపై వ్యామోహము లేకపోవుట ..ఇవన్నీ దైవీ సంపద వల్ల కలుగుతాయి. అదే సంపన్నత్వం అంటే. ఇక రెండవది సాధారణత్వం. దైవీ సంపద సాధించిన తర్వాత సాధకులకు గర్వం ఉండకూడదు. సాధించినవి అతనికి సాధారణమవ్వాలి. నేర్చినది హృదయములో ధారణ చేస్తూ ఉండాలి. ఇక మూడవది సద్గురు సేవ. ప్రతి ఒక్కరికి గురువు అనేవారు ఉంటే ఎంత గొప్ప మార్గమైనా ప్రవేశించేందుకు సాధ్యపడడమే కాదు సులభతరం కూడా అవుతుంది. గీతలో చెప్పింది కూడా ఇదే.

వెంకయ్యస్వామి ఎల్లప్పుడూ తంబూరా మీటుతూ ‘ఓం నారాయణ, ఆది నారాయణ’ అంటూ మధురముగా పాడుతుండేవారు. ఆయన బోధనలు చాలా సులువైన భాషల్లో ఉన్నా లోతైన తత్త్వాన్ని వివరిస్తాయి. ‘ఆకలై కొంగు పట్టేవారికి అన్నం పెట్టాలయ్యా’, ‘సన్యాసులుగా ధర్మం ఉండటంలో గొప్పేముందయ్యా, సంసారంలో ధర్మంగా ఉండటమే గొప్ప’, ‘అందరినీ సమానంగా చూడగలిగినప్పుడు..నీవు దేవుడిని చూడగలవు కదయ్యా’, ‘పావలా దొంగలిస్తే, పది రూకల నష్టం వస్తుంది గదయ్యా’..ఈ విధంగా ఉండేవి ఆయన బోధనలు. భగవాన్ వెంకయ్యస్వామి వారి లీలలు, వారి సూక్తులు, వారి చరిత్ర అపూర్వం. ఆయన మహాసమాధి చెందిన గొలగమూడి ఆశ్రమంలో ప్రతి శనివారం విశేష పూజలు జరుగుతాయి. ఆయన పేరిట నిత్యాన్నదానంతో పాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆగస్టు మాసంలో నిర్వహించే ఆరాధన ఉత్సవాలకు పొరుగు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు హాజరవుతారు. స్వామి పిలిచినవారికి పలికే దైవం..కొలిచిన వారికి కొంగు బంగారు.