
భారత్ నుంచి దాదాపు 100 మంది యువకులను మోసపూరితంగా రష్యాకు తరలించి ఉక్రెయిన్‌తో యుద్ధంలోకి దింపారన్న వార్తలపై మన ప్రభుత్వం స్పందించింది. శుక్రవారం విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. కొందరు భారతీయులు అక్కడి సైనికులకు సహాయకులుగా ఉండేందుకు అంగీకరిస్తూ కాంట్రాక్టులపై సంతకాలు చేసినట్లు తెలిసిందన్నారు. ఈవిషయంపై తాము మాస్కోతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. అక్కడ పనిచేస్తున్న భారతీయులను విడుదల చేయించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. ఆ సమయంలో భారతీయులు ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి దూరంగా ఉండాలని కోరుతున్నట్లు జైస్వాల్ చెప్పారు.
మీడియా కథనాల ప్రకారం ప్రస్తుతం అక్కడ చిక్కుకుపోయిన భారతీయులు మరియుపోల్, ఖర్కీవ్, రోస్తోవ్ ఆన్ డావ్ వంటి చోట్ల ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో కొందరు యుద్ధంలో గాయపడినట్లు వార్తలొస్తున్నాయి. ఈ అంశంపై కర్ణాటక కాంగ్రెస్ మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందిస్తూ వీరందరినీ కొందరు దళారులు అక్కడికి పంపారని తెలిపారు. వాగ్నర్ కిరాయి సైన్యంలో ఈ యువకులను చేర్చారని చెప్పారు.
మన పొరుగు దేశమైన నేపాల్ నుంచి కూడా భారీసంఖ్యలో యువకులు రష్యాకు వెళ్లి సైన్యంలో చేరారు. వీరి సంఖ్య 200కు పైగానే ఉంటుంది. ఆరుగురు నేపాలీలు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. తమ పౌరులను సైన్యంలో చేర్చుకోవద్దని ఇప్పటికే నేపాల్ ప్రభుత్వం మాస్కోకు విజ్ఞప్తి చేసింది.





