News

విజయవాడ దుర్గగుడి పాతమెట్ల మార్గం పునరుద్ధరణ

313views

శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పాత మెట్ల మార్గాన్ని లాంఛనంగా పునఃప్రారంభించారు. దుర్గగుడి ట్రస్టుబోర్డు ఛైర్మన్ రాంబాబు, ఈవో రామారావు సమక్షంలో వైదిక కమిటీ సభ్యులు పూజా కార్యక్రమం నిర్వహించారు. 2016 కృష్ణా పుష్కరాలను పురస్క రించుకొని ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలుగా కనక దుర్గానగర్ విస్తరణ ప్రారంభించారు. పాత గోశాలను తొలగించారు. క్షేత్ర పాలక ఆంజనేయ స్వామి ఆలయం, ఇంద్రకీలాద్రిపై పాత అన్నదాన భవనం, ప్రసాదాల పోటు, దుర్గగుడి ఉద్యోగుల కార్యాలయం, భవానీ దీక్షా మండపాలు తొలగించారు. అప్పటి నుంచి దుర్గగుడి పాతమెట్ల మార్గం మూసివేశారు. జగన్మాత దుర్గమ్మ ప్రతిరోజు అర్ధరాత్రి దాటిన తరువాత పాతమెట్ల మార్గంలో నగర సంచారం చేసి వేకువ జామున తన కోవెలకు చేరతారని భక్తుల విశ్వాసం. పాత మెట్లకు భక్తులు నిత్యం మెట్ల పూజ చేస్తారు. మరోవైపు సీతమ్మ వారి పాదాల సెంటరు సమీపంలోని దక్షిణ ముఖ ఆంజనేయస్వామి ఆలయాన్ని పునరుద్ధరించారు. కార్యక్రమంలో స్థానాచార్య శివప్రసాద శర్మ, ఈఈ రమాదేవి, ఏఈవో రమేష్ వైదిక కమిటీ సభ్యులు యజ్ఞనారాయణ శర్మ పాల్గొన్నారు.