News

చందమామపై నిద్రాణ స్థితిలోకి అమెరికా ల్యాండర్‌

250views

చందమామపై పరిశోధనలు చేస్తున్న అమెరికా ల్యాండర్‌ ‘ఒడిసియస్‌’.. నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోయింది. తాజాగా అక్కడ రాత్రివేళ కావడంతో బ్యాటరీల ఛార్జింగ్‌కు సౌరశక్తి అందుబాటులో ఉండదు. దీనికితోడు తీవ్ర శీతల వాతావరణం నెలకొంటుంది. దీంతో ఇంజినీర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యోమనౌక.. దాదాపు వారం కిందట చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలోని ప్రాంతంలో దిగిన సంగతి తెలిసిందే. ప్రతికూల పరిస్థితులను తట్టుకొని నిలబడితే రెండు నుంచి మూడు వారాల తర్వాత ఈ వ్యోమనౌక మళ్లీ క్రియాశీలమవుతుంది. ల్యాండింగ్‌ సమయంలో ఒడిసియస్‌ కాలు విరగడంతో అది ఒకపక్కకు ఒరిగిపోయింది. దీంతో సౌరశక్తి లభ్యత, కమ్యూనికేషన్‌లో ఇబ్బందులు తలెత్తాయి. అయినా ఈ వ్యోమనౌక తమ అంచనాలకు మించి పనిచేసిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ అనే సంస్థ దీన్ని రూపొందించింది. చందమామపై దిగిన తొలి ప్రైవేటు వ్యోమనౌక ఇదే.