News

దుర్గమ్మకు సారస్వత నీరాజనం

251views

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు ‘శ్రీ దుర్గా సౌందర్యలహరి మహాశతావధానం‘ పేరుతో సారస్వత నీరాజనాన్ని పలికారు. ఐదు రోజుల పాటు స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన మహాశతావధానంలో డాక్టర్‌ మాడుగుల నాగఫణిశర్మ తన అద్భుత సాహితీ పటిమతో సాహితీ అభిమానులను రంజింపజేశారు. దేవదాయ, ధర్మదాయ శాఖ, శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమం శుక్రవారం రాత్రితో ముగిసింది. అమ్మవారికి వివిధ పద్యాలతో కూడిన అవధానంతో అక్షరయాగాన్ని విజయవంతంగా నిర్వహించారు. డాక్టర్‌ మాడుగుల నాగఫణిశర్మ కొండపైన కొలువున్న దుర్గామల్లేశ్వర్లును తన పద్యాలతో కీర్తించి అందరినీ మెప్పించారు. ఒకవైపు ఆధ్యాత్మిక పదాలను వినిపిస్తూనే ప్రజలకు పలు సామాజిక అంశాలపై స్పృహను పెంపొందించే దిశగా తన అవధానాన్ని కొనసాగించారు. రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన సాహితీవేత్తలు పృచ్ఛకులుగా దత్తపదులు, సమస్యాపురాణం, వర్ణనలు, అశువులు, అప్రస్తుత ప్రసంగం వంటి పేర్లతో అవధానిగా ఉన్న డాక్టర్‌ మాడుగుల నాగఫణిశర్మకు పలు అంశాలను సంధిస్తే ఆయన పూరణ చేసిఅందరినీ అబ్బురపరిచారు. సుమారు 65 సంవత్సరాల వయస్సులో ఐదు రోజుల పాటు అవదానం కొనసాగించటం చాలా కష్టమని దానిని అద్భుతంగా కొనసాగించారని పలువురు ప్రముఖులు ఆయనను కొనియాడారు. ఈ సందర్భంగా ఆలయ, వివిధ సంస్థల పక్షాన మాడుగుల నాగఫణిశర్మ దంపతులను సత్కరించారు. కార్యక్రమాలను ఆలయ చైర్మన్‌ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి కేఎస్‌ రామారావు పర్యవేక్షించారు.

అవధాన ప్రక్రియకు స్వర్ణ యుగం
‘శ్రీ దుర్గా సౌందర్యలహరి మహాశతావధానం‘ వంటి కార్యక్రమాల ద్వారా అవధాన ప్రక్రియకు మళ్లీ స్వర్ణయుగం వస్తుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు. దుర్గాప్రసాదరావు అన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్‌ దుర్గాప్రసాదరావు మాట్లాడుతూ అవధానం, పద్యాలు తెలుగు జాతికి అత్యంత ఖ్యాతిని ఆర్జించిపెట్టే గొప్ప ప్రక్రియలన్నారు. వాటిని దేవాలయాలు ఈ అధునాతన కాలంలో సౌందర్యలహరీ మహా శతావధానం వంటి కార్యక్రమాల ద్వారా పరిరక్షించే ప్రయత్నం చేయటం హర్షణీయమని చెప్పారు. ప్రభుత్వం అవధాని ప్రక్రియ పరిరక్షణ, శిక్షణ నిమిత్తం విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆయన ఆకాంక్షించారు.

సాహితీ సాంస్కృతిక రాజధాని విజయవాడ
విజయవాడ సాహితీ, సాంస్కృతిక రాజధానిగా తన పేరును మరోసారి సార్ధకం చేసుకుందని డాక్టర్‌ మాడుగుల నాగఫణిశర్మ అన్నారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు. అమ్మ వారి ఆలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంతో తన జన్మ ధన్యం అయిందన్నారు. అలాగే ఆలయ పాలకవర్గాన్ని, అధికారులను అభినందించారు.